Share News

రాజ్‌మా సాగు విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:23 PM

జిల్లాలో రాజ్‌మా సాగు విస్తీర్ణం పెంపునకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆదివాసీ రైతులకు మేలిరకం రాజ్‌మా వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలను పునఃప్రారంభించనున్నారు.

రాజ్‌మా సాగు విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక
పరిశోధన స్థానంలో రాజ్‌మా ప్రయోగాత్మక సాగు(ఫైల్‌)

మేలిరకం వంగడాలపై పరిశోధనలు పునఃప్రారంభం

ఉత్తరాది నుంచి గిరిజన ప్రాంతానికి అనువైన రకాల దిగుమతి

చింతపల్లి రెడ్‌, వైట్‌కి పేటెంట్‌ కోసం చర్యలు

చింతపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాజ్‌మా సాగు విస్తీర్ణం పెంపునకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆదివాసీ రైతులకు మేలిరకం రాజ్‌మా వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలను పునఃప్రారంభించనున్నారు. 2016 నుంచి కొన్ని రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. తాజాగా ఉత్తరాది నుంచి గిరిజన ప్రాంతానికి అనువైన రకాలను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మక సాగు చేపట్టేందుకు శాస్త్రవేత్తలు కార్యాచరణ రూపొందించారు. ఐదేళ్లలో మేలిరకం వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చింతపల్లి రెడ్‌, వైట్‌కి పేటెంట్లు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.

దక్షిణ భారత దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే రాజ్‌మా పండుతుంది. ఈ ప్రాంత నేలలు, వాతావరణం రాజ్‌మా సాగుకు అత్యంత అనుకూలం. ఆదివాసీ రైతులు సుమారు 40 ఏళ్లుగా వర్షాధార సంప్రదాయేతర పంటగా వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. పదేళ్ల క్రితం వరకు రాజ్‌మా సుమారు 50 వేల ఎకరాల్లో గిరిజన రైతులు సాగు చేసేవారు. కాలక్రమంగా ప్రకృతి వైపరీత్యాలు, నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం వల్ల సాగు విస్తీర్ణం పడిపోయింది. 2023-24 నాటికి ఏజెన్సీ పదకొండు మండలాల్లో కేవలం 20 వేల ఎకరాల్లో మాత్రమే రాజ్‌మా సాగు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం, రాజ్‌మా సాగును ప్రోత్సహించడంతో 2025-26 నాటికి 45 వేల ఎకరాల్లో సాగు చేపట్టి ఒకే ఏడాది 25 వేల ఎకరాల విస్తీర్ణం పెంచారు. ఈ ఏడాది 60 వేల ఎకరాల్లో సాగు చేపట్టాలని వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే 2024 ముందు ఎకరానికి కేవలం 2.4 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే ఉండగా, ప్రభుత్వ సాంకేతిక సహకారం వల్ల గత ఏడాది గిరిజన రైతులు ఎకరానికి 4.85 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ ఏడాది 5-6 క్వింటాళ్ల దిగుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గిరిజన రైతులకు కాఫీ, మిరియాలు, పసుపు తరువాత అధిక ఆదాయం సమకూర్చే ఏకైక వ్యవసాయ పంట రాజ్‌మా ఒక్కటేనని రైతులు గుర్తించి సాగుపై ఆసక్తి పెంచుకుంటున్నారు. అయితే గిరిజన రైతులకు నేటికి నాణ్యమైన విత్తనం అందుబాటులో లేదు. ఏళ్ల క్రితం నాటి చింతపల్లి రెడ్‌, వైట్‌ రకాలను మాత్రమే గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ, ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల సహకారంతో ఈ ఏడాది చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మేలిరకం వంగడాలను అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేశారు.

ఆరు రకాల విత్తనాలపై అధ్యయనం

చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆరేళ్లపాటు మేలిరకం వంగడాలపై పరిశోధనలు చేపట్టారు. 2016లో పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు కాన్పూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ జాతీయ అపరాల పరిశోధన సంస్థ నుంచి ఆరు రకాల రాజ్‌మా విత్తనాలను దిగుమతి చేసుకుని పరిశోధనలు ప్రారంభించారు. 2021-22 వరకు పరిశోధనలు జరిగాయి. పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఆరు రకాల వంగడాలపై అధ్యయనం చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, కాన్పూరు జాతీయ అపరాల పరిశోధన సంస్థ నుంచి తీసుకొచ్చిన అంబెర్‌, ఫాల్గుణ, అరుణ్‌, ఉత్కర్స్‌, ఉదయ్‌, ఆర్కాకోమల్‌తోపాటు ప్రాంతీయంగా లభించే చింతపల్లి రెడ్‌ విత్తనాలపై శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపడుతున్నారు. ప్రధానంగా గింజ పరిమాణం, దిగుబడి, తెగుళ్లు తట్టుకునే శక్తితో పాటు పోషక విలువలు, రుచి ఆధారంగా గిరిజన ప్రాంతానికి అరుణ్‌, ఉత్కర్స్‌ రకాలు అత్యంత అనుకూలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే 2024-25లో ఏడీఆర్‌ ఆళ్ల అప్పలస్వామి పర్యవేక్షణలో చింతపల్లి రెడ్‌లో మేలిరకం వంగడాలను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు నిర్వహించారు.

పరిశోధనలు పునఃప్రారంభం

గిరిజన రైతులకు నాణ్యమైన రాజ్‌మా విత్తనం ఆవశ్యకత పెరగడంతో శాస్త్రవేత్తలు పరిశోధనలు పునఃప్రారంభిస్తున్నారు. గతంలో చేపట్టిన రాజ్‌మా పరిశోధనలు అధ్యయనం చేస్తూ ప్రయోగాత్మక సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఏడీఆర్‌ డాక్టర్‌ డి.ఆదిలక్ష్మి పర్యవేక్షణలో పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ముందస్తు రబీలో ప్రయోగాత్మక సాగు చేపట్టనున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:23 PM