Share News

ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత సులభతరం

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:59 AM

ఈ-కంప్లైంట్‌ కియోస్క్‌లతో పోలీస్‌ సేవలను ప్రజలు మరింత సులభంగా వినియోగించుకోవచ్చునని హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత సులభతరం

హోం మంత్రి వంగలపూడి అనిత

రైల్వేస్టేషన్‌, ద్వారకా బస్‌స్టేషన్‌ల వద్ద ఈ-కంప్లైంట్‌ కియోస్క్‌లు ప్రారంభం

పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లకుండానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

ఈ-కంప్లైంట్‌ కియోస్క్‌లతో పోలీస్‌ సేవలను ప్రజలు మరింత సులభంగా వినియోగించుకోవచ్చునని హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రైల్వేస్టేషన్‌, ద్వారకా బస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన ఈ-కంప్లైంట్‌ కియోస్క్‌లను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్నచోట నుంచే సులభంగా పోలీసుల సహాయం పొందడం, ఫిర్యాదు చేయడం కోసం ఏర్పాటుచేసిన కియోస్క్‌లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రత అత్యంత ముఖ్యమన్నారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ పోలీసులకు సవాల్‌గా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై తక్షణ స్పందన, దర్యాప్తు, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూసేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందజేసేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి తీసుకుంటున్న చొరవ ప్రశంసనీయమన్నారు. సీపీ శంఖబ్రతబాగ్చి మాట్లాడుతూ రద్దీ ప్రాంతాల్లో చోరీలు, వేధింపులు, కొట్లాటలు వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని, అలాంటిచోట పోలీసులను సంప్రతించడం సులభతరం చేసేందుకు ఈ కియోస్క్‌లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కియోస్క్‌లను చదువుకున్నవారే కాకుండా నిరక్షరాస్యులు కూడా సులభంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. బాధితుడి పేరు, ఫోన్‌ నంబర్‌ ఇచ్చి...సమస్య ఏమిటో చెబితే కియోస్క్‌ దానిని టెక్స్ట్‌గా మార్చుకుని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదును పంపిస్తుందన్నారు. అక్కడి సిబ్బంది ఆ ఫిర్యాదు ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో గుర్తించి అక్కడకు పంపించేస్తారన్నారు. ఫిర్యాదు పూర్తయిన వెంటనే బాధితుడికి కియోస్క్‌ నుంచి వెంటనే రశీదు అందడంతోపాటు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు స్టేషన్‌కు వెళ్లకుండానే సులభంగా సేవలను పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు మణికంఠచందోలు, మేరీప్రశాంతి, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.


నేడూ కిరండూల్‌ రైళ్ల రద్దు

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

రాయగడ డివిజన్‌ పరిధిలో కొండ చరియలు విరిగి పడినందున విశాఖ-కిరండూల్‌-విశాఖ (18515/18516) ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులు, అలాగే విశాఖ-కిరండూల్‌-విశాఖ (58501/58502) పాసింజర్‌ రైలు సర్వీసులను ఆదివారం రద్దు చేశామని రైల్వే అధికారులు ప్రకటించారు.


డిసెంబరు 13న నేవీ మారథాన్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

నేవీ డేలో భాగంగా ఈ ఏడాది డిసెంబరు 13న బీచ్‌రోడ్డులో మారథాన్‌ నిర్వహిస్తున్నామని నేవీ అధికారులు ప్రకటించారు. హోటల్‌ డాల్ఫిన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మారథాన్‌ నిర్వాహకులు, ఐఎన్‌ఎస్‌ కళింగ కమాండింగ్‌ ఆఫీసర్‌ కమొడోర్‌ ఎస్‌ఎస్‌ ధోడీ మాట్లాడుతూ మారథాన్‌పై ఇప్పటికే ప్రచారం ప్రారంభించామన్నారు. తొలుత మారథాన్‌ను 2014లో నాలుగు వేల మందితో ప్రారంభించగా, గత ఏడాది 17 వేల మంది పాల్గొన్నారన్నారు. ఈసారి బహుమతుల కింద రూ.10 లక్షలు ఇస్తామన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ, నేవీ మారథాన్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మాత్రమే కాదని, ఒక ఉత్సవమని, ఆరోగ్యానికి అందరికీ ఉపయోగపడుతుందన్నారు. నేవీ పీఆర్‌ఓ సుజిత్‌రెడ్డి మాట్లాడుతూ మారథాన్‌లో పాల్గొనే వారు వైజాగ్‌నేవీమారథాన్‌.రన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోస్టర్‌ విడుదల చేశారు.

Updated Date - Sep 27 , 2026 | 12:59 AM