తాగునీటికి ప్రణాళిక
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:11 AM
నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపడుతున్నామని ఎంపీ ఎం.శ్రీభరత్ వెల్లడించారు.
ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం
వర్షాభావంతో రిజర్వాయర్లలో తగ్గిన నిల్వలు
ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి
ఫిర్యాదులపై తక్షణం స్పందించేలా వ్యవస్థ
ఎంపీ ఎం.శ్రీభరత్
నీటి సరఫరాపై ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష
విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపడుతున్నామని ఎంపీ ఎం.శ్రీభరత్ వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్ కేతన్ గార్గ్, నీటి సరఫరా విభాగం అధికారులతో నీటి వనరుల లభ్యతపై శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం వల్ల రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిపోయాయని, ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టామన్నారు. విశాఖకు ఏలేరు కాలువ నీరే ప్రధానమని, అందులో పూడికలు పేరుకుపోయాయని, వాటిని తీయించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకూ 25శాతం పూడిక తీశామన్నారు. మొత్తం పూడిక తీస్తే 600 క్యూసెక్కుల నీటి ప్రవాహం సాధ్యమవుతుందన్నారు. 2027 జూన్ నాటికి విశాఖపట్నానికి 6.2 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని, అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకొని కొరత లేకుండా చూస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు కూడా 2027 జూన్ నాటికి పూర్తవుతాయన్నారు. పైపులైన్ నెట్‌వర్క్‌ను సమర్థంగా వినియోగించుకునే అంశంపై చర్చించామన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించామన్నారు. నీటికి సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించేలా రెస్పాన్సివ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. భూగర్భ జలాల దుర్వినియోగం అరికట్టాల్సి ఉందని, అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్న, విచ్చలవిడిగా భూగర్భ జలాలను వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. అపార్టుమెంట్లకు బల్క్ కనెక్షన్లు తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇంకుడు గుంతల ప్రాధాన్యంపై ప్రచారం చేస్తామన్నారు. కేంద్రం నిధులు రూ.220 కోట్లతో వరద నివారణ ప్రాజెక్టు (అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్టు) అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.