Share News

ప్రైవేటుకు పోర్టు ఆస్పత్రి!

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:27 AM

పోర్టు యాజమాన్యం కైలాసపురంలోని గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రి నిర్వహణ విషయంలో వెనకడుగు వేసింది. మళ్లీ పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇవ్వడానికి టెండర్లు పిలిచింది. దీనికి రూ.213 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే పూర్తిగా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోతే తమకు అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందవని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ప్రైవేటుకు పోర్టు ఆస్పత్రి!
కైలాసపురంలోని పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రి

పీపీపీలో ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానం

బడ్జెట్‌ రూ.213 కోట్లు

300 పడకలతో ఆస్పత్రి నిర్మించాలని షరతు

అందులో 100 పోర్టు ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, పదవీ విరమణ చేసిన వారికి కేటాయించాలని ప్రతిపాదన

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పోర్టు యాజమాన్యం కైలాసపురంలోని గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రి నిర్వహణ విషయంలో వెనకడుగు వేసింది. మళ్లీ పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇవ్వడానికి టెండర్లు పిలిచింది. దీనికి రూ.213 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే పూర్తిగా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోతే తమకు అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందవని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఉద్యోగులు, కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు కైలాసపురంలో నిర్మించిన గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రిని ప్రైవేటు సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకోవాలని పోర్టు యాజమాన్యం చూస్తోంది. ఐదేళ్ల క్రితం ఇలాగే ప్రయత్నిస్తే కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో యాజమాన్యం కొన్నాళ్లు ఆ ఆలోచన విరమించుకున్నా, ఆ తరువాత పీపీపీలో ఇవ్వడానికి నోటిఫికేషన్‌ జారీచేసింది. దాంతో కార్మిక సంఘాలు నిరవధికంగా 530 రోజులు ధర్నా చేశాయి. ఈ నేపథ్యంలో దిగివచ్చిన యాజమాన్యం ఆస్పత్రి ఆపరేషన్‌, నిర్వహణ తమ స్వాధీనంలోనే ఉంచుకొని మిగిలిన వ్యవహారాలు ప్రైవేటుకు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో అప్పటి పోర్టు చైర్మన్‌ అంగముత్తు ఈ మేరకు కార్మిక సంఘాలకు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఆస్పత్రి ప్రైవేటీకరణకు కార్మిక సంఘాలు అంగీకరించడం లేదని, సుదీర్ఘ ఆందోళనలు చేస్తున్నారని, పోర్టు నిర్వహణలోనే ఆస్పత్రిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే మంత్రిత్వ శాఖ ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. పోర్టు ప్రధాన విధి సరకు రవాణాయే తప్ప ఆస్పత్రుల నిర్వహణ కాదని, దానిని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించాల్సిందేనని స్పష్టంచేసింది. అంగముత్తు ముంబైకు పదోన్నతిపై వెళ్లిపోయారు. కొత్త చైర్మన్‌గా జస్మిత్‌ సింగ్‌ బింద్రా వచ్చారు. మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం పోర్టును అభివృద్ధి చేయడానికి ఎవరైనా ముందుకువస్తే అప్పగిస్తామని టెండర్లు పిలిచారు.

ఈసారి డీబీఎఫ్‌ఓటీ

పోర్టు ఆస్పత్రి భవనం 1.21 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాంతో పాటు చుట్టూ 4.7 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి 5.91 ఎకరాలు గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రి పేరిట ఉన్నాయి. ఆ భూములను, భవనాన్ని 30 ఏళ్లు లీజుకు ఇస్తామని పోర్టు నోటిఫికేషన్‌ ఇచ్చింది. అఽన్ని రకాల వైద్య సౌకర్యాలతో అధునాతన ఆస్పత్రి నిర్మించాలని కోరింది. ప్రస్తుతం 80 పడకల ఆస్పత్రి ఉండగా, దానిని 300 పడకలకు పెంచాలని సూచించింది. నూతన నిర్మాణానికి డిజైన్‌ రూపొందించి, భవనం నిర్మించి, ఆర్థిక భారం మోస్తూ, ఆస్పత్రి నిర్వహించి, లీజు తరువాత మొత్తం పోర్టుకు అప్పగించాలని డీబీఎఫ్‌ఓటీ (డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌)లో పీపీపీ కింద ఇస్తామని టెండర్లు పిలిచింది. దీనికి నిర్మాణ వ్యయం రూ.212.99 కోట్లు అంటే రూ.213 కోట్లు అవుతుందని, అంత మొత్తం భరించే సంస్థలు ముందుకు రావాలని కోరింది. వీటికి టెండర్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను ఈ నెల 21వ తేదీన తెరవనున్నారు.

ఆస్పత్రిని దశల వారీగా నిర్మించాలనేది ప్రణాళిక. మొత్తం 300 పడకల్లో 100 పడకలు పోర్టుకు కేటాయించాలని, అందులో పోర్టుకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది, కాంట్రాక్ట్‌ కార్మికులు, పదవీ విరమణ చేసిన సుమారుగా 40 వేల మందికి ఉచితంగా సేవలు అందించాలనేది ప్రతిపాదన. ఈ ఒప్పందంలో అనేక క్లాజులు పెట్టారు.

- ఈ అధునాతన ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఇప్పుడు బయట ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నట్టు చేయబోమని యాజమాన్యం స్పష్టంచేసింది. ఏ చికిత్స అయినా అక్కడే చేయించుకోవాలనే నిబంధన పెట్టింది.

- ప్రతి వైద్యానికి నిర్ణీత మొత్తం ఉంటుందని, దానికి లోబడే చికిత్స చేస్తారని, అంతకు మించిన వ్యయమైతే ఆస్పత్రి నిర్వహించే ప్రైవేటు సంస్థతో ఉద్యోగులు మాట్లాడుకుని ఆయా మొత్తాలు భరించాలని పోర్టు నిబంధన పెట్టింది.

- కొంతకాలం తరువాత ప్రతి ఉద్యోగికి వైద్య బీమా సౌకర్యం కల్పిస్తామని, వారు దాంతో ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులతో చికిత్స చేయించుకోవాలని పేర్కొంది. దానికి కూడా పరిమితులు ఉంటాయని, బీమా మొత్తానికి లోబడే వైద్యం ఉంటుందని స్పష్టంచేసింది. అప్పుడు ఇక పోర్టు యాజమాన్యం ప్రమేయం ఏమీ ఉండదని వెల్లడించింది.

బెడ్లు కేటాయిస్తారనే గ్యారంటీ లేదు

పద్మనాభరాజు, గౌరవ అధ్యక్షుడు, పోర్టు కార్మిక సంఘం, సిఐటీయూ

పోర్టుకు ప్రైవేటు సంస్థ కొన్ని బెడ్లు కేటాయిస్తుంది. వాటిని ఉద్యోగులకు ఇస్తారనే గ్యారంటీ లేదు. భారీగా బిల్లులు వచ్చే రోగులకు కేటాయించుకుంటారు. ఇక ముఖ్యమైన అంశం...ఇప్పుడు ఉద్యోగుల కుటుంబాల వైద్యానికి ఎంత ఖర్చు అయినా యాజమాన్యం ఇస్తోంది. దానిని అధునాతన వైద్యం పేరుతో పరిమితం చేయాలని, బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. దీనిని ఎంత మాత్రం అంగీకరించ. కొత్త ఆస్పత్రి నిర్మించి, పోర్టు యాజమాన్యం నిర్వహిస్తామంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆస్పత్రి మొత్తం ప్రైవేటు సంస్థకు ఇచ్చేసి, వారు ఎలా చెబితే ఎలా అంటే ఒప్పుకోం. దీనిపై పోరాటం చేస్తాం. మళ్లీ అందోళనలు ప్రారంభిస్తాం.

Updated Date - Nov 19 , 2026 | 01:27 AM