నీటి భద్రతకు ప్రణాళిక
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:14 AM
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలైనా ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో నగరంలో తాగునీటి సమస్య తలెత్తింది.
నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వనరులు పెంపు
ఉన్నవాటితోపాటు కొత్తవనరుల అభివృద్ధి తప్పనిసరి
తాజా పరిస్థితి నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ యోచన
సమగ్ర అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం
అప్పికొండ వద్ద డీశాలినేషన్ ప్రాజెక్టు ప్రతిపాదన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలైనా ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో నగరంలో తాగునీటి సమస్య తలెత్తింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోవడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే...భవిష్యత్తులో పెరిగే జనాభా అవసరాలకు నీటి సరఫరా ఎలాగనే ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నీటి భద్రత ప్రణాళికపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టిసారించారు.
నగర ప్రజల తాగునీరు, పరిశ్రమల అవసరాలకు ప్రతిరోజూ ప్రస్తుతం 473 మిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ వంటి రిజర్వాయర్లతోపాటు గోదావరి, గోస్తనీ నదుల్లో ఊటబావుల నుంచి జీవీఎంసీకి 410 ఎంఎల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో పరిశ్రమలకు కేటాయింపులో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో నగరం చుట్టుపక్కలా ఐటీ సహా అనేక కంపెనీలు రానున్నాయి. గూగుల్‌తోపాటు అనేక సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించాయి. దీంతో జనాభా శరవేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుత నీటి డిమాండ్, భవిష్యత్తులో పెరుగుదలపై ఇటీవల సింగపూర్‌కు చెందిన వాటర్ సెంటర్, ఆస్ర్టేలియాకు చెందిన ఐఎ్‌సఎఫ్ అనే సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. 2047 నాటికి నగరంలో నీటి డిమాండ్ 726 ఎంఎల్‌డీలకు పెరుగుతుందని అంచనా వేశాయి. అందుకోసం ఇప్పటినుంచే ఉన్న నీటి వనరులను అభివృద్ధి చేయడం, కొత్త వనరులను తయారుచేసుకోవడంపై దృష్టిపెట్టాల్సి ఉంటుందని సూచించాయి.
భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనడం ఎలా?
వర్షాభావ పరిస్థితులపై నగరవాసులతోపాటు అధికారుల్లో సైతం ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో కమిషనర్ కేతన్‌గార్గ్ ఇప్పటినుంచే నీటి భద్రత ప్రణాళిక అమలుపై దృష్టిసారించారు. సరఫరాలో వృథాను అరికట్టేందుకు మీటర్లు బిగించి, నిరంతర నీటిసరఫరా విధానం అమలుచేయాలని భావిస్తున్నారు. అలాగే కొత్తవనరుల అభివృద్ధిలో భాగంగా పోలవరం ఎడమకాలువ నుంచి 60 ఎంఎల్‌డీ నీటిని తీసుకోవడంపై చర్చలు జరుపుతున్నారు. పోలవడం ఎడమ కాలువ ద్వారా నీటిని గాజువాకలోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తీసుకువచ్చి, అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు పంపింగ్ చేయనున్నారు. అలాగే మేహాద్రిగెడ్డ నుంచి నీటిని ముడసర్లోవ వద్ద కొత్తగా నిర్మించబోయే ట్రీట్‌మెంట్ ప్లాంటుకు తీసుకువచ్చి నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా మధురవాడ ప్రాంతానికి తరలించేలా ప్రతిపాదనలు తయారుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నరవ 90 ఎంఎల్‌డీ సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎ్‌సటీపీ), అప్పుఘర్, పాతనగరాల్లో ఉన్న 30ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎస్‌టీపీలతోపాటు మధురవాడ ప్రాంతానికి యూజీడీ ప్రాజెక్టులో భాగంగా కాపులుప్పాడ వద్ద కొత్తగా నిర్మించబోయే ఎస్‌టీపీల్లో శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు కేటాయించడం ద్వారా ప్రస్తుతం వాటికి ఇస్తున్న నీటిని తాగునీటి అవసరాలకు మళ్లించే అంశంపైనా కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. వీటితోపాటు సముద్ర నీటిని తాగునీటికి అనుకూలంగా మార్చుకునేందుకు అప్పికొండ వద్ద వంద ఎంఎల్‌డీ సామర్థ్యంతో డీశాలినేషన్ ప్రాజెక్టు ఏర్పాటు పనులు కూడా వీలైనంత త్వరగా ప్రారంభించేలా చూడాలని కమిషనర్ భావిస్తున్నారు. ఈ పనులను ఆర్థికభారం లేకుండా ఎలా అమల్లోకి తేవాలనే దానితోపాటు, ప్రాజెక్టులు అందుబాటులోకి తేవడానికి అవసరమైన ప్రతిపాదనలతో కార్యాచరణ రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.