ఉప్పరిగెడ్డలో గరళం
ABN , Publish Date - May 08 , 2026 | 01:40 AM
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల సరిహద్దులోని నాన్-సెజ్‌లో ఏర్పాటు చేసిన పలు ఫార్మా కంపెనీలు కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేయకుండా సమీపంలోని ఉప్పరి గెడ్డలో విడిచిపెడుతున్నాయి.
ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేయని యాజమాన్యాలు
ట్యాంకర్లతో తీసుకొచ్చి గెడ్డలోకి విడుదల
ఉప్పరిగెడ్డ నుంచి ఉప్పుటేరులోకి.. దీని నుంచి సముద్రంలోకి..
భూగర్భ, సాగర జలాలు కలుషితం
చేపలు, చెట్లు, మొక్కలు మృత్యువాత
పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
అచ్యుతాపురం, మే 7 (ఆంధ్రజ్యోతి):
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల సరిహద్దులోని నాన్-సెజ్‌లో ఏర్పాటు చేసిన పలు ఫార్మా కంపెనీలు కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేయకుండా సమీపంలోని ఉప్పరి గెడ్డలో విడిచిపెడుతున్నాయి. ఈ గెడ్డ నుంచి ఉప్పుటేరు ద్వారా కాలుష్య వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఫార్మా కంపెనీల నిర్వాకంతో భూగర్భ జలాలతోపాటు సముద్ర జలాలు కలుషితం అవున్నాయి. ఫార్యా వ్యర్థాలతో సముద్రంలో మత్స్య సంపదతోపాటు గెడ్డల్లో మొక్కలు, చెట్లు సైతం చనిపోతున్నాయి.
అచ్యుతాపురం మండలం మోటూరుపాలెం, గుర్జపాలెం, రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామాల పరిధిలోని నాన్-సెజ్ ప్రాంతంలో రెండు వందలకుపైగా ఫార్మా కంపెనీలు వున్నాయి. ఉత్పత్తుల తయారీ సమయంలో వెలువడే వ్యర్థజలాలను శుద్ధి చేయడానికి పూడి గ్రామం వద్ద ఏపీఐఐసీ అధికారులు ఎఫ్ల్యూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. కానీ దీని సామర్థ్యం తక్కువ కావడంతో ఫార్మా కంపెనీలు వినియోగించడంలేదు. ఇక్కడి నుంచి వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా పర వాడలోని రాంకీకి పంపుతున్నారు. అయితే అక్కడ సైతం శుద్ధి చేసే సామర్థ్యానికి మించి వ్యర్థాలు వస్తుండడంతో ట్యాంకర్ లారీలో గంటల తరబడి వేచి వుండాల్సి వస్తున్నది. దీంతో కొన్ని కంపెనీల యాజమాన్యాలు ఫార్యా వ్యర్థాలను రాత్రిపూట ట్యాంకర్లతో తీసుకొచ్చి సమీపంలోని ఉప్పరి గెడ్డలో వదిలేస్తున్నారు. ఫలితంగా గెడ్డ నీరంతా నల్లటి రంగులో చిక్కగా (ద్రవ తారు మాదిరిగా) మారిపోయింది. ఇందులోని చెట్లు, మొక్కలు మాడిపోతున్నాయి. గెడ్డ సమీపంలోకి వెళితే తీవ్రదుర్వాసన వస్తున్నది. గెడ్డ పక్కనున్న సీతపాలెం, ఎరకన్నపాలెం, కంసాలకాలనీ, చాటమట్ట గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పరి గెడ్డ నుంచి ఫార్మా వ్యర్థాలు పూడిమడక ఉప్పుటేరులో, దాని నుంచి సముద్రంలో కలుస్తున్నాయి.
చోద్యం చూస్తున్న కాలుష్య నియంత్రణ మండలి
ఫార్మా వ్యర్థ జలాలను యథేచ్ఛగా ఉప్పరిగెడ్డలో విడిచిపెడుతున్నప్పటికీ కాలుష నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడంలేదని బాధిత గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం ఇటువైపు కన్నెత్తి అయినా చూడడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడి ఫార్మా కంపెనీల వ్యర్థాలను శుద్ధి చేయడానికి పూడి గ్రామం వద్ద ఎఫ్ల్యూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఈటీపీ)ని ఏపీఐఐసీ ఏర్పాటుచేసింది. రోజుకి 1,500 కేఎల్ వ్యర్థాలను మాత్రమే శుద్ధి చేయగల సామర్థ్యం వుంది. కానీ ఇక్కడి కంపెనీల నుంచి రెట్టింపు వ్యర్థాలు వస్తుండడంతో కొంతమేర వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా పరవాడలో రాంకీకి పంపుతున్నారు. మరోవైపు వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఖర్చు అధికంగా వుందన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీల నిర్వాహకులు ఫార్మా వ్యర్థాలను రాత్రిపూట ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఉప్పరిగెడ్డలో పోస్తున్నారు.