Share News

ఒక్క క్లిక్‌తో పోలీస్‌ సేవలు

ABN , Publish Date - May 30 , 2026 | 12:52 AM

నగర వాసులకు పోలీస్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ‘వైజాగ్‌ సిటీ పోలీస్‌’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఒక్క క్లిక్‌తో పోలీస్‌ సేవలు

స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేకుండానే పనులు

వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన పోలీస్‌ కమిషనర్‌

చోరీలు, నేరాల వివరాలు నమోదుచేస్తే తక్షణ సహాయం

స్టేషన్‌ పరిధి, సంప్రతించాల్సిన అధికారుల సమచారం నిక్షిప్తం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర వాసులకు పోలీస్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ‘వైజాగ్‌ సిటీ పోలీస్‌’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా పోలీస్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి వివరాలను ఎంటర్‌ చేస్తే సంబంధిత పోలీసులు తక్షణం సహాయం అందజేస్తారు. ఒక సీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బృందం మూడు నెలలు శ్రమించి ఈ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దారు.

వెబ్‌సైట్‌లో సేవలవీ...

గూగుల్‌లో వైజాగ్‌ సిటీ పోలీస్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయగానే సర్వీసెస్‌ ఫర్‌ సిటిజన్‌ అనే అప్షన్‌ వస్తుంది. అందులో ట్రాఫిక్‌ విభాగానికి సంబంధించి ఈ-చలాన్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దీనిని క్లిక్‌ చేసిన తర్వాత వాహనం నంబరు ఎంటర్‌చేస్తే ఎన్ని ఈ-చలాన్‌లు ఉన్నాయి, ఎన్ని చెల్లించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి తెలుస్తుంది. అలాగే సైబర్‌ క్రైమ్‌, బ్యాంకింగ్‌ మోసాలకు గురైతే సైబర్‌ క్రైమ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయగానే 1930 హెల్ప్‌ లైన్‌తోపాటు డబ్బులు పోగొట్టుకున్న ఖాతా వివరాలు, పోగొట్టుకున్న మొత్తం వంటి వివరాలను నమోదుచేస్తే సంబంధిత విభాగం పోలీసులు, బ్యాంకు అధికారుల సమన్వయంతో సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బు ఏ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ అయిందో తెలుసుకుని ఆ అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేయిస్తారు. తర్వాత బాధితులు ఏం చేయాలో నేషనల్‌ ఏజెన్సీ గైడ్‌ చేస్తుంది. ఇక, ఏదైనా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించిన స్థితిగతులు, నిందితుల వివరాలు, అరెస్టులు, రిమాండ్‌ రిపోర్టు, చార్జిషీట్‌ ఫైలింగ్‌ వంటి వివరాలను తెలుసుకోవాలంటే నో యువర్‌ కేస్‌ స్టేటస్‌ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే, అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా ఫోన్‌ పోగొట్టుకున్నా, లేదా చోరీకి గురైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చాట్‌బాట్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని పోగొట్టుకున్న ఫోన్‌ వివరాలను నమోదుచేస్తే దానిని ట్రాక్‌ చేసి బాధితులకు అందజేస్తారు. కుటుంబంలో ఎవరైనా సభ్యులు కనిపించకపోయినా, తీర్థయాత్రలు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు పిల్లలు తప్పిపోయినా వారి వివరాలను వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫొటోతోపాటు ఇతర గుర్తులను నమోదుచేస్తే పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తుచేసి పట్టుకుని తిరిగి అప్పగించేందుకు యత్నిస్తారు. వాహనాలు చోరీకి గురైనట్టయితే ఫొటో, వివరాలను వెబ్‌సైట్‌లో నమోదుచేస్తే నిఘా పెట్టి పట్టుకునేందుకు యత్నిస్తారు. పోలీస్‌ సేవలు, ఇతర వివాదాలపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తే వాటి వివరాలతోపాటు అధికారులు తీసుకున్న చర్యలు పబ్లిక్‌ గ్రీవెన్స్‌ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఎవరైనా తుపాకీ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు అధికారులు తీసుకున్న చర్యలను కూడా వెబ్‌సైట్‌లో తెలుసుకునే సదుపాయం కల్పించారు. నగరంలో 22 శాంతి భద్రతల పోలీస్‌ స్టేషన్లు ఉండడంతో వాటి పరిధి, ఎవరిని కలవాలి, ఫోన్‌ నంబర్లు ‘నో యువర్‌ పోలీస్‌ స్టేషన్‌’ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. కమిషనరేట్‌ పరిధిలో పనిచేసే అధికారుల క్రమం, పేరు, ఫోన్‌ నంబరు, పాత నేరస్థుల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Updated Date - May 30 , 2026 | 12:52 AM