వినియోగంలోకి పోస్టుమెట్రిక్ వసతి గృహ భవనం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:46 AM
గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కాకరపాడు పోస్టుమెట్రిక్ వసతి గృహ భవనం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది.
- రూ.15 లక్షలతో ఆధునికీకరించి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్పు
కొయ్యూరు, ఆగస్ట్టు 25 (ఆంధ్రజ్యోతి): గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కాకరపాడు పోస్టుమెట్రిక్ వసతి గృహ భవనం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ చొరవతో ఈ భవనాన్ని రూ.15 లక్షలతో ఆధునికీకరించి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చి గిరిజన నిరుద్యోగ యువతకు సోమవారం నుంచి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో శిక్షణ ఇస్తున్నారు.
కాకరపాడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినుల కోసం రూ.2 కోట్లతో నిర్మించిన పోస్టుమెట్రిక్ వసతి గృహం నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘వసతి గృహాన్ని వదిలేశారా?’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించారు. మండల పర్యటనలో భాగంగా ఐటీడీఏ పీవో ఈ భవనాన్ని పరిశీలించి వృత్తి నైపుణ్య శిక్షణకు అన్ని విధాల అనుకూలమని భావించారు. దీని ఆధునికీకరణకు రూ.15 లక్షలు మంజూరు చేసి వేగంగా పనులు పూర్తి చేయించారు. ఇందులో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ భవనం వినియోగంలోకి రావడంతో పాటు గిరిజన యువతకు ఏఐపై శిక్షణ ఇస్తుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.