అగ్రిసెట్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల సత్తా
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:10 AM
స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు అగ్రిసెట్‌లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో తొలి ఆరు ర్యాంకులను కళాశాల విద్యార్థులు సొంతం చేసుకున్నారు.
రాష్ట్రస్థాయిలో మొదటి ఆరు ర్యాంకులు కైవసం
చింతపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు అగ్రిసెట్‌లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో తొలి ఆరు ర్యాంకులను కళాశాల విద్యార్థులు సొంతం చేసుకున్నారు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఏజీ బీఎస్సీలో ప్రవేశాలు పొందేందుకు అగ్రిసెట్ రాయాల్సి వుంది. అగ్రిసెట్-2026 రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 18న జరిగింది. అగ్రిసెట్‌ను స్థానిక కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థినీ, విద్యార్థులు రాశారు. మంగళవారం ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు అగ్రిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో చింతపల్లి సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసిన జి.మాడుగుల మండలం మహాదేవిపురం గ్రామానికి చెందిన మినుముల రాజ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు, ముంచంగిపుట్టు మండలం రంగణకొండ గ్రామానికి చెందిన కిముడు ప్రవీణ రెండవ, డుంబ్రిగుడ మండలం బయలువలస గ్రామానికి చెందిన వంతల మార్త మూడవ, చింతపల్లి మండలం పెండ్లిమామిడి గ్రామానికి చెందిన వంతల ధనలక్ష్మి నాల్గవ, లోతుగెడ్డ కొక్కుల స్పందన ఐదవ, కడప జిల్లా మైలవరం మండలం తొర్రివేముల గ్రామానికి చెందిన అమ్మన్నగారి అక్షయ ఆరవ ర్యాంకును వరుసగా సాధించింది. రాష్ట్రస్థాయిలో తొలి ఆరు ర్యాంకులను సాధించిన కళాశాల విద్యార్థులను ఏడీఆర్, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.ఆదిలక్ష్మి అభినందించారు.