కాలుష్య విశాఖ
ABN , Publish Date - May 29 , 2026 | 12:34 AM
విశాఖపట్నంలో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పది రోజుల్లో ఏడు రోజులు ప్రమాదకరమైన స్థాయిలో ఉంటోందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
నగరంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత
పది రోజుల్లో ఏడు రోజులు ప్రమాదకర స్థాయి
రెస్పైర్ లివింగ్ సైన్సెస్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడి
పరిశ్రమలు, పోర్టు, వాహనాలే కారణం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పది రోజుల్లో ఏడు రోజులు ప్రమాదకరమైన స్థాయిలో ఉంటోందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. జిల్లాలో పరిశ్రమలు, పోర్టు కార్యకలాపాలు, వాహనాల రద్దీయే దీనికి కారణమని తేల్చింది.
హైదరాబాద్‌కు చెందిన రెస్పైర్ లివింగ్ సైన్సెస్ అనే సంస్థ విశాఖపట్నంలో 2024 నుంచి 2026 ఏప్రిల్ వరకు గాలి నాణ్యత, కాలుష్యంపై అధ్యయనం చేసింది. ఆ వివరాలను గురువారం మీడియాకు విడుదల చేసింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన మానటరింగ్ స్టేషన్ నుంచి 2026లో జనవరి-ఏప్రిల్ వరకు తీసుకున్న గణాంకాల ప్రకారం పీఎం 10 (10 మైక్రో మీటర్లు, అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన గాలిలో తేలియాడే అతి చిన్న ధూళి కణాలు) జాతీయ స్థాయి ప్రామాణికం కంటే అధికంగా నమోదైంది. ఆ నాలుగు నెలల్లో 70.68 శాతం రోజులు ఇలా ఎక్కువగానే ఉండడం గమనార్హం. గత రెండేళ్లలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి కూడా 32 శాతం అధికంగా రికార్డు అయ్యింది. రాష్ట్రంలో అత్యంత కాలుష్య కేంద్రంగా విశాఖ గుర్తింపు తెచ్చుకుందని ఆ సంస్థ పేర్కొంది.
- 2026లో పీఎం10 వార్షిక సగటు 139.58 మైక్రోగామ్స్‌గా రికార్డు అయింది. ఇది జాతీయ ప్రమాణానికి రెట్టింపు.
- రాష్ట్రంలో అత్యంత కాలుష్య కేంద్రంగా వరుసగా మూడో ఏడాది కూడా జీవీఎంసీ మానటరింగ్ సెల్ రికార్డులకు ఎక్కింది.
- పారిశ్రామిక వ్యర్థాలు, పోర్టులో సరకు రవాణా, ఆయిల్ రిఫైనరీల ఆపరేషన్లు, స్టీల్ ప్లాంటు, వాహనాల కాలుష్యమే దీనికి కారణంగా గుర్తించారు.