Share News

బొగ్గు హ్యాండ్లింగ్‌ యార్డుతో కాలుష్యం

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:25 PM

మండలంలోని బయ్యవరం రైల్వే స్టేషన్‌ సమీపంలో వున్న బొగ్గు దిగుమతి/ ఎగుమతి యార్డును దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా మంగళవారం పరిశీలించారు.

బొగ్గు హ్యాండ్లింగ్‌ యార్డుతో కాలుష్యం
డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియాకు వినతిపత్రం అందజేస్తున్న ప్రజలు

400కు మించి నమోదవుతున్న ఏయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌

బొగ్గు కార్యకలాపాలను నిలిపివేయాలి

విజయవాడ డీఆర్‌ఎంకు బాధిత గ్రామాల ప్రజల వినతి

కశింకోట, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బయ్యవరం రైల్వే స్టేషన్‌ సమీపంలో వున్న బొగ్గు దిగుమతి/ ఎగుమతి యార్డును దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బొగ్గు లోడింగ్‌, అన్‌లోగింగ్‌, రవాణా జరిగేటప్పుడు వెలువడే నల్లటి బూడిద కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనకు చెప్పారు. గత నెల 13న తాము అధికారులకు ఫిర్యాదు చేయగా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా సమస్యను పరిష్కరించినట్టు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రామన్నపాలెం, బయ్యవరం, జమాదులపాలెం గ్రామాల్లో కాలుష్య కొలమాన యంత్రాలను ఏర్పాటు చేశారని, సాధారణంగా ఏయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 100 లోపు వుండాలని, కానీ ఇక్కడ ఏకంగా 400 నమోదైనట్టు నివేదిక ఇచ్చారని తెలిపారు. దీనిపై సంబంధిత కోల్‌ హ్యాండ్లింగ్‌ నిర్వాహకులకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారని పేర్కొన్నారు. గ్రామాల్లో పీఎం సూర్యఘర్‌ పథకం కింద పలువురు ఇళ్లపై సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారని, అయితే బొగ్గు కారణంగా వెలువడుతున్న దుమ్ము, ధూళి వల్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగడం లేదన్నారు. సూక్ష్మ బొగ్గు కణాలు కలిసిన గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నామని వాపోయారు. నల్లటి పొడి వంటి పదార్థం ఇళ్ల లోపలికి కూడా వస్తున్నదని చెప్పారు. బయ్యవరంలో బొగ్గు లోడింగ్‌, ఆన్‌లోడింగ్‌, రవాణా కార్యకలాపాలను నిలిపివేయాలని వారు కోరారు. మీరు ఇచ్చిన ఫిర్యాదును రైల్వే ఉన్నతాధికారులకు పంపించి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎం హామీ ఇచ్చారు. ఆయన వెంట సీనియర్‌ డీసీఎం ప్రవీణ్‌కుమార్‌, సీనియర్‌ డీవోఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 11:25 PM