మోదమ్మ ఉత్సవాల చుట్టూ రాజకీయం!
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:50 PM
మోదకొండమ్మ అమ్మవారి చుట్టూ భక్తులు ప్రదక్షణలు చేయడం సహజం. కానీ ఉత్సవాల తేదీల మార్పుతో అమ్మవారి చుట్టూ ప్రస్తుతం రాజకీయాలు ప్రదక్షణ చేస్తుండడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్సవాల తేదీల మార్పుపై వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు
ఆలయ, ఉత్సవ కమిటీ సమన్వయ లోపం వల్లే ఈ దుస్థితి
రాజకీయ వైరాలు వీడి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని భక్తుల వేడుకోలు
(పాడేరు- ఆంధ్ర జ్యోతి)
మోదకొండమ్మ అమ్మవారి చుట్టూ భక్తులు ప్రదక్షణలు చేయడం సహజం. కానీ ఉత్సవాల తేదీల మార్పుతో అమ్మవారి చుట్టూ ప్రస్తుతం రాజకీయాలు ప్రదక్షణ చేస్తుండడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మే నెల 10, 11, 12 తే దీల్లో స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఆలయ, ఉత్సవ కమిటీ ఫిబ్రవరి 22న ప్రకటించింది. కాగా ఉత్సవాల్లో భద్రత, అధికార యంత్రాంగం ఏర్పాట్లు, సమన్వయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎస్‌పీ సూచనలతో వివిధ శాఖల అధికారులతో సమావేశమై జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో ఉత్సవాల తేదీలను మార్పు చేస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి ప్రకటించారు. అధికారులు, ఉత్సవ కమిటీ సమన్వయంతో మే 17, 18, 19 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించాలని ఆమె వెల్లడించారు. దీంతో తాము పెట్టిన ఉత్సవాల తేదీలను మార్పు చేయడం తగదని సమావేశంలోనే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.
ఉత్సవాల తేదీల మార్పుపై వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు
మోదకొండమ్మ ఉత్సవాల తేదీల మార్పు అంశంపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. తరతరాల ఆచారం ప్రకారం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు ఆలయ కమిటీకి చైర్మన్‌గా ఉండడం, ఉత్సవాలకు సంబంధించిన తేదీలు ప్రకటించడం జరుగుతుందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు. తమకు అధికారం ఉందనే ఆలోచనతోనే గత ఆచారాన్ని పక్కన పెట్టి, కేవలం వైసీపీ ఎమ్మెల్యే ఉత్సవాలు నిర్వహిస్తున్నారనే అక్కసుతోనే కుట్ర పూరితంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి ఉత్సవాల తేదీలను మార్చేశారని ఆయన ఆరోపించారు. ఉత్సవాల తేదీల మార్పు నేపథ్యాన్ని పురస్కరించుకుని గురువారం మోదకొండమ్మ ఆలయానికి సంప్రోక్షణ ప్రక్రియను చేపట్టారు. కాగా భక్తుల భద్రత, సదుపాయాలు, ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉత్సవాల తేదీలను అధికారులు మార్చారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం మోదకొండమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించడం, నిధులు, సదుపాయాలు కల్పించడం వంటివి చేస్తున్న నేపథ్యంలో ఉత్సవాలను విజయవంతంగా చేసేందుకే తేదీలను మార్చారన్నారు. ఉత్సవాల తేదీలను నిర్ణయించే సమావేశానికి అన్ని వర్గాల వారిని ఆహ్వానించకుండానే ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉత్సవాల తేదీలను నిర్ణయించడం ఏమిటని గిడ్డి ఈశ్వరి ప్రశ్నిస్తున్నారు. తాము ఐదేళ్లు ఆలయ కమిటీ చైర్‌పర్సన్ హోదాలో అందరి సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించామని ఆమె గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఉత్సవాల తేదీల నిర్ణయం చేసే క్రమంలో ఆలయ, ఉత్సవ కమిటీల సమన్వయలోపం కారణంగానే ఈ రాద్ధాంతం జరుగుతున్నదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తమకు అనుకూలంగా ఉన్న వారిని సమావేశ పరిచి, ఆలయ, ఉత్సవ కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సైతం ప్రత్యక్షంగా లేకుండానే ఉత్సవాల తేదీలను ప్రకటించడం వల్లే, కూటమి నేతలు ఉత్సవాల తేదీల మార్పునకు మద్దతు ఇస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. ఉత్సవాల తేదీలను నిర్ణయించి, ప్రకటించిన నాడే అందర్ని సమన్వయం చేసి ఉంటే, నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా రాజకీయ వైరాలు పక్కన పెట్టి అందరి సమన్వయంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేయాలని మెజారిటీ భక్తులు కోరుతున్నారు.