కాలుష్యాన్ని నియంత్రించాలి
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:02 AM
నగరంలో కాలుష్యాన్ని నియంత్రించి, గాలిలో నాణ్యతను మెరుగుపరిచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు.
స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యం
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య
త్వరలో అందుబాటులోకి అడ్వాన్స్‌డ్ ఆటోమేటెడ్ సిగ్నల్ వ్యవస్థ
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కాలుష్యాన్ని నియంత్రించి, గాలిలో నాణ్యతను మెరుగుపరిచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా సోమవారం జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో ఆయన మాట్లాడుతూ పోర్టు, ఇతర భాగస్వామ్య సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా నగరంలో గాలి నాణ్యతను పెంచువచ్చునన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచాలన్నారు. నగరంలో కాలుష్యంపై పలు సంస్థలు, నిపుణులు ఆందోళన వ్యక్తంచేయగా పీసీబీ చైర్మన్ స్పందిస్తూ ‘స్వచ్ఛమైన గాలి-ఆరోగ్యకరమైన జీవనం-సుస్థిరమైన విశాఖపట్నం’ అనే లక్ష్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందజేస్తోందని, అదే సమయంలో పరిశ్రమలు కూడా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అడ్వాన్స్‌డ్ ఆటోమేటెడ్ సిగ్నల్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో పర్యావరణ నిపుణులు వీఎస్‌ఆర్కే ప్రసాద్, సుంకరి రామకృష్ణారావు, పీసీబీ జాయింట్ చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్, ఈఈ ముకుందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు హార్బర్ పార్కులో ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ యంత్రాన్ని పోర్టు చైర్మన్ జస్మిత్‌సింగ్ బింద్రా, డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరింజితో కలిసి పీసీబీ చైర్మన్ ప్రారంభించారు.
పనులు సకాలంలో పూర్తికాకుంటే చర్యలు
ఇంజనీరింగ్ అధికారులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరిక
పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాల్సిందిగా జోనల్ కమిషనర్‌లకు ఆదేశం
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులను అదే వారంలో పరిష్కరించాలి
విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయకపోతే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తప్పవని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్‌లో పాల్గొన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోన్‌ల పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు జీవీఎంసీ సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టర్లు కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కొన్నిచోట్ల ఇంకా పనులు ప్రారంభించలేదని, మరికొన్నిచోట్ల 30 శాతం పనులు కూడా పూర్తికాలేదన్నారు. వీధుల్లో పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అసంపూర్తిగా పనులను వదిలేయడం, మందకొడిగా చేస్తుండడంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత జోనల్ కమిషనర్లు ఇంజనీరింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్ష నిర్వహించి నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. ఎవరైనా పనులను సకాలంలో పూర్తి చేయించడంలో విఫలమైతే చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పత్రికల్లో ఫొటోలు, ఆధారాలతో వస్తున్న వార్తలను పరిశీలించి వాటిపై అదేరోజు చర్యలు తీసుకుని తిరిగి పత్రికలకు, తనకు నివేదిక పంపించాలని ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు, ఏసీపీ స్థాయి నుంచి చీఫ్ సిటీప్లానర్ స్థాయి వరకు అందరూ జోనల్ స్థాయిలో లేదంటే ప్రధాన కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు కచ్చితంగా హాజరుకావాల్సిందేనన్నారు. వెస్ట్‌జోన్ నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోషికుమారి పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాకపోవడం, గైర్హాజరుపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఎస్‌ఈ పల్లంరాజును కమిషనర్ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులను అదే వారంలో పరిష్కరించి ఫిర్యాదుదారుడుకి సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. తాను వారానికి ఒక జోన్ చొప్పున పీజీఆర్‌ఎస్‌కు స్వయంగా హాజరవుతానని కమిషనర్ తెలిపారు. ఆ సమయంలో అన్ని వివరాలను పరిశీలిస్తానని, తేడా ఉంటే మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకుంటాన్నారు.