Share News

వీఈఆర్‌ అభివృద్ధికి ప్రణాళిక

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:24 AM

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

వీఈఆర్‌ అభివృద్ధికి ప్రణాళిక

నక్కపల్లిలో స్టీల్‌ సిటీ

ప్రత్యేకంగా వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌

అచ్యుతాపురంలో టాయ్స్‌ పార్క్‌

పర్యాటకాభివృద్ధికి సింహాచలంలో మరిన్ని వసతులు

దేవస్థానాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు

హోమ్‌ స్టే, స్టార్టప్‌లు, బీచ్‌ షాక్స్‌కు ప్రత్యేక పాలసీలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో విశాఖ నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు బే-టెక్‌ సిటీ ఏర్పాటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, వాటిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

ఇప్పటివరకూ విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ తయారుచేస్తూ వచ్చింది. త్వరలో నక్కపల్లి స్టీల్‌ సిటీకి ఒక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్కడ ఆర్సెల్లార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ రూ.70 వేల కోట్లతో భారీ ప్లాంటు నిర్మాణానికి నడుంకట్టడం, ప్రత్యేకంగా పోర్టు అభివృద్ధికి అనుమతులు తీసుకోవడంతో ఆ ప్రాంతాన్ని ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చేయడానికి నక్కపల్లి స్టీల్‌ సిటీ పేరుతో మాస్టర్‌ప్లాన్‌ తయారుచేయనున్నది. ఇందులో భూమిని మిక్స్‌డ్‌ యూజ్‌ అంటే...అటు పరిశ్రమలు, ఇటు నివాసాలకు అనుగుణంగా ప్రాంతాలను గుర్తిస్తారు. ఏయే ప్రాంతాలను వేటికి ఉపయోగించుకోవాలో అందులో సూచిస్తారు.

బ్రాండిక్స్‌ అండ్‌ టాయ్‌ పార్క్‌

పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం పరిసరాల్లో ఇప్పటికే ఉన్న బ్రాండిక్స్‌ కంపెనీని మరింత విస్తరిస్తూ కొత్తగా టాయ్స్‌ పరిశ్రమను ప్రోత్సహిస్తారు. అదేవిధంగా ఏటికొప్పాక, ఇతర బొమ్మల తయారీకి పెట్టుబడులు ఆకర్షిస్తారు. దీనికి టాయ్స్‌ పార్క్‌ పెడతారు.

వ్యర్థాల రీసైక్లింగ్‌కు మరో పార్క్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఆటోమొబైల్‌ వ్యర్థాలు, ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడానికి ‘సర్క్యులర్‌ పార్క్‌’ ఒకటి 100 నుంచి 200 ఎకరాల్లో ఏర్పాటుచేస్తారు. ఇది ఏ ప్రాంతంలో అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

- వీఈఆర్‌లో భాగంగా గంగవరం ప్రైవేటు పోర్టును మరింత విస్తరిస్తారు. తూర్పు తీర ప్రాంతంలో కీలకంగా ఉన్న విశాఖపట్నం పరిసరాల్లో నౌకా నిర్మాణం, నౌకలకు మరమ్మతులు చేసే పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటారు.

- పర్యాటకాభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలుగా పేరొందిన సింహాచలం, అన్నవరం దేవస్థానాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. సింహాచలం కొండలు, వాటి అనుబంధ ఆలయాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. భక్తులకు వసతులు, సౌకర్యాలు పెంచుతారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో గోవా తరహాలో ఏర్పాటు చేయదలచిన బీచ్‌ షాక్స్‌ (వెదురు, చెక్క, తాటి ఆకులతో ఏర్పాటుచేసే తాత్కాలిక రెస్టారెంట్లు, కేఫ్‌లు, బార్‌లు), హోమ్‌ స్టేలకు ప్రత్యేక పాలసీలు తయారుచేస్తారు. ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ కింద స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి మరో పాలసీ తీసుకువస్తారు. వీటిపై పనిచేయాలని ఆయా శాఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

Updated Date - Nov 22 , 2026 | 01:24 AM