Share News

నగర నీటి భద్రతకు ప్రణాళిక

ABN , Publish Date - May 22 , 2026 | 12:20 AM

ఆస్తి పన్ను ప్రధాన ఆదాయంగా ఉన్న జీవీఎంసీకి భవిష్యత్తులో నీటి సరఫరాయే అతిపెద్ద ఆదాయ వనరుగా మారేలా భవిష్యత్తు నీటి భద్రత ప్రణాళిక (ఫ్యూచర్‌ వాటర్‌ సేఫ్టీ ప్లాన్‌)ను తయారుచేసినట్టు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు.

నగర నీటి భద్రతకు ప్రణాళిక

  • భవిష్యత్తులో జీవీఎంసీకి అదే ప్రధాన ఆదాయ వనరు

  • పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వనరులు పెంపు

  • పోలవరం ఎడమ కాలువ నుంచి 60 ఎంజీడీ అదనంగా తీసుకునేలా పైప్‌లైన్‌

  • అప్పికొండ వద్ద రూ.100 కోట్లతో డీశాలినేషన్‌ ప్రాజెక్టు

  • ఆర్థిక భారం లేకుండా పీపీపీ విధానంలో నిర్వహణ

  • నరవ ఎస్‌టీపీ నుంచి శుద్ధి చేసిన నీరు జిందాల్‌కు సరఫరా

  • ‘ఆంధ్రజ్యోతి’తో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):

ఆస్తి పన్ను ప్రధాన ఆదాయంగా ఉన్న జీవీఎంసీకి భవిష్యత్తులో నీటి సరఫరాయే అతిపెద్ద ఆదాయ వనరుగా మారేలా భవిష్యత్తు నీటి భద్రత ప్రణాళిక (ఫ్యూచర్‌ వాటర్‌ సేఫ్టీ ప్లాన్‌)ను తయారుచేసినట్టు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. నగర పరిధిలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల విస్తరణ, డేటా సెంటర్‌లతోపాటు అనేక కొత్తపరిశ్రమలు, సంస్థలు రాక నేపథ్యంలో పెరగనున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా వనరులను పెంచుకునేలా భవిష్యత్తు నీటి భద్రత ప్రణాళికను తయారు చేసినట్టు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ వంటి రిజర్వాయర్లు, గోదావరి, గోస్తనీ నదుల నుంచి జీవీఎంసీకి ప్రతిరోజూ 410 మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) సరఫరా అవుతోంది. ప్రస్తుతం మరో 63 ఎంఎల్‌డీకి డిమాండ్‌ ఉంది. నగర జనాభా శరవేగంగా పెరుగుతుండడం, ఉన్న పరిశ్రమలు విస్తరిస్తుండడం, కొత్త పరిశ్రమలు వస్తుండడంతో భవిష్యత్తులో నీటి డిమాండ్‌ మరింత పెరుగుతుంది. వీటన్నింటినీ అధ్యయనం చేసిన సింగపూర్‌కు చెందిన వాటర్‌ సెంటర్‌, ఆస్ర్టేలియాకు చెందిన ఐఎస్‌ఎఫ్‌ వంటి సంస్థలు 2047 నాటికి నగరంలో నీటి డిమాండ్‌ 726 ఎంఎల్‌డీకి పెరుగుతుందని అంచనా వేశాయి. ఇప్పటినుంచే నీటి వనరులను అదేస్థాయిలో పెంచుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తప్పవని గుర్తించిన జీవీఎంసీ ఆయా సంస్థలతో వాటర్‌ సెక్యూరిటీ ప్లాన్‌ తయారుచేసింది. నగరమంతటికీ స్కాడా మీటర్ల ద్వారా నిరంతర నీటి సరఫరా చేస్తూ వృథాను అరికట్టడం, కొత్త వనరుల అభివృద్ధి వంటి అంశాలను ప్లాన్‌లో పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ నుంచి 60 ఎంఎల్‌డీ నీటిని గాజువాకలోని కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు తీసుకువచ్చి, అక్కడి నుంచి పైప్‌లైన్‌ ద్వారా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించాం. అక్కడ నుంచి ముడసర్లోవలో కొత్తగా నిర్మించే ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు తీసుకువచ్చి నీటిని శుద్ధి చేసి, పైప్‌లైన్‌ ద్వారా మధురవాడ ప్రాంతానికి సరఫరా చేయనున్నాం. ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) ద్వారా సమకూరుతున్న రూ.722 కోట్ల ప్రాజెక్టులో భాగంగా ఆయా పనులను పూర్తిచేసేలా డీపీఆర్‌ తయారుచేశాము.

అలాగే నరవలో నిర్మించిన 90 ఎంఎల్‌డీ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (ఎస్‌టీపీ)తోపాటు అప్పుఘర్‌, పాత నగరంలోని ఎస్‌టీపీలతోపాటు కాపులుప్పాడ వద్ద కొత్తగా నిర్మించబోయే ఎస్‌టీపీల్లో శుద్ధి చేసిన నీటిని పరిశ్రమల అవసరాలకు కేటాయించాలని వాటర్‌ సెక్యూరిటీ ప్లాన్‌లో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం పరిశ్రమలకు 700 ఎంఎల్‌డీ డిమాండ్‌ ఉన్నప్పటికీ, జీవీఎంసీ మాత్రం కేవలం 145 ఎంఎల్‌డీ మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. తర్లువాడ, అడవివరంలో గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తే మరో మూడు ఎంఎల్‌డీ సరఫరా చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు జీవీఎంసీకి విజ్ఞప్తిచేశారు. ఇవన్నీ కలుపుకుంటే డిమాండ్‌ మరింత పెరుగుతుంది. పరిశ్రమలకు ఎస్‌టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయగలిగితే తాగునీటి సమస్యలకు పూర్తిగా పరిష్కారం చూపించినట్టే అవుతుంది.

కొత్తవలసలోని జిందాల్‌ పరిశ్రమ ప్రస్తుతం 13 ఎంఎల్‌డీ తమకు సరఫరా చేయాలంటూ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకుంది. నరవ ఎస్‌టీపీ నుంచి శుద్ధి చేసిన నీటిని పైప్‌లైన్‌ ద్వారా జిందాల్‌కు సరఫరా చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతానికి మూడు ఎంఎల్‌డీ ఇచ్చి, రెండో దశ కింద మరో పది ఎంఎల్‌డీలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పరిధిలోని పరిశ్రమలకు ఇతర ఎస్‌టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాము.

ఆస్తి పన్నును మించి జీవీఎంసీ ఆదాయం

రానున్న ఐదేళ్లలో కనీసం 200 మిలియన్‌ లీటర్ల నీటిని పరిశ్రమలకు అదనంగా కేటాయించాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నార్త్‌ వెస్ట్‌ సిటీలో ఐదు వేల ఇళ్లకు నిరంతర నీటి సరఫరా ప్రాజెక్టు అందుబాటులోకి తేవడంతో వృథా తగ్గింది. అలా మిగిలిని నీటిని పరిశ్రమలకు కిలోలీటర్‌ రూ.98 చొప్పున విక్రయిస్తున్నాం. దీనివల్ల జీవీఎంసీకి నెలకు రూ.ఏడున్నర లక్షలు ఆదాయం సమకూరుతుంది. అదే 200 ఎంఎల్‌డీ పరిశ్రమలకు సరఫరా చేయగలిగితే కనీసం రూ.300 కోట్లు ఆదాయం సమకూరుతుంది. అదే జరిగితే వార్షిక ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయం కంటే నీటి సరఫరా ద్వారానే జీవీఎంసీకి అధిక ఆదాయం లభించినట్టవుతుంది.

రూ.వంద కోట్లతో డీశాలినేషన్‌ ప్లాంట్‌

పరిశ్రమల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు ఎస్‌టీపీల నుంచి శుద్ధి చేసిన నీరు సరిపోదు. అందువల్ల సముద్ర నీటిని శుద్ధి చేయడం ద్వారా పరిశ్రమల అవసరాలను తీర్చాలని జీవీఎంసీ భావిస్తోంది. అందుకోసం అప్పికొండ వద్ద వంద ఎంఎల్‌డీ సామర్థ్యంతో డీశాలినేషన్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేయడంతోపాటు ఇప్పటికే ఆర్‌ఎఫ్‌పీ ప్రక్రియ పూర్తిచేశాం. ముంబైతోపాటు తమిళనాడు రాష్ట్రంలో డీశాలినేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అనుభవం కలిగిన సంస్థలు ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకువచ్చాయి. జీవీఎంసీపై ఆర్థిక భారం పడకుండా ప్లాంటు ఏర్పాటును పీపీపీ విధానంలో చేపట్టేలా అధికారులు ప్రతిపాదన చేశారు. ప్లాంటు కోసం అవసరమైన భూమితోపాటు ఇతర సదుపాయాలను జీవీఎంసీ కల్పించడానికి, ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ నిర్మాణానికి అవసరమయ్యే రూ.వంద కోట్లు భరించేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్లాంటు ప్రారంభమైతే తర్వాత డిమాండ్‌ను బట్టి విస్తరించడం జరుగుతుంది.

Updated Date - May 22 , 2026 | 12:20 AM