Share News

పోలీసుల డ్రోనాస్త్రం

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:35 AM

శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ డ్రోన్‌ సేవలను వినియోగించుకుంటోంది. డ్రోన్లతో నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది.

పోలీసుల డ్రోనాస్త్రం
చోడవరంలో రాత్రి వేళ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిని గుర్తించేందుకు డ్రోన్‌ ఎగురవేస్తున్న పోలీసులు

అసాంఘిక కార్యకలాపాలకు డ్రోన్లతో చెక్‌

ట్రాఫిక్‌ నియంత్రణ, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట

ప్రస్తుతంలో జిల్లాలో 19 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో డ్రోన్ల వినియోగం

సత్ఫలితాలను ఇస్తుండడంతో సేవలను విస్తరించాలని యోచన

చోడవరం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ డ్రోన్‌ సేవలను వినియోగించుకుంటోంది. డ్రోన్లతో నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో తొలి విడతగా 19 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో డ్రోన్ల సేవలను వినియోగిస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో వీటి సేవలను విస్తరించనున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారితో పాటు, రహస్య ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు సేవించే వారికి పోలీసు శాఖ ఉపయోగిస్తున్న డ్రోన్లు షాక్‌ను ఇస్తున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే ఆకతాయిల ఆగడాలకు, గొడవలు తెచ్చే రౌడీలకు ముకుతాడు వేసేందుకు కూడా పోలీసుశాఖ అందుబాటులోకి తెచ్చిన డ్రోన్‌ సేవలు సత్ఫలితాలు ఇస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం తెచ్చిన ఈ డ్రోన్ల ప్రయోగం తమకు చక్కని సహకారంగా మారిందని పోలీసులు అంటున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారితో పాటు మారుమూల ప్రదేశాల్లో గంజాయి తాగేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం, అలాగే కాలేజీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడే ఆకతాయిల ఆట కట్టించడం, బైక్‌లపై విన్యాసాలు చేసేవారిని గుర్తించేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అలాగే వీటిని ట్రాఫిక్‌ నియంత్రణలో, వీఐపీలు వచ్చే సమయంలో, ఆందోళనల సందర్భాల్లో అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా కోసం కూడా ఈ డ్రోన్ల సహకారం తీసుకొనే ఉద్దేశంతో వీటిని వినియోగంలోకి తెచ్చారు. నేరాల నియంత్రణలో ఈ డ్రోన్లను వినియోగించుకునే వీలుండడంతో పోలీసులు కూడా వీటిపై ఆధారపడుతున్నారు. ఇటీవల కాలంలో చోడవరం పరిధిలో ఈ డ్రోన్ల సహకారంతో శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న మందుబాబులను గుర్తించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పగటిపూట, రాత్రివేళల్లో కూడా ఈ డ్రోన్లను వినియోగించే అవకాశాలుండడంతో పోలీసులు తమ పరిధిలో ఈ డ్రోన్లను వినియోగించి నేరాల నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నారు. బీఎన్‌ రోడ్డులో గోవాడ వద్ద వారం రోజుల క్రితం చెరకులోడుతో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన లారీ వల్ల ఆగిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో ఈ డ్రోన్‌ సహకారం పోలీసులకు బాగానే ఉపయోగపడినట్టు చెబుతున్నారు. ఇటీవల కాలంలో నేరాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీసుల నియామకం చేపట్టడంతో పాటు, టెక్నాలజీ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో కూడా ప్రవేశపెట్టడంతో పోలీసులు మరింత సమర్థంగా పనిచేయడానికి దోఽహదపడుతుంది. జిల్లాలో 19 పోలీస్‌ స్టేషన్లకు ఈ డ్రోన్ల సేవలను అందుబాటులోకి తెచ్చారు. వీటి వలన ఫలితాలు బాగుండడంతో వీటిని మరింత విరివిగా వినియోగించినట్టయితే మెరుగైన ఫలితాలు ఉంటాయని పోలీసు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:35 AM