పైనాపిల్ ధర పతనం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:18 PM
మన్యంలో ప్రస్తుతం పైనాపిల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఊహించని విధంగా ధర పతనం కావడంతో గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఒక్కో కాయ రూ.20 చొప్పున రిటైల్‌గా అమ్మకం
టోకుగా వర్తకులకు రూ.13 నుంచి రూ.15 చొప్పున విక్రయం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో ప్రస్తుతం పైనాపిల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఊహించని విధంగా ధర పతనం కావడంతో గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. గతవారం వరకు ఒక్కో కాయ హోల్‌సేల్ ధర రూ.18, రిటైల్ ధర రూ.25 చొప్పున పైనాపిల్ విక్రయాలు జరగగా, ప్రస్తుతం టోకుగా రూ.13 నుంచి రూ.15లు, రిటైల్‌గా రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ఈ ఏడాది పంట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్‌కు అధికంగా కాయలు రావడంతో డిమాండ్ తగ్గింది. దీంతో ధర పతనమైందని రైతులు, వర్తకులు తెలిపారు. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, అరకులోయ మండలాల్లో సుమారుగా 600 ఎకరాల్లో పైనాపిల్ తోటల పెంపకాన్ని గిరిజన రైతులు చేపడుతున్నారు. జిల్లా కేంద్రం పాడేరు మండలం వంట్లమామిడి, సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల పరిధిలో పదుల సంఖ్యలోని గిరిజన రైతులు వాటి పెంపకం చేపడుతున్నారు. వాటిని స్థానికంగా గ్రామాల్లో, వారపు సంతల్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. అయితే ఎటువంటి మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో మైదాన ప్రాంతానికి చెందిన వర్తకులు సైతం ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసుకుని చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం, తుని ప్రాంతాల్లోని మార్కెట్లలో విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ పరంగా తమకు ఎటువంటి తోడ్పాటు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సంతల్లో వర్తకులకు విక్రయించడం, మిగిలిన వాటిని రోడ్ల పక్కన దుకాణాలు పెట్టుకుని పర్యాటకులు, ప్రయాణికులకు అమ్మకాలు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.