Share News

పీఎన్‌జీ కనెక్షన్లు ఇస్తున్నారోచ్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:29 AM

యుద్ధం కారణంగా వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్‌ కొరత కొనసాగుతూనే ఉంది. ఇళ్లలో ఉపయోగించే గ్యాస్‌ బుక్‌ చేస్తే పదిహేను రోజులు దాటితే గానీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలకు సిలిండర్ల అవసరం లేకుండా పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిని ‘పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (పీఎన్‌జీ)గా వ్యవహరిస్తారు.

పీఎన్‌జీ కనెక్షన్లు  ఇస్తున్నారోచ్‌

నేరుగా పైపులైన్‌ ద్వారా నేచురల్‌ గ్యాస్‌ సరఫరా

సిలిండర్ల అవసర మే లేదు

ప్రస్తుతానికి గాజువాక పరిసరాల్లోనే...

కనెక్షన్‌ రేటు రూ.6,500...కొన్ని ప్రాంతాల్లో రూ.618కే కనెక్షన్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

యుద్ధం కారణంగా వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్‌ కొరత కొనసాగుతూనే ఉంది. ఇళ్లలో ఉపయోగించే గ్యాస్‌ బుక్‌ చేస్తే పదిహేను రోజులు దాటితే గానీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలకు సిలిండర్ల అవసరం లేకుండా పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిని ‘పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (పీఎన్‌జీ)గా వ్యవహరిస్తారు.

కాకినాడ నుంచి విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం వరకు పైపులైన్‌ నిర్మాణానికి 2014లోనే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌), ఏపీ ప్రభుత్వం కలిసి దీనిని చేపట్టాయి. నిధుల సమస్య వల్ల ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. గాజువాక వరకు ప్రధాన పైపులైన్లు వేశారు. అక్కడ సబ్‌ లైన్లు వేయాల్సి ఉంది. అక్కడి నుంచి ఇళ్లకు కనెక్షన్లు ఇస్తారు. ఈ పైపులైన్ల ద్వారానే పీఎన్‌జీ సరఫరా చేస్తారు. మూడేళ్ల క్రితం గాజువాక ప్రాంతంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ద్వారా ఐదు వేల ఇళ్లకు పీఎన్‌జీ ఇస్తామని ప్రకటించారు. వాటిలో ఎన్ని ఇచ్చారనేది ఆ సంస్థ ప్రకటించలేదు. జిల్లా అధికారుల వద్ద కూడా సమాచారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రధాన నగరాల్లో నెల రోజుల్లో పది లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించింది.

ఖర్చు తక్కువ...సులువుగా సరఫరా

ఎల్‌పీజీతో పోల్చుకుంటే పీఎన్‌జీ ఖరీదు తక్కువ. సరఫరా కూడా సులువు. దీనికి సిలిండర్లు అవసరం లేదు. 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌కు ప్రస్తుతం గృహ వినియోగదారులు రూ.960 చెల్లిస్తున్నారు. అంటే సగటున కిలో రూ.67 పడుతోంది. అదే పీఎన్‌జీ అయితే ఇప్పుడు కిలో రూ.45కే సరఫరా చేస్తామని ఐఓసీ ముందుకు వచ్చింది. దీనికి సిలిండర్‌ అవసరం లేదు. నేరుగా వంటగదిలోకి పైపు అమరుస్తారు. మీటరు బిగిస్తారు. కరెంట్‌ మీటరులాగే వినియోగాన్ని చూపిస్తుంది. రెండు నెలలకు ఒకసారి బిల్లింగ్‌ చేస్తారు. ఇది ప్రమాదకరం కూడా కాదు. ఇది నేచురల్‌ గ్యాస్‌ కావడం వల్ల వాసన రాదు. లీకైతే గాలిలో కలిసిపోతుంది.

ఇప్పుడు కనెక్షన్‌ ధర రూ.6,500

ఐఓసీ అధికారులతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి మాట్లాడి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఫీజుబులిటీ ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఐఓసీ సమాచారం మేరకు షీలానగర్‌ వద్ద శ్రీవెంకటేశ్వర కాలనీ, బీహెచ్‌పీపీ ఎంప్లాయీస్‌ కాలనీ, జగ్గయ్యపాలెం, కూర్మన్నపాలెం పరిసరాల్లోని గణేశ్‌ నగర్‌, కణితి రోడ్‌, కాశిపాలెం, పాత వడ్లపూడి, సుందరయ్య కాలనీ, తిరుమల నగర్‌ ప్రాంతాల్లో పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వడానికి వీలుంది. ఆయా ప్రాంతాల వారు ఎవరైనా ఎల్‌పీజీ కనెక్షన్‌ రద్దు చేసుకొని పీఎన్‌జీ తీసుకోవాలనుకుంటే ‘6304851613’ నంబర్‌కు కాల్‌ చేస్తే వివరాలు చెబుతారు. ఎల్‌పీజీ, పీఎన్‌జీ రెండూ ఉంచుకోవడం వీలు కాదు.

ఒక్కో కనెక్షన్‌కు రూ.6,500

పీఎన్‌జీ కనెక్షన్‌ కోసం ఐఓసీ అధికారులను సంప్రతిస్తే ఒక ఇంటికి పైపులైన్‌ వేసి, మీటరు అమర్చడానికి రూ.6,500 అవుతుందని చెబుతున్నారు. వినియోగించిన గ్యాస్‌ కిలో ఒక్కింటికి రూ.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, రెండు నెలలకొకసారి బిల్లు కట్టాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పైపులైన్లు ఇప్పటికే వేసి ఉంటే...అక్కడి నుంచి ఇంటికి కనెక్షన్‌ ఇవ్వడానికి రూ.618 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం విషయంలో స్పష్టత లేదు. మీటరుకు అద్దె కూడా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇదే అదనుగా భావించి ఏజెన్సీలు ఎక్కువ మొత్తాలు వసూలు చేయాలని యత్నిస్తున్నాయి. దీనిపై జిల్లా అధికారులు కనెక్షన్‌ వ్యయం, గ్యాస్‌ ధర, ఇతరత్రా ఖర్చులు ఏమైనా ఉంటే అవన్నీ ప్రకటన ద్వారా వెల్లడించాల్సి ఉంది. పీఎన్‌జీపై ఐఓసీ అధికారులతో ఓ సమావేశం నిర్వహించి, ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులు ఎవరూ ఫోన్లకు స్పందించడం లేదు. మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగం వారైతే అసలు రెస్పాండ్‌ అవ్వడం లేదు. దీనిపై కూడా జిల్లా అధికారులు సరైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.

Updated Date - Apr 02 , 2026 | 01:29 AM