Share News

అన్న క్యాంటీన్లకు ఆదరణ

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:10 AM

పేదలకు నామమాత్రం రుసుముతో కడుపునిండా భోజనం పెడుతున్న ‘అన్న క్యాంటీన్ల’కు నానాటికీ ఆదరణ పెరుగుతున్నది.

అన్న క్యాంటీన్లకు ఆదరణ

రూ.5కే కడుపునిండా భోజనంతో పేదలు సంతృప్తి

అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలిలో రెండేళ్లలో 18.47 లక్షల మందికి భోజనాలు

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

పేదలకు నామమాత్రం రుసుముతో కడుపునిండా భోజనం పెడుతున్న ‘అన్న క్యాంటీన్ల’కు నానాటికీ ఆదరణ పెరుగుతున్నది. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలిలో రెండేళ్ల క్రితం నాలుగు క్యాంటీన్లను ప్రారంభించగా.. ఇంతవరకు 18.47 లక్షల మంది భోజనాలు/ అల్పాహారం చేశారు.

తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్న సమయంలో (2014-19) జిల్లాలో అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయం వద్ద, రైల్వేస్టేషన్‌, నర్సీపట్నంలో ప్రాంతీయ ఆస్పత్రి వద్ద, ఎలమంచిలిలో అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం వడ్డిస్తుండడంతో స్థానిక నిరుపేదలు, కార్మికులు, కూలీలతోపాటు చుట్టుపక్కల మండలాల నుంచి వివిధ పనుల నిమిత్తం ఆయా పట్టణాలకు వచ్చే పేదలు అన్న క్యాంటీన్లలో భోజనం చేసేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను మూసివేసింది. దీంతో పేద వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు అన్న క్యాంటీన్లను మూసివేయవద్దని, మీకు నచ్చిన పేరు పెట్టుకొని కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. కానీ వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. తరువాత గత సాధారణ ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ‘అన్న క్యాంటీన్ల’ను పునరుద్ధరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే 2024 సెప్టెంబరు 19న అన్న క్యాంటీన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. తొలుత అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయం, రైల్వేస్టేషన్‌, నర్సీపట్నంలో ప్రాంతీయ ఆస్పత్రి వద్ద, ఎలమంచిలిలో వీటిని ప్రారంభించారు. తరువాత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఈ రెండేళ్ల కాలంలో 18 లక్షల 47 వేల 265 మంది ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్‌/ మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేశారు. అన్న క్యాంటీన్లు ఆస్పత్రిలో వైద్య సేవల కోసం వచ్చేవారు, రైల్వే స్టేషన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారితోపాటు ఆయా పట్టణాల్లో ముఠా కార్మికులు, ఆటో డ్రైవర్లు, భనవ నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్‌ చిరువ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

Updated Date - Sep 22 , 2026 | 01:10 AM