‘ఫార్మసీ’ ఇన్‌చార్జిగా ‘ప్లాస్టిక్ సర్జరీ’ ప్రొఫెసర్!
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:59 AM
కేజీహెచ్ ఉన్నతాధికారులు నియమ నిబంధనలకు విరుద్ధంగా మరో నిర్ణయం తీసుకున్నారు.
కేజీహెచ్ ఉన్నతాధికారుల మరో వివాదాస్పద నిర్ణయం
గోప్యంగా నియామక ఉత్తర్వులు
తమకు కావలసిన విధంగా బిల్లులు పాస్ చేయించుకోవడానికేనని అరోపణలు
మహారాణిపేట, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్ ఉన్నతాధికారులు నియమ నిబంధనలకు విరుద్ధంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఫార్మసీ స్టోర్ ఇన్‌చార్జిగా సీఎస్‌ఆర్‌ఎంవోను పక్కనపెట్టి ఆ విభాగానికి ఎటువంటి సంబంధం లేని అవగాహన లేని ఫ్రొఫెసర్‌ను నియమించారు. ఇందుకోసం జారీచేసిన ఉత్తర్వులను సైతం గోప్యంగా ఉంచారు. కేజీహెచ్ ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు, సర్జికల్ వైద్య పరికరాలు కొనుగోలు, బిల్లులు చెల్లింపునకు సీఎస్‌ఆర్‌ఎంవో స్థాయి అధికారులు లేదా డిప్యూటీ ఆర్‌ఎంవో స్థాయి అధికారులు సంతకం చేయాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఈ విధంగానే జరుగుతుంది. జూన్ నెలలో నిర్వహించిన ఆస్పత్రి అబివృద్ధి కమిటీ సమావేశంలో కూడా చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ కూడా ఇదే విధానాన్నే కొనసాగించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను ఆసుపత్రి అధికారులు పక్కనపెట్టి ఫార్మసీ బిల్లు పాస్ చేసేందుకు మందుల కొనుగోళ్ల విభాగంపై ఏమాత్రం అవగాహన లేని ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మోహనరావును నియమించారు. ఈ మేరకు ఆగస్టు నెల 12వ తేదీన ఉత్తర్వులు జారీచేశారు. ఆయితే ఇప్పటివరకూ ఆర్‌ఎంవోలకు సైతం తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు పూర్తి విరుద్ధమని, ఉన్నతాధికారులు తమ సొంత అజెండాను అమలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్, మందులు కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఇటీవల ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపారు. ఇంకా ఆ కమిటీ నివేదిక రాలేదు. ఈలోగానే మరో అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.