డ్రగ్స్ రహిత విశాఖ కోసం పోలీసుల కృషి భేష్
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:33 AM
డ్రగ్స్ రహిత విశాఖ కోసం సీపీ శంఖబ్రతబాగ్చి ఆధ్వర్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు అద్భుతమని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే స్ఫూర్తితో కార్యక్రమాలు అమలుచేయాలి
హోం మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
డ్రగ్స్ రహిత విశాఖ కోసం సీపీ శంఖబ్రతబాగ్చి ఆధ్వర్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు అద్భుతమని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌కు బానిసలైన వారిని పోలీసులు గుర్తించి డీ అడిక్షన్, రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించారన్నారు. అక్కడ చికిత్సపొందిన అనంతరం వారంతా సాధారణ జీవితం గడుపుతుండడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా సీపీ శంఖబ్రతబాగ్చి నగరంలోని గ్రీన్‌వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్‌ల సహకారం కోరారన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు 24 మందికి పలు కంపెనీలు, హోటళ్లు, డీటీపీ సెంటర్లు, సెక్యూరిటీ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించాయన్నారు. అలాగే బ్లింకిట్, రాపిడో, ఉబర్, స్విగ్గీ వంటి సంస్థల్లో ఉపాధి పొందేందుకు మరో ముగ్గురికి ఆటోలు, నలుగురికి ద్విచక్ర వాహనాలను అందజేయడంలో సఫలీకృతులయ్యారన్నారు. ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని సాధించుకోవచ్చునన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆమె చేతుల మీదుగా వాహనాలను అందజేశారు. కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ డ్రగ్స్‌కు బానిసలైన వారిని సకాలంలో గుర్తించి చికిత్స అందజేస్తే తిరిగి మామూలు జీవితం ప్రసాదించవచ్చునన్నారు. నగరంలో నేరాలను తగ్గించడం, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
చిత్తశుద్ధితో పనిచేసే వారిని గుర్తిస్తాం
ఆ జాబితా అధినేతకు సమర్పిస్తాం
నైపుణ్యం కలిగిన నాయకులను తయారుచేయడమే లక్ష్యం
విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన
పరిశీలకుడు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
ప్రజలకు సేవ చేసేలా నైపుణ్యం కలిగిన నాయకులను తయారుచేసేందుకు జనసేన పార్టీ సన్నాహాలు చేస్తున్నదని ఆ పార్టీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కొణతాల రామకృష్ణ అన్నారు. దసపల్లా హోటల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నిర్మాణానికి అవసరమైన నాయకులను గుర్తించేందుకు జిల్లాల వారీగా ‘సాధకుల సమాచారణ సేకరణ కమిటీ’ని ఇటీవల ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందేనని, విశాఖ పార్లమెంటు కమిటీకి తనను పరిశీలకునిగా నియమించారన్నారు. తనతో పాటు మరో ముగ్గురు కీలక నాయకులు, ముగ్గురు సాధకులు, సెంట్రల్ కార్యాలయం నుంచి మరో ఐదుగురితో కలిపి మొత్తం 27 మంది ఉంటారన్నారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారిని గుర్తించి, ఆ జాబితా అధినేత పవన్‌కళ్యాణ్‌కు సమర్పించడమే తమ పని అని వివరించారు. మంగళవారం జిల్లా స్థాయిలో కీలక నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు చొప్పున పార్టీ నిర్మాణంపై సమీక్షిస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడమే దీని ఉద్దేశమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. రెండేళ్లలో రాష్ట్రంలో నాలుగు వేల కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం చేపట్టారన్నారు. ఏజెన్సీలోను పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు.భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేంత వరకు విశాఖలో విమానాశ్రయాన్ని కొనసాగించాలని తాము ఆశిస్తున్నామన్నారు.