Share News

అవకతవకలు జరిగినా చర్యలకు మీనమేషాలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:45 PM

నర్సీపట్నం డీసీసీబీ బ్రాంచి పరిధిలోని చెట్టుపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ రెండేళ్లుగా కొనసా....గుతోంది. సీఈవోపై జరిగిన సెక్షన్‌ 51 విచారణలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారణ అయినప్పటికి చర్యలు తీసుకోకుండా మూడేళ్లుగా అధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవకతవకలు జరిగినా చర్యలకు మీనమేషాలు
చెట్టుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం

చెట్టుపల్లి పీఏసీఎస్‌ పూర్వపు సీఈవో అక్రమాలపై గతంలో విచారణ

రూ.80 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ

రూ.1.09 కోట్లకు సర్‌చార్జి ఆర్డర్స్‌ ఇచ్చిన డివిజన్‌ రిజిస్ట్రార్‌

జప్తు ఆర్డర్‌ నోటీసు జారీ చేసిన సేల్స్‌ ఆఫీసర్‌

ట్రిబ్యునల్‌కి వెళ్లి అవకాశం కోరిన చలపతిరావు

మళ్లీ కొనసా...గుతున్న విచారణ

నర్సీపట్నం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం డీసీసీబీ బ్రాంచి పరిధిలోని చెట్టుపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ రెండేళ్లుగా కొనసా....గుతోంది. సీఈవోపై జరిగిన సెక్షన్‌ 51 విచారణలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారణ అయినప్పటికి చర్యలు తీసుకోకుండా మూడేళ్లుగా అధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పీఏసీఎస్‌ పరిధిలో 1,080 మంది ఖాతాదారులు ఉన్నారు. ఇందులో డిఫాల్డర్స్‌ 280 మంది పోతే ప్రస్తుతం 800 మంది రైతులకు రూ.6 కోట్లు డీసీసీబీ ద్వారా వ్యవసాయ రుణాలు మంజూరు చేశారు. 2023 మే నెల వరకు ఇక్కడ సీఈవోగా పని చేసిన సెక్రటరీ పిట్టా చలపతిరావు రైతుల నుంచి వసూలు చేసిన రుణాలు దారి మళ్లించారని ఆయన మీద వచ్చిన ఆరోపణలపై 2024 సంవత్సరంలో సెక్షన్‌ 51 విచారణ జరిగింది. ఎలమంచిలి సహకార శాఖ డివిజినల్‌ రిజిస్ట్రార్‌ విచారణ అధికారిని నియమించారు. విచారణలో భాగంగా ఆర్థిక అవకతవకలపై రైతులను క్షుణ్ణంగా విచారించారు. పీఏసీఎస్‌లో రికార్డులు పరిశీలించిన తర్వాత సీఈవో చలపతిరావు రూ.82 లక్షలకు పైగా అవకతవకలకు పాల్పడ్డారని సెక్షన్‌ 51 విచారణలో నిర్ధారణ అయింది. అవకతవకలకు పాల్పడలేదని ఆధారాలు ఉంటే సమర్పించాలని చలపతిరావుకి అవకాశం ఇచ్చారు. ఆయన సరైన సమర్పించకపోవడంతో ఆస్తులు జప్తు చేయాలని సర్‌చార్జి ఆర్డర్స్‌ ఇచ్చారు. 2024 డిసెంబరులో అసలు, వడ్డీతో కలిపి రూ.1,09,57,000కి ఈపీ(ఎగ్జిక్యూటివ్‌ పిటీషన్‌) నోటీసులు ఇచ్చారు. నోటీసు ఆధారంగా సీఈవో చలపతిరావు విజయవాడ కో-ఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ కోర్టుకి వెళ్లి ఒక అవకాశం ఇవ్వమని కోరారు. దీంతో ట్రిబ్యునల్‌ కోర్టు కేసును ఎలమంచిలి డివిజనల్‌ రిజిస్ట్రార్‌కి పంపించింది. సీఈవోని విచారించి ఆరు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చి సుమారు ఏడాది కావస్తుంది. విచారణ ఇంకా కొన సా...గుతుంది తప్పితే తదుపరి చర్యలు తీసుకోలేదు. దీనిపై ప్రస్తుతం చెట్టుపల్లి ఈవోగా పని చేస్తున్న పట్నాయక్‌ను వివరణ కోరగా గత ఏడాది నవంబరు 17, 29, డిసెంబరు 8న చలపతిరావును విచారించామని తెలిపారు. మళ్లీ ఈ నెల 27న విచారణ ఉందని చెప్పారు.

Updated Date - Feb 14 , 2026 | 11:46 PM