Share News

వెయ్యి ఎకరాల్లో విదేశీ కూరగాయల సాగుకు ప్రణాళిక

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:27 PM

జిల్లాలో వెయ్యి ఎకరాల్లో డ్వాక్రా మహిళా రైతులతో విదేశీ కూరగాయల సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఏపీ సెర్ప్‌(సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) అదనపు సీఈవో ఆర్‌.శ్రీరాములు నాయుడు తెలిపారు.

వెయ్యి ఎకరాల్లో విదేశీ కూరగాయల సాగుకు ప్రణాళిక
బలభద్రంలో మహిళా రైతులతో మాట్లాడుతున్న ఏపీ సెర్ప్‌ అదనపు సీఈవో శ్రీరాములు నాయుడు

మూడు వేల మంది డ్వాక్రా మహిళా రైతులు ఎంపిక

తొలి ఏడాది ప్రయోగాత్మక సాగు విజయవంతం

ఏపీ సెర్ప్‌ అదనపు సీఈవో శ్రీరాములు నాయుడు

చింతపల్లి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వెయ్యి ఎకరాల్లో డ్వాక్రా మహిళా రైతులతో విదేశీ కూరగాయల సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఏపీ సెర్ప్‌(సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) అదనపు సీఈవో ఆర్‌.శ్రీరాములు నాయుడు తెలిపారు. సోమవారం మండలంలోని బలభద్రం గ్రామంలోని గిరిజన మహిళా రైతు సాగు చేస్తున్న విదేశీ కూరగాయల పంట పొలాన్ని ఆయన సందర్శించారు. మహిళా రైతు సాగు చేస్తున్న గ్రీన్‌, ఎల్లో జుక్కినీ, రెడ్‌ క్యాబేజీ, పింక్‌, ఎల్లో క్యాలీఫ్లవర్‌ పంటలను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. డ్వాక్రా మహిళలు వ్యవసాయంలో రాణించేందుకు సెర్ప్‌ విదేశీ కూరగాయల సాగును గిరిజన డ్వాక్రా మహిళలకు పరిచయం చేస్తున్నామన్నారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 350 మంది గిరిజన మహిళా రైతులతో 150 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా విదేశీ కూరగాయల సాగు ప్రారంభించామన్నారు. వెలుగు, సెర్ప్‌ ప్రతినిధులు విత్తనాలు నాటిన నాటి నుంచి పంటను మార్కెటింగ్‌ చేసుకునే వరకు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. గత ఏడాది విదేశీ కూరగాయల సాగు చేసిన మహిళలు ఆర్థికంగా లాభాలను ఆర్జిస్తూ కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నారన్నారు. ఈ మహిళలను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది మహిళా రైతులు విదేశీ కూరగాయల సాగుకు ముందుకొచ్చారని చెప్పారు. ఈ మేరకు ఈ ఏడాది ఏజెన్సీ పదకొండు మండలాల్లో వెయ్యు ఎకరాల్లో మూడు వేల మంది డ్వాక్రా మహిళా రైతులతో విదేశీ కూరగాయల పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ఖరీఫ్‌లో మహిళా రైతులతో నాట్లు వేయిస్తామన్నారు. ఏడాది పొడవున రైతులు కూరగాయల పంటలను సాగు చేసుకోవచ్చునన్నారు. రైతులకు విత్తనాలు, సాంకేతిక సహకారం, మార్కెటింగ్‌ సదుపాయం సెర్ప్‌, వెలుగు అధికారులు కల్పిస్తారని చెప్పారు. గత ఏడాది 15 రకాల శీతల, విదేశీ కూరగాయల పంటలను రైతులకు పరిచయం చేశామన్నారు. ఈ ఏడాది 30 రకాలను మహిళా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. రైతులు ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. విదేశీ కూరగాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. మహిళా రైతులు పండించిన కూరగాయలను ప్రాంతీయ మార్కెట్‌లో విక్రయించడంతో పాటు మైదాన ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు సెర్ప్‌ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని మహిళా రైతులు సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయంలో రాణించాలని, ఆర్థిక ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మురళి, సెర్ప్‌ ఎస్పీఎంలు బి.శ్రీనివాసులు, డాక్టర్‌ కె.కులశేఖర్‌, వ్యవసాయ నిపుణుడు బెహరా నాగేశ్వరరావు, ఏపీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:28 PM