Share News

సమగ్ర పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:18 PM

జిల్లాలో టూరిజం అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

సమగ్ర పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

బొర్రా గుహల్లో గ్లాస్‌ బ్రిడ్జి ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సూచన

పాడేరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో టూరిజం అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో తన అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా టూరిజం కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని, వాటిని గుర్తించి అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. వివిధ కేంద్ర పథకాల్లో భాగంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో హోం స్టేల ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాల్లో హోం స్టేల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వాటిని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హోం స్టేలో భాగంగా పర్యాటకులకు సదుపాయాలతోపాటు చుట్టుపక్కల ప్రదేశాలు, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను పరిచయం చేయాలన్నారు. హోం స్టే నిర్వాహకులైన గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని, వారికి మరింత ఉపాధి, ఆదాయం లభించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణ గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను అసిస్టెంట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నియమించి, పర్యాటక ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఎక్కువగా హోం స్టేలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సాధికారతకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి 41 చోట్ల హోం స్టేలు పర్యాటకులకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్‌ వినియోగం జరగకూడదని, సంపూర్ణంగా ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఆయన చెప్పారు. అరకులోయ, మారేడుమిల్లి ప్రాంతాల్లో సమగ్ర పర్యాటక సమాచారం సెంటర్లను ఏర్పాటు చేసి వాటిలో జిల్లాలోని పర్యాటకానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులు అనుసరించాల్సిన నిబఽంధనలు, జాగ్రత్తలు సూచించే బోర్డులు ఏర్పాటు చే యాలన్నారు. అల్లూరి జిల్లాలో వంజంగి, జోలాపుట్‌, పోలవరం జిల్లాలో భూపతిపాలెం రిజర్వాయర్ల ప్రాంతాల్లో వాటర్‌ స్పోర్ట్స్‌ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన అనుమతులు జారీ చేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి టూరిజం ప్రాజెక్టులో స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు, ఆదాయం మార్గాలుండాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువతతో సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు. విశాఖలోని గ్లాస్‌ బ్రిడ్జి తరహాలో బొర్రా గుహలు వద్ద జిప్‌లైనర్‌కు సమాంతరంగా గ్లాస్‌ బ్రిడ్జి ఏర్పాటుకు గల అవకాశాలను నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. అనంతగిరి మండలం కాశీపట్నంలో స్కైలాంజ్‌, జిప్‌ లైనర్‌, గాలికొండ వ్యూపాయింట్‌లో జిప్‌ లైనర్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారిలో ప్రతి 20 లేదా 30 కిలోమీటర్ల పరిధిలో ఈవీ చార్జింగ్‌స్టేషన్లు, పెట్రోల్‌ బంకులు, రెస్ట్‌రూమ్‌లు, రెస్టారెంట్‌లు ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. పోలవరం జిల్లాలోని ప్రముఖ ఎకో టూరిజం స్పాట్‌గా ఉన్న గుడిసలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అటవీ శాఖాధికారులను ఆదేశించారు. పెదబయలు మండలం తారాబు జలపాతం అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఏపీ టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌ కల్యాణి, డివిజనల్‌ మేనేజర్‌ జగదీశ్‌, జిల్లా టూరిజం అధికారి జి.దాసు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌, జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు, సీపీవో ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:18 PM