గెడ్డ వాగు కబ్జాకు స్కెచ్
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:30 AM
పద్మనాభం మండలం మద్ది గ్రామం సర్వేనంబరు 288/1లోని 2.54 ఎకరాల గెడ్డ వాగు కబ్జాకు కొందరు స్కెచ్ వేశారు.
పద్మనాభం మండలం మద్దిలో రెండున్నర ఎకరాలపై ఆక్రమణదారుల కన్ను
వైసీపీ హయాంలో గడపగడపకు నిధులతో రోడ్డు నిర్మాణం
అధికారులకు రైతుల ఫిర్యాదు
విశాఖపట్నం/పద్మనాభం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):
పద్మనాభం మండలం మద్ది గ్రామం సర్వేనంబరు 288/1లోని 2.54 ఎకరాల గెడ్డ వాగు కబ్జాకు కొందరు స్కెచ్ వేశారు. గత ప్రభుత్వ హయాంలో పలుకుబడి ఉపయోగించి మొదటగా గడపగడప కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నిధులతో గెడ్డ వాగు మధ్య నుంచి రోడ్డు నిర్మించారు. ఆ తరువాత మొత్తం గెడ్డవాగు, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో లేఅవుట్ వేయాలని ప్రతిపాదించారు.
ప్రభుత్వం మారడంతో ఆక్రమించుకునే వ్యూహాన్ని నిలుపుదలచేసిన వ్యక్తులు రెండురోజుల క్రితం స్థలాన్ని యంత్రాలతో చదును చేసేశారు. దీనిపై స్థానిక రైతులు జిల్లా యంత్రాంగానికి, పద్మనాభం తహశీల్దారుకు ఫిర్యాదుచేశారు. పద్మనాభం నుంచి అడవివరం వచ్చే రోడ్డుకు ఆనుకుని గెడ్డపోరంబోకు భూమి 2.54 ఎకరాలు ఉంది. పైనున్న గెడ్డ నుంచి ఈ వాగు ద్వారా కిందనున్న పొలాలకు వర్షం నీరు ప్రవహిస్తుంది. వాగు మధ్యలో మదుము ఉంది. గెడ్డవాగుకు సమీపంలో అయ్యప్ప ఆలయం నిర్మించారు. వాగు దాటిన తరువాత ఇళ్లు లేవు కానీ ఇటుక బట్టీలున్నాయి. వాటి కోసం వాగు మధ్యగా గత ప్రభుత్వంలో గడపగడపకు నిధులతో రోడ్డు నిర్మించారు. ఇందుకోసం కిందనున్న పొలాలకు నీరందించే వాగును పూర్తిగా పూడ్చివేసి, ముదుమును కప్పేశారు. రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. వైసీపీ నాయకుల దన్నుతో మిగిలిన భూమిని కబ్జాచేసి లేఅవుట్ వేద్దామని పెద్ద స్కెచ్ వేశారు. గెడ్డవాగు, ముదుము పూడ్చేయడంతో పైన ఉన్న గెడ్డ నుంచి వర్షం నీరు రావడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇదిలావుండగా గెడ్డవాగులో రోడ్డు వేయగా మిగిలిన భూమిని ఆక్రమించేందుకు వీలుగా యంత్రాలతో చదును చేయ డం ప్రారంభించారు. ఇందులో కబ్జాదారులకు సచివాలయ ఉద్యోగుల అండదండలున్నాయని రైతులు ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదుచేసినా గెడ్డవాగు ఆక్రమణను కాపాడలేకపోయారని వాపోయారు. రెండురోజులక్రితం వాగు భూమిని చదునుచేస్తున్నా సచివాలయం ఉద్యోగులు అడ్డుచెప్పలేదని ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఈ విషయాన్ని పద్మనాభం తహశీల్దారు డి.శైలజ వద్ద ప్రస్తావించగా మద్దిలో వాగుభూమి కబ్జాపై ఫిర్యాదు అందిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వీఆర్వోకు సూచించామన్నారు. రెండురోజుల్లో స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.