Share News

బాధితులకు అండ పీఎం రావత్‌

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:05 AM

రోడ్డు ప్రమాదాల బారినపడి దేశంలో ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు.

బాధితులకు అండ పీఎం రావత్‌

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఉచిత వైద్యం

ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా చేర్చితేనే వర్తింపు

జిల్లాలోని 43 ఆస్పత్రుల్లో సేవలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

రోడ్డు ప్రమాదాల బారినపడి దేశంలో ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. సకాలంలో వైద్య సేవలు అందితే కొంతమంది ప్రాణాలు దక్కే అవకాశం ఉంది. ఈ విషయం గుర్తించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్‌ (ప్రైమ్‌ మినిస్టర్‌-రోడ్డు యాక్సిడెంట్స్‌ హాస్పిటలైజేషన్‌ అండ్‌ అస్యూర్డ్‌ ట్రీట్‌మెంట్‌) పథకాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని 24 గంటల్లో (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రిలో చేర్పిస్తే ఈ పథకం కింద ఉచితంగా రూ.1.5 లక్షల వరకు వైద్యాన్ని అందిస్తారు. ఈ మొత్తాన్ని ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.

43 ఆస్పత్రుల్లో సేవలు

జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌లో సుమారు 80 ఆస్పత్రులున్నాయి. అందులో 43 ఆస్పత్రులు పీఎం రాహత్‌ కింద బాధితులకు వైద్యం అందించనున్నాయి. ఇందులో కేజీహెచ్‌, విమ్స్‌, అగనంపూడిలోని ఏరియా ఆస్పత్రి మినహా మిగిలిన 40 ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రులు. పథకం వర్తించాలంటే ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని 24 గంటల్లోగా ఆస్పత్రిలో చేర్పించాలి. రూపాయి కూడా చెల్లించకుండా రోగులకు వైద్య సేవలు అందుతాయి. గాయపడిన వ్యక్తికి ఆరోగ్య పథకాలు, బీమా ఉన్నా పీఎం రాహత్‌ను అమలుచేసిన తరువాతే...మిగిలిన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల వరకూ వైద్య సేవలు అందిస్తారు. పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఆరోగ్యశాఖ, పోలీస్‌, రవాణా, జిల్లా యంత్రాంగం సహకరించాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.

అవగాహన కలిగిస్తాం

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి మరణాల రేటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రజలకు చేరువ చేస్తాం. కలెక్టర్‌ సహకారం, ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాద బాధితులకు భరోసాను కల్పించేలా పథకాన్ని అమలు చేస్తాం. జిల్లాలో 43 ఆస్పత్రుల్లో పీఎం రాహత్‌లో వైద్య సేవలు అందుతాయి.

- డాక్టర్‌ కె.అప్పారావు, ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో-ఆర్డినేటర్‌


నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌, జీవీఎంసీ, నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దుచేస్తున్నట్టు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఇతర అధికారులు తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ఉప రాష్ట్రపతి, గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు హాజరవుతున్న సందర్భంగా ప్రొటోకాల్‌, భద్రత కల్పించడంలో యంత్రాంగం నిమగ్నమైనందున పీజీఆర్‌ఎస్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు గమనించాలని కోరారు.


టార్గెట్‌ 9,000

బడి పిలుస్తోందిలో విద్యార్థుల చేరిక లక్ష్యం

జిల్లాలో ఇప్పటివరకు 3,200 మందికి ప్రవేశం

ప్రాథమిక పాఠశాలల్లో సవాల్‌గా మారిన ప్రవేశాలు

మొత్తం 454 ప్రాథమిక పాఠశాలలు 25,176 మంది విద్యార్థులు

గత ఏడాది ఒకటో తరగతిలో చేరిన వారు 3,936

ప్రభుత్వ బడుల్లో ఏటా తగ్గిపోతున్న ప్రవేశాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలుచేస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమం విజయవంతానికి విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఈనెల 19 నుంచి 23 వరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రతి పాఠశాల పరిధిలో ఒకటి, ఆరోతరగతిలో ప్రవేశాల కోసం విద్యార్థుల ఇళ్లకు విద్యాశాఖాఽధికారులు, ఉపాధ్యాయులు వెళ్లారు. ప్రభుత్వ బడుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థిలకు పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. పాఠశాలలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించినా కొన్నిచోట్ల ఉపాఽధ్యాయులు తమ పరిధిలో తల్లిదండ్రులను కలుస్తున్నారు. దీంతో శనివారంనాటికి జిల్లాలో 3,200 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పొందారు. అయితే జూన్‌ 12న పాఠశాలలు తిరిగే తెరిచే వరకు బడిపిలుస్తోంది కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఒకటి, ఆరోతరగతితోపాటు ఇతర తరగతుల్లో ఈ ఏడాది తొమ్మిది వేల మంది విద్యార్థులు చేర్చాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. గత ఏడాది ఎనిమిది వేలమంది విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వలసలు పెరుగుతండంతో గాజువాక, పెందుర్తి, మధురవాడ ప్రాంత పాఠశాలల్లో ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను ముందుగా కలిసి, నచ్చచెప్పగలిగితే ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించవచ్చునని భావిస్తున్నారు.

సవాల్‌గా మారిన ప్రవేశాలు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం సవాల్‌గా మారింది. నగరంలో మినహా శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో పదిమంది కంటే తక్కువమంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 50కుపైగా ఉన్నాయి. రానున్న విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య పెరగకుండా చూడాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈనెల 23తో ముగిసిన విద్యా సంవత్సరంలో జిల్లాలోని 454 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతులు కలిపి 25,176 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఒకటో తరగతి 3,936 మంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో కనీసం ఐదువేల మందిని చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. లేదంటే పలు ప్రాథమిక పాఠశాలల మనుగడ కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతూ వస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పరిధిలో అన్ని యాజమాన్యాలకు చెందిన 580 పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు 71,871 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 10,049 మంది పదోతరగతి పరీక్షలు రాశారు. ఒకటో తరగతిలో 3,936 మంది, రెండో తరగతిలో 4,312, మూడో తరగతిలో 4,847, నాలుగో తరగతిలో 5,447, ఐదో తరగతిలో 6,634, ఆరో తరగతిలో 8,084, ఏడో తరగతిలో 9,038, ఎనిమిదో తరగతిలో 9,517, తొమ్మిదో తరగతిలో 9,868 ఉండగా టెన్త్‌లో 10,049 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతివారీగా ఏటా ప్రవేశాల సంఖ్య తగ్గుతూ రావడం ఆందోళనకరంగా ఉందని ఉపాధ్యాయులే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటో తరగతిలో విద్యార్థుల చేరిక గత ఏడాది కంటే ఎక్కువగా లేకుంటే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. నగరంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా శివారు, గ్రామీణ ప్రాంతాల్లో తిరోగమనంలో ఉన్నామని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమపిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అప్పటి నుంచి ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో తరగతిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను పెంచకపోతే ఉపాధ్యాయుల పోస్టులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.తల్లిదండ్రులకు నచ్చచెప్పి, వారి నమ్మకాన్ని పొందితే తప్ప ప్రవేశాలు పెరగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Apr 27 , 2026 | 01:05 AM