Share News

నగరంలో పోలీసు సోదాలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:57 AM

వివాదాలకు కేంద్రాలుగా మారుతున్న పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో లోపాలను గుర్తించడంపై నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు.

నగరంలో పోలీసు సోదాలు

పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో లోపాలను గుర్తించేందుకు సీపీ చర్యలు

31 బృందాలతో విస్తృత తనిఖీలు

విశాఖపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):

వివాదాలకు కేంద్రాలుగా మారుతున్న పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో లోపాలను గుర్తించడంపై నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. కమిషనరేట్‌ పరిధిలోని 45 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పది పబ్‌ల్లో శనివారం రాత్రి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 93 మంది పోలీసులు 31 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో లైసెన్స్‌ల చట్టబద్ధత, అగ్నిమాపక భద్రతా వ్యవస్థ, పార్కింగ్‌ సౌకర్యాలు, ధరల నియంత్రణ, పనివేళలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. కొన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఎమ్మార్పీ అమలుచేయకపోవడం, ఫుడ్‌ అండ్‌ ట్రేడ్‌ లైసెన్స్‌లు లేకపోవడం, డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల వినియోగం, అగ్నిమాపకశాఖ అనుమతులు, పార్కింగ్‌ సదుపాయం లేకపోవడాన్ని గుర్తించారు. ఆయా ఉల్లంఘనలను సరిచేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించడంతో పాటు చర్యలకోసం సంబంధితశాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాత్రివేళ నగరంలో చోరీలను అరికట్టడం, గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా శనివారం రాత్రి ద్వారకానగర్‌ బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారీ బ్యాగులతో వెళ్లే ప్రయాణికులను ఆపి వారి లగేజీలను తనిఖీ చేశారు. అదేసమయంలో వాహనాలను, చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలపైనా దృష్టి సారించారు.


క్యూ పద్ధతిలో...

రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు అధికారుల చర్యలు

విశాఖపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):

దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మార్గదర్శకాల మేరకు రైల్వే స్టేషన్‌లో పండుగ రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. టికెట్‌ తనిఖీ సిబ్బంది, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సిబ్బంది సమన్వయంతో ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు చేపట్టారు. ప్రయాణికులు క్యూలో నిల్చొని రైలు ఎక్కేలా చూడడం, దిగేవారికి ప్రవేశ ద్వారం వద్ద అడ్డు లేకుండా చేయడం, సీసీ కెమెరాల ద్వారా చోరీలు, అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచారు. స్టేషన్‌లోని సమాచార వ్యవస్థ ద్వారా రైళ్ల రాకపోకల వివరాలతోపాటు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి పర్యవేక్షిస్తున్నారు. రైల్వే శాఖ నిబంధనలు పాటించే విధంగా సూచనలు జారీ చేస్తున్నారు.


నేడు జీవీఎంసీలో పీజీఆర్‌ఎస్‌ రద్దు

వెంకోజీపాలెం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికల నేపథ్యంలో సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పది జోనల్‌ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దుచేసినట్టు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని నగర వాసులంతా గమనించి, సహకరించాలని కమిషనర్‌ ప్రకటనలో కోరారు.


డిజిటల్‌ ఆరోగ్యానికి అభా ఐడీ.!

చివరి దశకు చేరిన రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ

జిల్లాలో 22 లక్షల మందికి20.24 లక్షల మందికి ఐడీ నమోదు

మిగిలినవారు 1.74 లక్షల మంది

ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడమే ధ్యేయం

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

14 అంకెల నంబరు ఎంటర్‌ చేయగానే రోగి ఆరోగ్య వివరాలు

విశాఖపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్ర ప్రభు త్వం చేపట్టిన డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్యక్రమం జిల్లాలో దాదాపు ముగింపుదశకు చేరుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ (అభా) ఐడీ నమోదు ప్రక్రియ 92 శాతం పూర్తయింది. ఇందులో భాగంగా 14 అంకెల నంబరుతో ఆధార్‌ తరహాలో ఆరోగ్య సమాచారాన్ని అందించేలా రూపొందిస్తున్న అభా ఐడీతో మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ఆరోగ్య సేవలను డిజిటలీకరణ చేసే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏడాది వయసు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ఐడీ లు క్రియేట్‌ చేస్తున్నారు. ఆధార్‌ తరహాలో 14 అంకెల నంబరుతో ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. జిల్లాలో అభా ఐడీలు మంజూరు చేసేందుకు సుమారు 22 లక్షల మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. మూడేళ్ల కిందట ప్రారంభమైన ఈ ప్రక్రియ 92 శాతం పూర్తయింది. మరో ఎనిమిది శాతం (సుమారు 1.76 లక్షలమంది) ఐడీ నమోదు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు, మూడువారాల్లో ప్రక్రియను ముగి స్తామంటున్నారు. ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌తోపాటు బోధనాస్ప త్రులకు వచ్చే రోగులకు అభా ఐడీ క్రియేట్‌ చేసి, ప్రక్రియను ముగింపు దశకు తీసుకువస్తారు. రాష్ట్రస్థాయి లో విశాఖ మొదటి మూడుస్థానాల్లో ఉందని చెబుతున్నారు.

అభా ఐడీతో రోగులకు మేలు..

అభా హెల్త్‌ ఐడీ ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజి టల్‌గా అనుసంధానించేందుకు ఉపయోగపడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇందులో 14 అంకెలతో హెల్త్‌ అకౌంట్‌ నంబరు జారీచేస్తారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ వైద్య పరీక్షల నివేదికలు, వైద్యుల ప్రిస్ర్కిప్షన్లు, చికిత్స వివరాలను సంబంధిత డిజిటల్‌ వ్యవస్థలో అప్‌లోడ్‌ చేస్తారు. దీనివల్ల రోగికి గతంలో వైద్య సేవలు పొందిన పత్రాలకు సంబంధించిన వివరాలను భద్రపర్చాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సమస్య వచ్చి ఆస్పత్రిలో చేరితే సదరు రోగికి కేటాయించిన అభా ఐడీని వారికి కేటాయించిన ప్రత్యేక సైట్‌లో ఎంటర్‌ చేసి, ఆరోగ్య హిస్టరీని తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అవ సరమైన అదనపు పరీక్షలు, మందుల మార్పు, ఇతర వైద్య పరమైన కీలక నిర్ణాయాలు తీసుకునేందుకు వైద్యులకు అవకాశం ఉంటుంది.

ముందుకురావాలి..

అభా ఐడీ నమోదుకు మిగిలిపోయిన వారు ముందుకు రావాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి. జగ దీశ్వరరావు కోరుతున్నారు. నగర పరిధిలోని అపార్ట్‌మెంటు వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు అలస త్వం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఏఎన్‌ఎం, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ నంబరు నమోదు చేసి ఐడీ క్రియేట్‌ చేస్తారు. ఆధార్‌ నంబరు ఎంటర్‌ చేయగానే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది చెబితేనే ఐడీ క్రియేట్‌ చేయగలరు. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. చాలామంది ఓటీపీ చెప్పేందుకు నిరాకరించడం తో సమస్య ఉత్పన్నమవుతోందని డీఎంహెచ్‌వో తెలిపారు. ఈ ప్రక్రియ శతశాతం పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - Oct 12 , 2026 | 12:57 AM