వచ్చే నెలలో నగరానికి పోలవరం
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:03 AM
గోదావరి జలాలు వస్తే విశాఖపట్నంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ చెప్పారు.
గోదావరి జలాల రాకతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
నీటి నిల్వకు రిజర్వాయర్లకు మరమ్మతులు
కొత్తగా 160 పార్కుల అభివృద్ధి
పురపాలక శాఖ మంత్రి నారాయణ
ఎమ్మెల్యేలు, అధికారులతో వీఎంఆర్‌డీఏలో సమావేశం
విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):
గోదావరి జలాలు వస్తే విశాఖపట్నంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ చెప్పారు. విశాఖపట్నం వచ్చిన ఆయన వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, జిల్లా ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్‌డీఏ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. రాత్రి ఏడు నుంచి 10 గంటల వరకు సుదీర్ఘంగా చర్చించారు. జీవీఎంసీ పరిధిలో మౌలిక సదుపాయాలైన రహదారులు, కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, తదితర అంశాలపై సమీక్షించారు. నియోజకవర్గాల్లో సమస్యలపై ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వచ్చే నెలలో పోలవరం ఎడమ కాలువ నుంచి విశాఖకు 1,800 క్యూసెక్కుల నీరు వస్తుందని, దాంతో నీటి సమస్య చాలా వరకూ తీరుతుందన్నారు. ఆ నీటిని నిల్వ చేసేందుకు వీలుగా రిజర్వాయర్లకు మరమ్మతులు చేపడతామన్నారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, డేటా సెంటర్ల వల్ల నీటి సమస్య వస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా కేవలం రాజకీయమని కొట్టి పడేశారు. వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రతి ఇంటికీ 135 లీటర్ల నీటిని అందించవచ్చునన్నారు. రూ.1,500 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆ నీటిని పరిశ్రమలకు ఇస్తే మేలు జరుగుతుందన్నారు. విశాఖలో కొత్తగా 160 పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. వెలంపేటలో 12 అంతస్థుల నిర్మాణం చేపడుతున్నామని, అందులో 400 చ.అ. విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.