పారదర్శకంగా ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలు సహకరించాలి
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:08 AM
పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ‘సర్’ పరిశీలకులు ఎస్.భార్గవి కోరారు.
‘సర్’ పరిశీలకురాలు ఎస్.భార్గవి
యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిందిగా అధికారులకు ఆదేశం
విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):
పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ‘సర్’ పరిశీలకులు ఎస్.భార్గవి కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘సర్’ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్‌తో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రాంతంలో ఓటర్ల ఎన్యుమరేషన్ శాతం మిగిలిన జిల్లాల కంటే ఎక్కువగా ఉండడం సంతృప్తినిచ్చిందన్నారు. ఇందుకు కలెక్టర్, సిబ్బందిని ఆమె అభినందించారు. ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ లేని ఓటర్ల ఐడెంటిటీ కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో దేన్నైనా ప్రామాణికంగా తీసుకోవచ్చునన్నారు. ఫారాలు తిరిగి ఇవ్వని, వలసపోయిన ఓటర్ల సమాచారం కోసం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాలు కలిగిన యువతీయువకులు సుమారు 1,04,866 మంది ఉండగా, 4,787 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారన్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. డూప్లికేట్ ఓటర్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు లేవనెత్తితే ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలన్నారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ జాబితా నుంచి ఓటు తొలగించిన వారంతా ఫారం-6 దరఖాస్తు సమర్పిస్తే ధ్రువపత్రాలను పరిశీలించాలన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన 163 పోలింగ్ కేంద్రాలకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలన్నారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష వాయిదా
విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీహెచ్‌ఎంసీటీ, బీసీఏ తదితర యూజీ కోర్సుల రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ సెలవుగా ప్రకటించినందున ఆ రోజు జరగాల్సిన పరీక్షలను 27వ తేదీకి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో ఎలాంటి మార్పు లేదని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు సవరించిన తేదీని గమనించాలని కోరారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మేహాద్రిగెడ్డ గురుకులం
600 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోధనతో పాటు జేఈఈ, నీట్ పరీక్షలకు శిక్షణ
75 శాతం సీట్లు ఎస్సీలకు..
విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు మూడు గురుకులాలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా మేహాద్రిగెడ్డ గురుకులాన్ని ఎంపిక చేయడంతో జిల్లాకు చెందిన వందలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆకాష్ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకుని ఏటా సుమారు రూ.4 కోట్లను వెచ్చించనుంది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భాగంగా 600 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. 75 శాతం సీట్లను ఎస్సీలకు, మిగిలిన 25 శాతం ఇతర సామాజికవర్గాల విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రస్తుతం 400 మంది చేరగా, మిగిలిన 200 సీట్లను కొద్దిరోజుల్లో భర్తీ చేయనున్నట్టు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జిల్లా కో-ఆర్డినేటర్ నూక రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కొద్దిరోజుల్లో ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో చేరే విద్యార్థులకు ఇంటర్‌తోపాటు అదనంగా జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారని, ఉచిత వసతి, పోషకా హారాన్ని అందిస్తామన్నారు.
ప్రవేశాలు ఇలా..
ఇంటర్ తొలి ఏడాది స్పాట్ అడ్మిషన్ల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్పాట్ అడ్మిషన్లలోనూ 75 శాతం ఎస్సీలకు, మిగిలిన 25 శాతం ఓసీ, ఎస్టీ, బీసీ అర్హత కలిగిన విద్యార్థులకు కేటాయించనున్నారు. గత పరీక్షల్లో 85 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సీట్లు, అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులకు గొప్ప అవకాశాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుందన్నారు.
భోగాపురంలో ఉబర్ బాదుడు
ప్రత్యేకంగా ‘ఎయిర్‌పోర్టు టాక్సీలు’
సాధారణ కార్ల కంటే రూ.700 చార్జీ అధికం
విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉబర్ సంస్థ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తోంది. ప్రత్యేకంగా ‘ఎయిర్‌పోర్టు టాక్సీ’ పేరుతో కొన్ని కార్లను ఏర్పాటుచేసి వాటికి అధిక చార్జీలు వసూలు చేస్తోంది. వారికి విమానాశ్రయంలో కొందరు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులు బయటకు రాగానే కార్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ‘ఉబర్’ ప్రతినిధులే సంస్థ లోగోతో కూడిన టీ షర్టులు వేసుకొని వారి దగ్గరకు వెళుతున్నారు. ఎక్కడికి వెళ్లాలో అడిగి, ఉబర్ యాప్‌లో రైడ్ బుక్ చేస్తున్నారు. ఈ సర్వీసు బాగుందని ప్రయాణికులు వారు తీసుకువచ్చిన ‘ఎయిర్‌పోర్టు టాక్సీ’ ఎక్కి వెళ్లిపోతున్నారు. ఇక్కడే మతలబు జరుగుతోంది. అదే యాప్‌లో ఎయిర్‌పోర్టు టాక్సీకి ఒక రేటు, ఇతర కార్లకు వేరే రేట్లు ఉంటాయి. ఉదాహరణకు ఆ విమానాశ్రయం నుంచి విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రావాలంటే... ఎయిర్‌పోర్టు టాక్సీకి రూ.1,728 చార్జి చూపిస్తోంది. అదే యాప్‌లో ప్రీమియర్ కారు అయితే రూ.1,648, ఉబర్ గో అయితే రూ.1,072 చూపిస్తోంది. ఇక్కడ ఎయిర్‌పోర్టు టాక్సీగా పెట్టిన కార్లు, ఉబర్ గో కార్లకు పెద్ద తేడా లేదు. అయినా ఒకే దూరానికి రూ.700 ఎక్కువ చార్జి వేస్తున్నారు. అదే రేట్లు తమకు కూడా ఇవ్వాలని ఉబర్ గో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఒప్పందం చేసుకొని దోపిడీ
విమానాశ్రయానికి దూరంగా ఉబర్, ఓలా, ర్యాపిడో కార్ల పార్కింగ్‌కు స్థలాలు కేటాయించారు. ప్రతి సంస్థకు బూత్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే ఉబర్ సంస్థ బూత్ మిగిలిన వాటి కంటే 50 మీటర్ల ముందుంది. ప్రయాణికులు ముందుగా అక్కడకు చేరుకుంటారు. అక్కడే ఉబర్ ప్రతినిధులు కాపు కాచి వారే యాప్‌లో రైడ్ బుక్ చేస్తున్నారు. ప్రయాణికులు సొంతంగా వారి మొబైల్‌లో రైడ్ బుక్ చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. ప్రీమియం సర్వీసులా భావించి ప్రయాణికులు ప్రశ్నించడం లేదు. సిటీలోకి వెళ్లడానికి కారు కావాలి? అది వచ్చేసింది కాబట్టి వెళ్లిపోతున్నారు. అదే యాప్‌లో అదే రకమైన కారు రూ.700 తక్కువకే లభిస్తోంది. ఆ విషయం యాప్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. కానీ ఉబర్ ప్రతినిధులు ఆ అవకాశం ఇవ్వడం లేదు. వారు కొత్తగా పెట్టిన ఎయిర్‌పోర్టు టాక్సీకే బేరాలు కుదుర్చుకుంటున్నారు. దీనివల్ల తాము ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పార్కింగ్‌లో ఉన్నా ఒక్క రైడూ రావడం లేదని మిగిలిన సంస్థల డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. తమకు కూడా రైడింగ్ అవకాశం కల్పించాలని, ఎయిర్‌పోర్టు టాక్సీ రేట్లే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.