పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ట్రాకింగ్‌కు క్యూఆర్ కోడ్
ABN , Publish Date - Sep 06 , 2026 | 01:17 AM
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు.
అందుబాటులోకి తీసుకువచ్చిన
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి
విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందినవారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ (పీవీసీ) సమర్పించాల్సి ఉంటుంది. నగర పరిధిలో ప్రతిరోజూ 50 నుంచి 60 మంది వరకు పీవీసీ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసిన తర్వాత తమ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారంటూ పోలీస్ స్టేషన్‌లు, మీ సేవా సెంటర్లు, స్పెషల్‌బ్రాంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివారంతా తమ సర్టిఫికెట్ ఎక్కడ ఉందనేది ఇంటి నుంచే సులభంగా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చామని నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయగానే విశాఖ సిటీ పోలీస్ వెబ్‌సైట్ వస్తుందని, అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే వారి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ ఏ స్థాయిలో ఉందనేది క్షణాల్లో తెలిసిపోతుందన్నారు. ఇకపై పీవీసీకి దరఖాస్తు చేసేవారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు మేరీప్రశాంతి, మణికంఠ చందోలు, తదితరులు పాల్గొన్నారు.