Share News

కాసులిస్తే కావలసిన చోటకు పోస్టింగ్‌

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:26 PM

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమ డిప్యుటేషన్లు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాసులిస్తే నచ్చిన చోటకు పోస్టింగ్‌ వేయించుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

కాసులిస్తే కావలసిన చోటకు పోస్టింగ్‌
ఎన్టీఆర్‌ ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం

వైద్య ఆరోగ్య శాఖలో అక్రమ డిప్యుటేషన్లు

జిల్లాలు దాటి పోస్టింగులు తెచ్చుకుంటున్న వైనం

కొందరు ఏళ్ల తరబడిగా ఒకేచోట తిష్ఠ

డీఎంహెచ్‌వో కార్యాలయంలో అధికారుల చేతివాటం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమ డిప్యుటేషన్లు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాసులిస్తే నచ్చిన చోటకు పోస్టింగ్‌ వేయించుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. కొందరు ఇతర జిల్లాల నుంచి అడ్డదారుల్లో డిప్యుటేషన్లపై వస్తే, మరికొందరు సొంత జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు, పట్టణాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగం నుంచి డిప్యుటేషన్‌లపై పోస్టింగులు వేయించుకుంటున్నారని తెలిసింది. మరికొందరు స్థానిక అధికారుల చేతులు తడిపి కావాల్సిన చోటకు డిప్యుటేషన్‌లపై వెళ్లిపోతున్నారని, ఇంకొందరు ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ఠ వేస్తున్నారని సమాచారం. వైద్యాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఇదే తంతు కొనసాగుతోంది. ప్రభుత్వం అత్యవసరం పేరిట కల్పించిన వెసులుబాటును కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది ప్రభుత్వం సాధారణ బదిలీలు నిర్వహించినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేసేందుకు పైరవీలు చేశారు. కొందరు వైద్యులకు పదోన్నతులు కల్పించినా కుర్చీలను వదల్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేసినా, కొద్ది రోజుల్లోనే తిరిగి అనుకున్న స్థానాలకు వచ్చేశారు. నిబంధనల ప్రకారం ఒక పీహెచ్‌సీ నుంచి మరొక చోటుకు డిప్యుటేషన్‌ వేయాలంటే ఉన్నతాధికారులకు డీఎంహెచ్‌ఓ కార్యాలయం అధికారులు ముందస్తు ప్రతిపాదన చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో ఖాళీలు ఉంటే ఉన్నతాధికారుల ఆమోదంతో డిప్యుటేషన్‌పై నియమించవచ్చు. అయితే దీనికి విరుద్ధంగా జిల్లాలో అక్రమ డిప్యుటేషన్లు కొనసాగుతున్నాయి. వైద్యాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు రాజకీయ సిఫారసులతో అనుకూల స్థానాల్లో డిప్యుటేషన్లపై నియమించుకొని ఏళ్ల తరబడి తిష్ఠ వేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని పరిపాలన విభాగంలో కొంతమంది ఉద్యోగులు అందినంత పుచ్చుకొని డిప్యుటేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసరం పేరుతో ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ కావాలంటే అక్కడకు డిప్యుటేషన్‌ అస్త్రాన్ని వినియోగిస్తూ, అడ్డగోలుగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తం వ్యవహారాన్ని కార్యాలయంలో ఒక ముఖ్య ఉద్యోగి నడిపిస్తుండడం గమనార్హం. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అక్రమ డిప్యుటేషన్లపై నియామకాలకు సిఫారసులు చేస్తుండడంతో అడ్డూ, అదుపు లేకుండా సాగిపోతున్నాయి. మాడుగుల నియోజకవర్గం పరిధిలోని కె.కోటపాడు మండలం చౌడువాడ పీహెచ్‌సీలో 30 ఏళ్లుగా ఒక ఎంపీహెచ్‌ఈవో మేల్‌ ఉద్యోగి బదిలీ లేకుండా పనిచేస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో ఆయనకు సమీపంలో గొడిచెర్ల పీహెచ్‌సీకి బదిలీ అయింది. ఆయనకు అక్కడ పనిచేసేందుకు ఇష్టం లేక కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్లీ చౌడువాడ పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. పాయకరావుపేట మండలంలోని మంగవరం పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి బదిలీ అయిన వెంటనే తనకు కావాల్సిన గోవాడ పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. కేజే పురం పీహెచ్‌సీలో సీనియర్‌ అసిస్టెంట్‌ను సబ్బవరం పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై నియమించారు. కశింకోట పీహెచ్‌సీలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ గత కొంతకాలంగా అనకాపల్లి కలెక్టరేట్‌లో విఽధి నిర్వహణ కోసం డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు. ఆయన అక్కడ ఏ విధులు నిర్వహిస్తున్నారో అధికారులకే తెలియాలి.

జిల్లాలు దాటి డిప్యుటేషన్లు

వైద్య, ఆరోగ్య శాఖలోని మరికొందరు తమకున్న రాజకీయ పలుకుబడితో జిల్లాలు దాటి డిప్యుటేషన్లపై వెళ్లిపోతున్నారు. రాంబిల్లి మండల పీహెచ్‌సీలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ గత మూడేళ్లుగా జిల్లా దాటి విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. ఆయనపై గతంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌, హెల్త్‌ ముఖ్య అధికారికి కొందరు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. విమ్స్‌లో ఒక సంస్థ తరఫున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాంబిల్లిలో జీతం తీసుకుంటున్నారు. ఇక్కడ సీనియర్‌ అసిస్టెంట్‌ గత మూడేళ్లుగా అందుబాటులో లేకపోవడంతో జీతాల బిల్లులు, ఇతరత్రా అవసరాల కోసం సిబ్బంది విశాఖ వెళ్లాల్సి వస్తుంది. అదే విధంగా ఇదే పీహెచ్‌సీ నుంచి సర్వసిద్ధి పీహెచ్‌సీకి మరో ఉద్యోగి అనతి కాలంలోనే డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. అనకాపల్లి మండలం తుమ్మపాల పీహెచ్‌సీలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పోస్టు లేదు. కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక మహిళా ఉద్యోగి తుమ్మపాల పీహెచ్‌సీలో డిప్యుటేషన్‌పై వచ్చారు. మాడుగుల మండలం వేచలం పీహెచ్‌సీలో ఎంపీహెచ్‌వోగా పనిచేస్తున్న ఉద్యోగి గత రెండేళ్లుగా విశాఖపట్నం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తిష్ఠ వేశారు. ఆయనను పీహెచ్‌సీకి పంపాలని స్థానికులు కొందరు కోరుతున్నా, అధికారుల నుంచి స్పందన లేదు. అసలే అరకొర సిబ్బంది దీనికి తోడు ఉన్న వారిలో కొందరు డిప్యుటేషన్లపై వెళ్లిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సిబ్బంది అందుబాటులో లేక రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కార్యాలయం సిబ్బంది డిప్యుటేషన్లపై వేరొక చోటుకు వెళ్లడంతో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఓలు విధులకు డుమ్మా కొడుతున్నారు. జిల్లాలో వీరే కాకుండా పలువురు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, సూపర్‌వైజర్లు, డీఎంహెచ్‌వో కార్యాలయం పరిపాలనా విభాగంలో కొందరు తమకు బదిలీ అయిన స్థానాల్లో కాకుండా నివసిస్తున్న ప్రాంతాలు, లేదా వాటికి సమీపంలోని పీహెచ్‌సీల్లో డిప్యుటేషన్‌ నియామకాలపై కొనసాగుతున్నారు. ఈ వ్యవహారంపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ హైమావతి వివరణ కోరగా, అవసరం ఉంటేనే జిల్లా పరిధిలో మాత్రమే నియమిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలంగా ఒకేచోట డిప్యుటేషన్లపై కొనసాగుతున్న ఉద్యోగులు ఉంటే వెనక్కి పంపుతామని పేర్కొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 11:26 PM