Share News

ముందుకు సాగని పీఎంఏవై -అర్బన్‌ 2.0

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:42 AM

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)-అర్బన్‌ 2.0 కింద పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. సొంత స్థలం వుండి, ఇల్లు లేని వారు ప్రభుత్వ సాయంతో ఇళ్లను నిర్మించుకొనేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇందుకు నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వం అందించే యూనిట్‌ వ్యయం చాలా తక్కువ వుండడమే ఇందుకు కారణమని తెలిసింది. దరఖాస్తులను అధికారులు ఆమోదించి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు.

ముందుకు సాగని పీఎంఏవై -అర్బన్‌ 2.0
నర్సీపట్నంలో పునాదుల దశలో వున్న ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న అధికారులు

ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని లబ్ధిదారులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సాయం చాలదన్న అభిప్రాయం

యూనిట్‌ విలువ రూ.4 లక్షలు

ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని వినతి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)-అర్బన్‌ 2.0 కింద పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. సొంత స్థలం వుండి, ఇల్లు లేని వారు ప్రభుత్వ సాయంతో ఇళ్లను నిర్మించుకొనేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇందుకు నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వం అందించే యూనిట్‌ వ్యయం చాలా తక్కువ వుండడమే ఇందుకు కారణమని తెలిసింది. దరఖాస్తులను అధికారులు ఆమోదించి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు.

జిల్లాలో అనకాపల్లితోపాటు నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పరిధిలో పీఎంఏవై-అర్బన్‌ 2.0 కింద కొత్త ఇళ్ల మంజూరుకు అధికారులు చాలా రోజుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు కేవలం 784 దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటిలో అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో 207, నర్సీపట్నంలో 166, ఎలమంచిలిలో 411 దరఖాస్తులు వున్నాయి. సొంత స్థలం వుండి, అందులో ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.4 లక్షలు ఇస్తాయి. దరఖాస్తుదారుల్లో అర్హులను నిర్ధారించి, ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఆమోదం తెలిపారు. కానీ వీరిలో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తరువాత దిగుమతి చేసుకొనే కొన్ని రకాల ముడిసరుకుల ధరలు పెరగడం, దీంతోపాటు డీజిల్‌, పెట్రోల్‌ ధరలను కేంద్రం పెంచడంతో ఆ ప్రభావం భవన నిర్మాణ సామగ్రిపై పడింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే.. ప్రస్తుతం సిమెంట్‌, స్టీల్‌, విద్యుత్తు పరికరాలు, ప్లంబింగ్‌, ఇంటీరియర్‌ సామగ్రి, ఇటుకలు, ఇసుక ధరలు గణనీయంగా పెరిగాయి. యథావిధిగా భవన నిర్మాణ కార్మికుల కూలి రేట్లు సైౖతం పెరిగాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి చాలవని లబ్ధిదారులు భావిస్తున్నారు. చేతిలో సరిపడ డబ్బులు లేని వారు.. అప్పు చేసి ఇంటిని నిర్మించుకోవడం భారంగా భావిస్తున్నారు. నిర్మాణ పనులు మొదలుపెట్టిన తరువాత నిధుల కొరత ఏర్పడి, మధ్యలో ఆగిపోతే రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుందని అంటున్నారు.

యూనిట్‌ విలువ పెంచితేనే..

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)-అర్బన్‌ 2.0 కింద నిరుపేదలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం మార్కెట్‌లో భవన నిర్మాణ సామగ్రి ధరలకు అనుగుణంగా యూనిట్‌ విలువను పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు సైతం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యూనిట్‌ విలువను కనీసం రూ.5 లక్షలకు పెంచితేనే ఇళ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకువచ్చే అవకాశం వుందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఈ పథకం కింద మంజూరైన 180 ఇళ్లలో 48 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో కూడా ఇళ్ల నిర్మాణాల పరిస్థితి ఇలాగే వుంది. తాజాగా 784 దరఖాస్తులకు ఇళ్ల మంజూరుకు అనుమతి లభించినా, ఎంతమంది నిర్మాణ పనులు మొదలుపెడతారు? చివరకు ఎంతమంది ఇళ్లను పూర్తిచేస్తారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Jul 24 , 2026 | 12:42 AM