మందకొడిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:10 AM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులు, అర్హులైన ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ ఆదివారం మందకొడిగా సాగింది.
పాడేరురూరల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులు, అర్హులైన ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ ఆదివారం మందకొడిగా సాగింది. పాడేరులో 277 మంది, కొయ్యూరులో 143 మంది, చింతపల్లిలో 175 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కొయ్యూరు మండల పరిషల్ కార్యాలయంలో 143 మంది, చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 175 మంది ఓటు వేశారు. పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.భానుమూర్తి రాజు పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించారు. అయితే సుమారు 630 మందికి గాను ఆదివారం కేవలం 277 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జె.తేజరతన్, బి.శ్రీనివాసరావుతో పాటు డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌వీఎస్.రమేశ్ పాల్గొని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఉద్యోగులకు అవసరమైన సేవలను అందించారు.