Share News

నగరంపై పోర్టు కాలుష్యం

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:14 AM

విశాఖ పోర్టులో బొగ్గు, ఇనుప ఖనిజాల ధూళితో నగరంలో అనేక ప్రాంతాలు కాలుష్యంబారిన పడుతున్నాయి.

నగరంపై పోర్టు కాలుష్యం

సీతమ్మధార, ఎంవీపీ కాలనీ వరకు ఎగిసిపడున్న బొగ్గు, ఇనుప ఖనిజం ధూళి

పోర్టు సమీప ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతం

ఇళ్లల్లోకి చొచ్చుకువస్తున్న నల్లటి బూడిద

యార్డుల్లో ఖనిజాల గుట్టలపై అరకొరగా టార్పాలిన్లు

కానరాని ‘వాటర్‌ స్ర్పే’ పనులు

కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు బేఖాతరు

విశాఖపట్నం/జ్ఞానాపురం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

విశాఖ పోర్టులో బొగ్గు, ఇనుప ఖనిజాల ధూళితో నగరంలో అనేక ప్రాంతాలు కాలుష్యంబారిన పడుతున్నాయి. వేసవి ప్రారంభం నుంచి నైరుతి దిశగా వీచే గాలులతో దుమ్ము, ధూళి ఎగిసి.. సుదూరంలో వున్న సీతమ్మధార, ఎంవీపీ కాలనీ వరకు వ్యాపిస్తున్నాయి. ఇక పోర్టుకు సమీపంలో ఉన్న జ్ఞానాపురం, అల్లిపురం, చిలకపేట, వన్‌టౌన్‌లో అనేక ప్రాంతాలతోపాటు కంచరపాలెం, రైల్వే న్యూకాలనీ, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లోని నివాసాల్లోకి నల్లటి బూడిద చొచ్చుకువస్తున్నది. ప్రధానంగా జ్ఞానాపురం, వన్‌టౌన్‌ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.

విశాఖ పోర్టు పరిధిలో బొగ్గు, ఇనుము, ఇతర ఖనిజాల ఎగుమతి, దిగుమతి చేసే క్రమంలో కొంతకాలంపాటు ఓపెన్‌ యార్డులలో నిల్వచేస్తుంటారు. గాలికి ఈ ఖనిజాల రేణువులు పైకి ఎగిసిపడకుండా ఆయా గుట్టలపై టార్పాలిన్లు కప్పాలి. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను పోర్టు అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఖనిజాల గుట్టలపై అరకొరాగా టార్పాలిన్లు కప్పి చేతులు దులుపుకుంటున్నారు. జ్ఞానాపురం వెనుక ఎస్‌ఆర్‌ యార్డులో బొగ్గు నిల్వలపై టార్పాలిన్లు పాక్షికంగా కప్పారు. అరకొరగా కప్పిన టార్పాలిన్లు గాలికి ఎగరకుండా చర్యలు చేపట్టకపోవడంతో ఇవి సైతం లేచిపోతున్నాయి. దీంతో గాలి వీచినప్పుడగ్లా గుట్టల నుంచి ధూళి లేచి జ్ఞానాపురాన్ని కప్పేస్తున్నది. రహదారులతోపాటు ఇళ్ల గోడలు, ఇళ్లల్లో వినియోగించే పాత్రలు, టేబుళ్లు, కుర్చీలు, మంచాలు.. ఇలా అన్నింటిపైనా నల్లటి బూడిద పేరుకుపోత్నుది. వాహనాలను రోజూ తుడుచుకోవాలి. రెండు రోజులపాటు వాహనాలను శుభ్రం చేయకపోతే వాటి రంగు కనిపించనంతగా దుమ్ము, ధూళి పేరుకుపోతున్నది.

రవాణాలోనూ గాల్లో కలుస్తున్న నిబంధనలు

ఆయా ఖనిజాలను ఎగుమతి చేసే క్రమంలో ఓడల్లోకి ఎక్కించడానికి పోర్టులోని వివిధ యార్డుల నుంచి లారీల ద్వారా ఆయా బెర్తుల వద్దకు రవాణా చేస్తుంటారు. ఈ సమయంలో లారీ బయలుదేరిన దగ్గర నుంచి బెర్తు వద్దకు చేరే వరకు ఖనిజం బయటకు కనిపించకుండా టార్పాలిన్లు కప్పాలి. కానీ చాలా లారీలకు టార్పాలిన్లు కప్పడం లేదు. కొన్నింటికి అరకొరగా కప్పుతున్నారు. ఈ లారీలో యార్డుల నుంచి బెర్తుల వద్దకు వెళ్లే క్రమంలో ఖనిజాల ధూళి ఎగిసిపడుతున్నది. గోతుల వద్ద లారీ కుదుపులకు లోనై.. కొంత ఖనిజం రోడ్డుపై పడుతున్నది. ఈ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలతో ధూళి పైకిఎగిసి, వాహనచోదకులు, ప్రయాణికుల కళ్లల్లో పడుతున్నది. ఇదే సమయంలో ఎక్కువ ఎత్తుకు ఎగిసిన ధూళి, నగరంలోని నివాస ప్రాంతాలపైకి వస్తున్నది.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో నైరుతిదిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీనికితోడు వాతావరణం పొడిగా ఉండడంతో బొగ్గు, ఇనుము, ఇతర ఖనిజాల గుట్టల నుంచి ధూళి లేచి నగరంపైకి విస్తరిస్తున్నది. యార్డుల్లో ఖనిజాల గుట్టలతోపాటు, ఖాళీ ప్రదేశాలను తరచూ నీటితో తడపాల్సి ఉంది. ఇందుకోసం వాటర్‌ గన్స్‌, స్ర్పింక్లర్లు వినియోగించారు. కానీ పోర్టు యార్డుల్లో ఇవేమీ కనిపించడంలేదు. వర్షా కాలం మొదలయ్యే వరకు పోర్టు ప్రాంతం నుంచి నగరంపైకి దుమ్ము, ఽధూళి వస్తూనే వుంటుందని రైల్వేన్యూకాలనీకి చెందిన చొప్పా రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇంటి లోపల సైతం చెప్పులు వేసుకోవాల్సి వస్తున్నదని, లేకపోతే పాదాలకు నల్లటి బూడిద పేరుకుపోత్నుదని ఆయన అన్నారు. పోర్టు యార్డులో ప్రధానంగా బొగ్గు, ఇనుప ఖనిజం గుట్టలపై టార్పాలిన్లు కప్పడంతో నిర్లక్ష్యం కనిపిస్తున్నదని వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జబ్బార్‌ ఆరోపించారు. పోర్టును ఆనుకుని వున్న కోటవీధి నుంచి జ్ఞానాపురం వరకు నివసించే ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు, ఇనుము, ఇతర ఖనిజాల ధూళితీవ్రతను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మూడు నెలల క్రితం పోర్టులో పలు యార్డులను తనిఖీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి టాస్క్‌ఫోర్స్‌ ప్రతినిధులు కీలక ఆదేశాలు ఇచ్చారు. పోర్టు పరిధిలోని పలు కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. అయినా వారిలో మార్పులు రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 13 , 2026 | 01:18 AM