Share News

ఊపందుకున్న అనాస, పనస విక్రయాలు

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:13 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి సమీపంలోనున్న చిట్రాళ్లగొప్పు ఉద్యాన పంటల మార్కెట్‌లో అనాస, పనస పండ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది గిరిజన ప్రాంతం నుంచి అనాస, పనస ఎగుమతులు పెరిగాయి. దీంతో పండ్లకు గిరాకీ పెరిగింది. పనస కాయ పరిమాణం ఆధారంగా రైతులకు రూ.80-150, అనాస రూ.20-25 ధర లభిస్తోంది. ఐదేళ్ల తరువాత మార్కెట్‌ ప్రారంభంలోనే అనాస, పనస పండ్లకు మంచి ధర రావడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఊపందుకున్న అనాస, పనస విక్రయాలు
చిట్రాళ్లగొప్పులో విక్రయిస్తున్న అనాస, పనస పండ్లు

పనస రూ. 80-150, అనాస రూ. 20-25

పండ్లకు పెరిగిన ధరలతో రైతుల ఆనందం

చిట్రాళ్లగొప్పు మార్కెట్‌లో సందడి

చింతపల్లి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి):

చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆదివాసీ రైతులు సంప్రదాయ పంటగా అనాస, పనస సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు అనాస, పనస దిగుబడులు వస్తాయి. రెండు మండలాలకు చెందిన రైతులు అనాస, పనస పండ్లను చిట్రాళ్లగొప్పు మార్కెట్‌కి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్‌కి వచ్చిన అనాస, పనస పండ్లను వర్తకులు కొనుగోలు చేసి భద్రాచలం, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌కు సోమవారం, గురువారం, శుక్రవారం గిరిజనులు అధిక మొత్తంలో పండ్లను మార్కెట్‌కి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రైతుల వద్ద వర్తకులు గంపగుత్తగా పండ్లను కొనుగోలు చేస్తారు. అయినప్పటికీ రైతులకు గరిష్ఠ ధర లభిస్తున్నది.

దుకాణాల్లో విక్రయం

చిట్రాళ్లగొప్పు మార్కెట్‌లో వర్తకులు దుకాణాల వద్ద ప్రతి రోజూ అనాస, పనస విక్రయాలు జరుపుతున్నారు. ఈ దుకాణాల్లో రైతులు విక్రయించిన ధర కంటే రూ.30 నుంచి రూ.50 వరకు ధర అధికంగా ఉంటుంది. ఈ దుకాణాల్లో రూ.వందకు మూడు అనాస, రూ.100 నుంచి 200 వరకు పనస పండ్లు విక్రయిస్తున్నారు. రైతుల వద్ద నుంచి నేరుగా పనస, అనాస పండ్లు కొనుగోలు చేయాలంటే సోమ, గురు, శుక్రవారాల్లో అందుబాటులోఉంటాయి.

Updated Date - Jun 12 , 2026 | 11:13 PM