రిలీవ్ చేయండి.. ప్లీజ్
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:18 PM
తాను పని చేయలేనని, తనను రిలీవ్ చేయాలని కలెక్టర్ నిషాంతికి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావు లేఖ సమర్పించారు. అయితే ఆయన రాసిన లేఖపై కలెక్టర్ స్పందించకపోవడంతో ఇక చేసేది లేక డీఈవో సెలవులో వెళ్లిపోయారు.
కలెక్టర్‌ను కోరిన డీఈవో రామకృష్ణారావు
ఉమ్మడి అల్లూరి జిల్లా బాధ్యతలతో పాటు విజయనగరం డైట్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విధులతో ఒత్తిడి
స్పందించని కలెక్టర్
సెలవుపై వెళ్లిన డీఈవో
అధికారుల పట్ల కలెక్టర్ భిన్నమైన వ్యవహార శైలే కారణం?
పాడేరు, జూన్ 4(ఆంధ్రజ్యోతి): తాను పని చేయలేనని, తనను రిలీవ్ చేయాలని కలెక్టర్ నిషాంతికి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావు లేఖ సమర్పించారు. అయితే ఆయన రాసిన లేఖపై కలెక్టర్ స్పందించకపోవడంతో ఇక చేసేది లేక డీఈవో సెలవులో వెళ్లిపోయారు. అధికారుల పట్ల కలెక్టర్ భిన్నమైన వ్యవహారశైలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. విజయనగరం డైట్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న డాక్టర్ కె.రామకృష్ణారావుకు గతేడాది డిసెంబరులో స్థానిక జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఉమ్మడి అల్లూరి జిల్లా విద్యాశాఖాధికారిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలోని 23 మండలాలకు సంబంధించిన విద్యాశాఖ వ్యవహారాలతో పాటు విజయనగరం డైట్ కాలేజీ వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. కాగా గత నెల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిషాంతి.. డీఈవో పట్ల కాస్త దురుసుగా వ్యవహరించడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. దీంతో తాను శాశ్వత డీఈవోను కానప్పటికీ, అవకాశం ఉన్న మేరకు గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తూ, అటు విజయనగరం డైట్ కాలేజీ వ్యవహారాలు చూస్తున్నానని, అకారణంగా కలెక్టర్‌తో మాటలు పడ్డామని ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో తాను ఇక్కడ పని చేయలేనని, డీఈవో పోస్టు నుంచి తనను రిలీవ్ చేయాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాశారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు సైతం ఆయన ఇదే విషయాన్ని లేఖ రూపంలో తెలియజేశారు. తనను రిలీవ్ చేయమని డీఈవో రామకృష్ణారావు రాసిన లేఖపై కలెక్టర్ స్పందించకపోవడంతో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు మెడికల్ లీవు పెట్టి ఆయన సెలవులో ఉన్నారు. అయితే కలెక్టర్ భిన్న వైఖరి కారణంగా డీఈవో రిలీవ్ చేయమని కోరడం, ఆమె స్పందించకపోవడం, ఆయన సెలవులో వెళ్లిపోవడం వంటి చర్యలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.