స్థలాల క్రమబద్ధీకరణ మళ్లీ మొదటికి...
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:05 AM
చినగదిలి గ్రామం సర్వే నంబరు 105లో గల 215.7 గజాల స్థలం క్రమబద్ధీకరణకు బి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి జీవో 388 మేరకు 2017 నవంబరు 16న దరఖాస్తు చేసుకున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం జీవో 388 ప్రకారం నాలుగైదు వేల మంది దరఖాస్తు
ఒకటి, రెండు వాయిదాలు చెల్లింపు
ఈలోగా ఎన్నికలు రావడంతో బ్రేక్
పూర్తిగా పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మరో జీవో విడుదల
అప్పటివారిని తాజా జీవో ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచన
నాడు చెల్లించిన సొమ్ముపై మౌనం
విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
చినగదిలి గ్రామం సర్వే నంబరు 105లో గల 215.7 గజాల స్థలం క్రమబద్ధీకరణకు బి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి జీవో 388 మేరకు 2017 నవంబరు 16న దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన అధికారులు స్థలం క్రమబద్ధీకరణకు రూ.2.58 లక్షలు చెల్లించాలని వెంకటేశ్వరరావుకు నోటీస్ ఇచ్చారు. మొత్తం ఒకేసారి చెల్లించలేననడంతో నాలుగు వాయిదాల్లో కట్టేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు 2018 జూన్ 25న తొలి వాయిదా కింద రూ.64,727 చెల్లించారు. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాయిదాలు కట్టేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు జీవో 30 మేరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో వెంకటేశ్వరరావు అవాక్కయ్యారు.
నగరంలో ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటుచేసుకున్న వేలాది పేద కుటుంబాలకు మేలు చేసేలా గతం (2014-2019)లో టీడీపీ ప్రభుత్వం 296, 388 జీవోలు జారీచేసింది. జీవో 296 ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 100 గజాల కంటే తక్కువ ఉన్నట్టయితే ఉచితంగా క్రమబద్ధీకరించారు. జీవో 388 మేరకు దారిద్య్ర రేఖకు ఎగువనున్న కుటుంబాలకు సంబంధించి 100 గజాల వరకు ఆక్రమణలు ఉచితంగా క్రమబద్ధీరించాలని, 101 నుంచి 150 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 7.5 శాతం, 151 నుంచి 250 గజాల వరకు 15 శాతం, 251 నుంచి 500 గజాల వరకు 30 శాతం, 501 గజాలు దాటితే మొత్తం సొమ్ము చెల్లించాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీవో 388 మేరకు 101 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో స్థలాల క్రమబద్ధీకరణకు నగరంలోని తహశీల్దార్ల కార్యాలయాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీని ప్రకారం డిమాండ్ నోటీస్ జారీచేసినప్పటి నుంచి ఏడాదిలోగా నాలుగు వాయిదాల్లో సొమ్ములు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియ 2018 ఏప్రిల్ తరువాత ప్రారంభమైంది. కొందరు ఏడాదిలోగా సొమ్ములు చెల్లించగా, మరికొందరు పలు కారణాలతో ఒకటి, రెండు వాయిదాలు మాత్రమే కట్టారు. ఈలోగా 2019లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మిగిలిన వాయిదాలు చెల్లింపునకు అవకాశం ఇవ్వలేదు. ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం, నగరంలో ఇళ్ల క్రమబద్ధీకరణ విషయాన్ని పట్టించుకోలేదు. ఆక్రమణదారులు సొమ్ముల చెల్లింపునకు ముందుకువచ్చినా మీసేవలో అందుకు సంబంధించిన ఖాతాను మూసివేశారు. అప్పటి నుంచి 101 గజాలకు పైబడిన స్థలాల ఆక్రమణదారులు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆక్రమణల క్రమబద్ధీకరణకు జీవో 30 తీసుకువచ్చింది. దీనికి గడువు గత ఏడాది డిసెంబరు 31తో ముగిసింది. ఆ తరువాత జీవో 114 జారీచేశారు. దీని ప్రకారం ఆక్రమణదారులు దరఖాస్తు చేస్తున్నారు. అయితే గతంలో జారీచేసిన 388 జీవో ప్రకారం ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఒకటి లేదా రెండు వాయిదాలు సొమ్ములు చెల్లించిన వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి వారు నగరంలో సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది ఉంటారని అంచనా. వారంతా పీజీఆర్‌ఎస్‌లో పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించిన అధికారులు...తాజాగా వచ్చిన జీవో మేరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే గతంలో చెల్లించిన సొమ్ము గురించి అధికారులు మాట్లాడడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో సమర్పించిన దరఖాస్తు ప్రకారమైతే 2013 నాటి రిజిస్ట్రేషన్ విలువ మేరకు సొమ్ము చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు దరఖాస్తు చేస్తే 2026 నాటి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం డబ్బులు చెల్లిస్తేనే స్థలాలు క్రమబద్ధీకరణ చేస్తారు. దీనివల్ల ఎక్కువ భారం పడుతుందని ఆక్రమణదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి వద్ద ప్రస్తావించగా 388 జీవో మేరకు ఆక్రమణల క్రమబద్ధీకరణకు వాయిదాల రూపంలో చెల్లింపులు జరిపిన విషయమై ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయం మేరకు ముందుకు వెళతామన్నారు.