Share News

విశాఖకు పోలవరం

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:10 AM

తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం నగరానికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏటా 23.44 టీఎంసీ (థౌజండ్‌ మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌...ఒక టీఎంసీ అంటే సుమారు 28.3 బిలియన్‌ లీటర్లు)ల గోదావరి జలాలను సరఫరా చేయనున్నారు.

విశాఖకు పోలవరం

వచ్చే జనవరి నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా నగరానికి నీరు

తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు

తాళ్లపాలెం నుంచి ఏలేరు కాలువ ద్వారా కేబీఆర్‌కు నీటి సరఫరా

అక్కడ నుంచి నరవ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, మేహాద్రిగెడ్డకు పంపింగ్‌

రూ.80 కోట్లతో ఏలేరు కాలువలో పూడికతీత, కేబీఆర్‌ వద్ద పంపులు, సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం నగరానికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏటా 23.44 టీఎంసీ (థౌజండ్‌ మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌...ఒక టీఎంసీ అంటే సుమారు 28.3 బిలియన్‌ లీటర్లు)ల గోదావరి జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నెలాఖరు నాటికి అనకాపల్లి వరకు పోలవరం కాలువ నుంచి నీటి సరఫరాకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే నగరానికి మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి నీటి సరఫరా అయ్యేలా జల వనరుల శాఖ అధికారులు రూ.80 కోట్లతో పనులు చేపడుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా నేలకోట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం వరకూ నీటిని తీసుకువస్తారు. తాళ్లపాలెం నుంచి గాజువాక సమీపానున్న కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (కేబీఆర్‌)కు ఏలేరు కాల్వ ద్వారా సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్‌ నుంచి నీరు కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (కేబీఆర్‌)కు వస్తోంది. కేబీఆర్‌ నుంచి నరవలోని ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. అక్కడ నుంచి నగరంలో పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఏలేరు కాలువలో ఇప్పుడు రెండు వందల నుంచి 300 క్యూసెక్కుల నీరు వస్తోంది. పోలవరం ఎడమ కాలువ పూర్తయితే తాళ్లపాలెం నుంచి కేబీఆర్‌కు 1,900 క్యూసెక్కుల నీటిని తీసుకురావాలని ప్రతిపాదించారు. అందులో 1,100 క్యూసెక్కుల నీటిని అనకాపల్లి సమీపాన పిసినికాడ వద్ద వ్యవసాయ అవసరాలకు మళ్లిస్తారు. మిగిలిన ఎనిమిది వందల క్యూసెక్కుల్లో 200 క్యూసెక్కులు ఫార్మాసిటీ, ఎన్టీపీసీ, ఇతర పరిశ్రమల అవసరాలకు కేటాయిస్తారు. మిగిలిన ఆరు వందల క్యూసెక్కుల నీటిని కేబీఆర్‌కు తీసుకువస్తారు. కొంత నీటిని కేబీఆర్‌ రిజర్వాయర్‌కు సరఫరా చేసి మిగిలిన నీటిని నగర అవసరాలకు వినియోగించనున్నారు.

కేబీఆర్‌ వద్ద నుంచి ప్రస్తుతం జీవీఎంసీ మూడు పంపుల ద్వారా నీటిని నరవ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లకు పంపుతున్నారు. దీనికి అదనంగా జల వనరుల శాఖ 60 ఎంజీడీల నీటిని నరవ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేయనున్నది. ఇందుకోసం 10.5 కి.మీ. మేర పైపులైన్లు వేస్తున్నారు. కేబీఆర్‌ వద్ద 1,500 హార్స్‌పవర్‌ సామర్థ్యంతో మూడు పంపులు ఏర్పాటుచేస్తున్నారు. సబ్‌స్టేషన్‌ నిర్మిస్తున్నారు. కేబీఆర్‌ వద్ద పంపులు, సబ్‌స్టేషన్‌, ఇతర పరికరాల ఏర్పాటు, అక్కడ నుంచి నరవ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వరకు పైపులైన్‌, తాళ్లపాలెం నుంచి కేబీఆర్‌ వరకు ఏలేరు కాలువలో పూడికతీత పనులకు ప్రభుత్వం రూ.80 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకూ ఏలేరు కాలువలో పది కిలోమీటర్లు పొడవునా పూడికతీత పూర్తిచేశామని పోలవరం ప్రాజెక్టు విశాఖ డివిజన్‌ ఇన్‌చార్జి ఈఈ భాస్కర రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఏలేరు కాలువలో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ సమయంలో నీటి ప్రవాహానికి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేబీఆర్‌ వద్ద పంపులు అక్కడ నుంచి నరవ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, మేహాద్రిగెడ్డ వరకు పైపులైన్ల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే జనవరికల్లా నీటిని నగర వాసులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. నరవ ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు వచ్చే నీటిని రోజువారీ అవసరాలకు వినియోగిస్తారని, అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కొంత నీటిని మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తామన్నారు.

అనకాపల్లి జిల్లాలో 46,620 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో 46,620 ఎకరాలకు సాగునీరు అందనున్నది. అయితే ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తవుతున్నప్పటికీ కాలువలు, ఉపకాలువలు పనులు ఇంకా మొదలుకానందున...ప్రస్తుతానికి నీటిని తాండవ, వరాహ, మామిడివాక గెడ్డలకు మళ్లించి అక్కడ నుంచి ఓపెన్‌హెడ్‌ ఛానళ్ల ద్వారా పొలాలకు ఇచ్చేలా జల వనరుల శాఖ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. తాండవ, వరాహ, శారదా నదుల ద్వారా పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల పరిధిలో 46,620 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లాలో గ్రోయిన్లు, షట్టర్లు, ఇంకా మరికొన్నిచోట్ల మరమ్మతులకు రూ.9.64 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని విశాఖ జల వనరుల శాఖ ఎస్‌ఈ అప్పలనాయుడు తెలిపారు.

Updated Date - Aug 14 , 2026 | 01:10 AM