మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతం
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:20 AM
గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ పరిషత్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. గతానికి భిన్నంగా ప్రస్తుతం ఏజెన్సీలో ఎక్కడా మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో సైతం పోలింగ్ నిర్వహించారు. గిరిజనులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు.
- మావోయిస్టుల ప్రభావం లేకపోవడమే కారణం
- అయినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు
పాడేరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ పరిషత్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. గతానికి భిన్నంగా ప్రస్తుతం ఏజెన్సీలో ఎక్కడా మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో సైతం పోలింగ్ నిర్వహించారు. గిరిజనులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు. గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఒడిశాను ఆనుకుని ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని ఉన్న కొయ్యూరు మండలంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం వారం రోజుల ముందు నుంచే పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టుల ప్రభావం లేనప్పటికీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతరులు జిల్లాలోని ప్రవేశించకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే లక్ష్యంతో పోలీసులు మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలోని 149 సమస్యాత్మక, 91 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలపై గట్టి నిఘా పెట్టారు. జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్న 44 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. అలాగే గతంలో ఎన్నికలు జరగని ప్రాంతాలైన ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, బాబుసాల, పెదబయలు మండలం ఇంజరి, గిన్నెలకోట, జామిగుడ, జీకేవీధి మండలం దుప్పిలవాడ, అమ్మవారి ధారకొండ, జి.మాడుగుల మండలం బొయితిలి, నుర్మతి, కొయ్యూరు మండలం బూదరాళ్ల ప్రాంతాల్లో సైతం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.