పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:25 PM
జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
అరకులోయ, పాడేరు, లంబసింగి క్లస్టర్లుగా ఏర్పాటు
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
పాడేరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాను అరకులోయ, పాడేరు, లంబసింగి మూడు క్లస్టర్లుగా విభజించి, వాటి పరిధిలో 122 కిలోమీటర్ల మేర పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. అందులో భాగంగా పర్వతాల అధిరోహణకు చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన మ్యాపింగ్, పర్యాటకులు, సాహాసికుల భద్రతకు ప్రాధాన్యతనీయాలన్నారు. కాఫీ రూచి చూపించడం, స్థానిక హస్తకళల ప్రదర్శన, వస్తువుల విక్రయం వంటికి చేపట్టాలన్నారు. బొర్రా గుహలు, అరమ కొండ, గాలికొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే వెదర్ మోనటరింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని, వాటి కంట్రోల్ రూమ్‌ను అరకులోయలో పెట్టాలన్నారు. అరకులోయ పరిసర ప్రాంతాల్లో కాఫీ తోటల సందర్శన, కాఫీ రుచులతోపాటు ప్రకృతి దృశ్యాలను తిలకించే టెలీస్కోప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పాడేరు పరిసరాల్లో డల్లాపల్లి, లంబసింగికి సమీపంలో చెరువువేనంలోనూ టెలీస్కోప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అరకులోయలో 2, వంజంగిలో 1, లంబసింగిలో 1 కారవాన్ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రాంతంలో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్ నిషేధం, పక్కాగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలన్నారు. జిల్లాలో చేపట్టే పర్యాటకాభివృద్ధితో గిరిజన యువతకు ఉపాధి, ఆదాయం లభించేలా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.శేషగిరిరావు, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, అరకులోయ, పాడేరు సబ్ డీఎఫ్‌వోలు మహేశ్వరి, ఎస్.సాజిత్, జిల్లా పర్యాటక శాఖాధికారి జి.దాసు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.