కాలుష్య నియంత్రణకు ప్రణాళిక
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:40 AM
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గాలి నాణ్యత నమోదుకు పీసీబీ నిర్ణయం
పరిశ్రమలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో మధురవాడ, రుషికొండ, ఆరిలోవ హెల్త్ సిటీ ప్రాంతాల్లో మిషన్లు ఏర్పాటు
వాహనాల రద్దీ ఉండే కూడళ్లలో కూడా...
ఆ సమాచారం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ
విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ధూళి ప్రభావం ఉన్న ప్రాంతాలతోపాటు ఐటీ సంస్థలు ఉన్న మధురవాడ, రుషికొండ ప్రాంతాలు, ఆస్పత్రులు ఉన్న ఆరిలోవ హెల్త్ సిటీ, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే కొమ్మాది, వేపగుంట, కారుషెడ్ జంక్షన్, బీచ్‌రోడ్డు...ఇలా మరికొన్నిచోట్ల గాలి నాణ్యతను పరిశీలించనున్నది.
గత నెల తొలి వారం నుంచి నగరంలో కాలుష్య కారకాల ప్రభావం పెరగడంతో గాలి నాణ్యత క్షీణించింది. పీఎం 10, పీఎం 2.5 ప్రమాదకర స్థాయిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీ ప్రాంతమైన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం భవనంపై గల ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ యంత్రంలో గాలి నాణ్యత సూచీ 300 మార్కును దాటింది. విశాఖ జాతీయ స్థాయిలో ధూళి నగరాల జాబితాలో చేరింది. అందుకు పరిశ్రమలు, సంస్థల నిర్లక్ష్యమే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
సుమారు 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న జీవీఎంసీ మొత్తానికి ఒక్కచోటే ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ యంత్రం ఉంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ మిషన్ల ద్వారా పోలీస్ బ్యారెక్స్, మింది, ఆటోనగర్, ఎంవీపీ కాలనీ, మాధవధార, పెదగంట్యాడ, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యతను నిర్ధారించి నగరం మొత్తం సగటును గణిస్తున్నది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మిషన్లు ఉండే ప్రాంతాలన్నీ ధూళి కాలుష్యం ఎక్కువగా ఉండే కూడళ్లు కావడంతో గాలి నాణ్యత సూచీలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయనే వాదన ఉంది. ప్రస్తుతం నగరంలో గాలినాణ్యత సూచీ 250 నుంచి 300 మార్కును దాటి నమోదవుతుంది. ఈ నేపథ్యంలో పోర్టు, దాని అనుబంధ కార్యకలాపాలు, పరిశ్రమలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత కొలిచే యంత్రాలు ఏర్పాటుచేసి, అక్కడ నమోదయ్యే పీఎం 10, పీఎం 2.5, ఇతర వాయువుల శాతం ఎంత? అనేది పరిశీలించనున్నారు. పీఎం 10, పీఎం 2.5, నైట్రోజన్ ఆక్సైడ్, ఇతర వాయువులు పరిమితికి మించి నమోదవుతుంటేనే గాలి నాణ్యత క్షీణిస్తుంది. గాలి నాణ్యత క్షీణించడానికి పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చే కాలుష్యం ఒక్కటే కారణమా? లేదా వాహనాలు, భవన నిర్మాణాలు, ఇతరత్రా కారణాలు ఉన్నాయా?...అనేది తెలుసుకుంటారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించిందా?, కొన్ని ప్రాంతాలకే పరిమితమైందా?...అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పైడి వెంకటముకుందరావు తెలిపారు. దీనిని బట్టి కాలుష్య తీవ్రత తగ్గించడానికి కార్యాచరణ అమలుచేస్తామన్నారు.
ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ
జిల్లా అధికారులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశం
ఐటీ, పర్యాటకంపై ప్రధాన దృష్టి
బీచ్ ఫ్రంట్‌లు, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్...
భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలోగా మాస్టర్‌ప్లాన్ రోడ్లు పూర్తిచేయాలి
విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకువెళ్లాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీఈఆర్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, భూసేకరణ, మాస్టర్‌ప్లాన్ అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ కమిషనర్లు కేతన్ గార్గ్, తేజ్‌భరత్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, భూముల వివరాలు మ్యాపింగ్ చేయాలన్నారు. గ్రోత్ డ్రైవర్లను గుర్తించి అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం రెండు, మూడు నెలల్లో శాఖల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. మౌలిక వసతులు పెంపొందించాలని, మురికివాడలు లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు.
నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. రహదారుల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కైలాసగిరి నుంచి భీమిలి వరకూ పర్యాటక కోర్ సిటీ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్ ఫ్రంట్‌లు, ప్రపంచస్థాయి థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దేలా ప్రణాళిక అమలుచేయాలన్నారు. మాస్టర్‌ప్లాన్ కింద కైలాసగిరి మెగా రీడిజైన్ పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలోగా మాస్టర్‌ప్లాన్ రోడ్లు పూర్తిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్‌మాథుర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉక్కులో ఈ ఏడాది 875 మంది పదవీ విరమణ
ఎనిమిది వేలకు పడిపోనున్న ఉద్యోగుల సంఖ్య
విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులో ఈ ఏడాది మొత్తం 875 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ప్లాంటులో అత్యధికులు మూడు దశాబ్దాల క్రితం నియమితులైనవారు ఉన్నారు. ఇటీవల కాలంలో యాజమాన్యం రిక్రూట్‌మెంట్ నిలిపివేసింది. మరోవైపు వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ అమలు చేస్తోంది. ఇప్పటికి రెండుసార్లు ఈ పథకం ద్వారా సుమారు రెండు వేల మందిని ఇంటికి పంపించేసింది. ఇటీవల మూడో విడత వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ పథకం ద్వారా మరో 500 మందిని తగ్గించే అవకాశం ఉంది. 2025 డిసెంబరు నాటికి స్టీల్‌ప్లాంటులో ఎగ్జిక్యూటివ్‌లు 2,790 మంది, నాన్ ఎగ్జికక్యూటివ్‌లు 6,500 మంది కలిసి 9,290 మంది ఉన్నారు. 2026లో నెలకు 50 మందికి తక్కువ కాకుండా రిటైర్‌మెంట్లు ఉన్నాయి. ఒక్క జూన్‌లోనే 201 మంది, మేలో 109 మంది పదవీ విరమణ చేస్తారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే డిసెంబరు నాటికి కేవలం సుమారు ఎనిమిది వేల మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు ఉంటారు. వారితో రోజుకు 19 వేల టన్నుల ఉత్పత్తి సాధించడం కష్టమని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రారంభించడంతో పాటు కొన్నేళ్లుగా నిలిపివేసిన పదోన్నతులు కూడా ఇవ్వాలని, లేని పక్షంలో చాలా మంది ఇతర ప్లాంట్లకు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.