Share News

కాలుష్య కాసారం

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:58 AM

పొలాలకు సాగు నీరు అందించడమే కాకుండా ఒకప్పుడు తాగునీటిగా కూడా ఉపయోగపడిన ఎలమంచిలిలోని పెంజెరువు ఇప్పుడు కలుషిత కాసారంగా మారింది. పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా రూపాంతరం చెందడంతో పట్టణంలోని అత్యధిక ప్రాంతాల నుంచి మురుగునీరు వచ్చి ఈ చెరువులో చేరుతున్నది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయి, నీరు నల్లగామారి దుర్వాసన వస్తున్నది. ఒకప్పుడు తామర ఆకులు, కలువ పూలతో చూపరులను ఆకట్టుకున్న ఈ చెరువు.. ఇప్పుడు కళావిహీనంగా మారింది.

కాలుష్య కాసారం
పెంజెరువులో చేరుతున్న మురుగునీరు, పేరుకుపోయిన చెత్తాచెదార

పెంజెరువులోకి చేరుతున్న ఎలమంచిలి ముగురునీరు

పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

పొలాలు దెబ్బతింటున్నాయని ఆయకట్టు రైతుల ఆందోళన

పట్టించుకోని మునిసిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): పొలాలకు సాగు నీరు అందించడమే కాకుండా ఒకప్పుడు తాగునీటిగా కూడా ఉపయోగపడిన ఎలమంచిలిలోని పెంజెరువు ఇప్పుడు కలుషిత కాసారంగా మారింది. పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా రూపాంతరం చెందడంతో పట్టణంలోని అత్యధిక ప్రాంతాల నుంచి మురుగునీరు వచ్చి ఈ చెరువులో చేరుతున్నది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయి, నీరు నల్లగామారి దుర్వాసన వస్తున్నది. ఒకప్పుడు తామర ఆకులు, కలువ పూలతో చూపరులను ఆకట్టుకున్న ఈ చెరువు.. ఇప్పుడు కళావిహీనంగా మారింది.

ఎలమంచిలి పట్టణ శివారులో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో పెంజెరువు వుంది. దీని నుంచి సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాలక్రమేణా ఆక్రమణలకు గురికావడంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది. ఎలమంచిలి పట్టణంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు యానాది కాలువ ద్వారా ఈ చెరువులోకి చేరుతుంది. ఎలమంచిలి పంచాయతీగా వున్నప్పుడు నివాసాల నుంచి మురుగునీరు అంతగా వచ్చేది కాదు. దీంతో చెరువులోకి ఒక్క చుక్క కూడా మురుగునీరు చేరేది కాదు. చెరువులో నీరు బాగుండేది. పొలం పనులకు వెళ్లిన రైతులు తాగునీటికి ఉపయోగించేవారు. అయితే అనంతరం కాలంలో ఎలమంచిలి, చుట్టుపక్కల పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేయడం, జనాభా పెరగడంతో అంతేస్థాయితో మురుగునీటి ప్రవాహం పెరిగింది. ఇదంతా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవు వున్న యానాద్రి కాలువలో నుంచి పెంజెరువులో కలుస్తున్నది. మురుగునీటితోపాటు చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొట్టుకొస్తున్నాయి. దీంతో చెరువులో నీరు నల్లగామారి దుర్వాసన వస్తున్నది. ఇదే నీటిని పొలాలకు వినియోగించుకోవాల్సి రావడంతో భూసారం దెబ్బతిని పొలాలు నిస్సారంగా మారుతున్నాయని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. మునిసిపాలిటీ అధికారులు మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయడకపోవడం, జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో పెంజెరువు కలుషితకాసారంగా మారుతున్నదని, దీనికితోడు చెరువు గర్భం ఆక్రమణలకు గురవుతున్నదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పెంజెరువులోకి మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:58 AM