పోలీసుల ఆదేశాలు బేఖాతరు
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:50 AM
జిల్లాలోని పలు లాడ్జిల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. లాడ్జిల్లో దిగేవారి వివరాలు సేఫ్ స్టే యాప్‌లో నమోదు చేయాలని పోలీసులు ఆదేశించినా ఖాతరు చేయడం లేదు. చాలా లాడ్జిలు, హోటళ్లలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. కొన్నింటిలో పని చేస్తున్నా ఫుటేజీ బ్యాకప్ ఉండడం లేదు. దీంతో లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా దర్యాప్తు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
- నిబంధనలు పాటించని లాడ్జిల నిర్వాహకులు
- సేఫ్ స్టే యాప్‌లో వివరాలు నమోదు చేయని పరిస్థితి
- సీసీ కెమెరాలు ఉన్నా బ్యాకప్ లేదంటూ బుకాయింపు
- గుట్టు బయటకు తెలిసిపోతుందని భయం
నర్సీపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు లాడ్జిల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. లాడ్జిల్లో దిగేవారి వివరాలు సేఫ్ స్టే యాప్‌లో నమోదు చేయాలని పోలీసులు ఆదేశించినా ఖాతరు చేయడం లేదు. చాలా లాడ్జిలు, హోటళ్లలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. కొన్నింటిలో పని చేస్తున్నా ఫుటేజీ బ్యాకప్ ఉండడం లేదు. దీంతో లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా దర్యాప్తు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
జిల్లాలో మొత్తం 81 లాడ్జిలు ఉన్నాయి. నర్సీపట్నం సబ్ డివిజన్‌లో నర్సీపట్నంలో 12, పాయకరావుపేటలో 3, ఎస్ రాయవరంలో 2 ఉన్నాయి. అన్నింటిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. పోలీసులు తనిఖీలు చేసినప్పుడు బ్యాకప్ లేదని చెబుతున్నారు. లాడ్జిలో దిగిన వారి వివరాలు సేఫ్ స్టే యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా, యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. అలా చేస్తే లాడ్జిల్లో జరిగే వ్యవహారాలు బయటకు తెలిసిపోతాయని కొందరు నిర్వాహకులు భయపడుతున్నారు. పోలీసులు కూడా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఒక లాడ్జిలో ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువతులు ఆ లాడ్జిలో రెండు గదులు తీసుకుంటే, మేనేజర్ ఒకరి ఆధార్ నంబరు మాత్రమే నమోదు చేయడం, ఒక యువతి ఉన్న గదిలోనే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వాస్తవానికి ఎంత మంది లాడ్జిలో దిగితే అందరి ఆధార్ జెరాక్స్‌లు, ఫోన్ నంబర్లు తీసుకోవాలనే నిబంధన ఉంది. ఆ లాడ్జిలో సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగం లేకుండాపోయింది. పోలీసులు అడిగితే ఫుటేజీ బ్యాకప్ లేదని యాజమాన్యం చెప్పింది. ఆ లాడ్జిలో ఏం జరిగిందో రెండో కంటికి తెలియదు. అలాగే రెండు నెలల క్రితం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న లాడ్జిలో దిగిన ముగ్గురు యువకులు బీరు బాటిళ్లతో కొట్టుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతనిని రక్తపు మడుగులో వదిలేసి మిగిలిన ఇద్దరు పరారయ్యారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సేఫ్ స్టే యాప్ అందుబాటులో ఉన్నా..
హోటళ్లు, లాడ్జిలు, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లలో భద్రత కోసం పోలీసులు సేఫ్ స్టే యాప్ అందుబాటులోకి తెచ్చారు. అందులో దిగే వారి ఆధార్, ఫోన్ నంబరు నమోదు చేయాలి. అందులో ఎవరికైనా నేర చరిత్ర ఉంటే వెంటనే పోలీసులకు అలర్ట్ వెళుతుంది. పోలీసులు వెంటనే దాడులు చేసి అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల వివరాలు సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. సేఫ్ స్టే యాప్‌లో లాడ్జిలో దిగిన వారి ఆధార్ నంబరు నమోదు చేస్తే, దిగిన వ్యక్తి నేర చరిత్ర కలిగి ఉంటే పోలీసులకు సమాచారం వెళుతుంది. అయితే పోలీసులు అందుబాటులోకి తెచ్చిన సేఫ్ స్టే యాప్‌ను లాడ్జిల నిర్వాహకులు వినియోగించుకోవడం లేదు. దీంతో లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయి. పోలీసులు కూడా నిబంధనల ప్రకారమే లాడ్జిలు నిర్వహిస్తున్నారా?, సేఫ్ స్టే యాప్‌ను వినియోగిస్తున్నారా?, లేదా?, సీసీ కెమెరాలు ఉన్నాయా? అనే విషయాలను పట్టించుకోవడం లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం నామమాత్రంగా తనిఖీలు చేసి ఊరుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.