ఘాటెక్కిన ఉల్లి
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:53 AM
ఉల్లి ధర ఘాటెక్కింది. సుమారు నెల రోజుల నుంచి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో కిలో ఉల్లిపాయలు రూ.25 వుండగా, ఇప్పుడు ఏకంగా రూ.60కి చేరాయి. కేవలం రెండు నెలల్లో 140 శాతం ధర పెరిగింది. ఉల్లి ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లో గురువారంనాటి ధరలను పరిశీలిస్తే.. శని, ఆదివారాల్లో కిలోకు మరో ఐదు నుంచి పది రూపాయల వరకు పెరిగే అవకాశం వుందని అనకాపల్లి పట్టణంలోని ఒక హోల్‌సేల్ ఉల్లి వ్యాపారి చెప్పారు.
రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు
జూన్ మొదటి వారంలో కిలో రూ.25
ప్రస్తుతం రూ.60కి చేరిక
రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయంటున్న హోల్‌సేల్ వ్యాపారులు
కర్నూలు జిల్లాలో పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి
అనకాపల్లి టౌన్/ నర్సీపట్నం/ ఎలమంచిలి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధర ఘాటెక్కింది. సుమారు నెల రోజుల నుంచి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో కిలో ఉల్లిపాయలు రూ.25 వుండగా, ఇప్పుడు ఏకంగా రూ.60కి చేరాయి. కేవలం రెండు నెలల్లో 140 శాతం ధర పెరిగింది. ఉల్లి ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లో గురువారంనాటి ధరలను పరిశీలిస్తే.. శని, ఆదివారాల్లో కిలోకు మరో ఐదు నుంచి పది రూపాయల వరకు పెరిగే అవకాశం వుందని అనకాపల్లి పట్టణంలోని ఒక హోల్‌సేల్ ఉల్లి వ్యాపారి చెప్పారు.
జిల్లా కేంద్రమైన అనకాపల్లి మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితంతో పోల్చితే వంద శాతానికిపైగా ధర పెరిగింది. జూన్ మొదటి వారంలో కిలో రూ.25కు అమ్మకాలు జరగ్గా.. అదే నెల చివరలో రూ.30కి పెరిగింది. జూలై చివరి వారానికి రూ.35కు చేరింది. ఈ నెల రెండో వారం వరకు కిలో రూ.40 వున్న ధరకు ఆ తరువాత రెక్కలు వచ్చాయి. రోజూ రెండు, మూడు రూపాయల చొప్పున పెరుగుతూ గురువారం నాటికి కిలో రూ.60కి చేరింది. తక్కువ నాణ్యత ఉన్న ఉల్లిపాయలు కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. రైతు బజారులో కిలో రూ.50కి విక్రయించారు. మహారాష్ట్రలోని సోలాపూర్, నాసిక్ హోల్‌సేల్ మార్కెట్ల నుంచి ఉల్లిపాయలను అనకాపల్లి హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. అనకాపల్లిలో నాలుగు హోల్‌సేల్ ఉల్లిపాయల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి స్థానిక వ్యాపారులు, చోడవరం, మాడుగులలో హోల్‌సేల్ వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. ఇంకా అనకాపల్లి పట్టణంలోని వీధుల్లో కూరగాయలు అమ్మే వారు కూడా హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి కొనుగోలు చేస్తుంటారు. గురువారం 10 కిలోలు రూ.450 నుంచి రూ.500 వరకు ధర పలికింది. సాధారణంగా వారానికి ఆరు లారీల ఉల్లి అనకాపల్లికి దిగుమతి అవుతుంటాయి. అయితే కొద్ది రోజుల నుంచి ధరలు పెరుగుతుండడంతో వారానికి మూడు లేదా నాలుగు లారీల ఉల్లిని మాత్రమే ఇక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఏటా ఈ సమయానికి మన రాష్ట్రంలోని కర్నూలు మార్కెట్‌కు ఉల్లిపాయలు వచ్చేవని, కానీ ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పంట ఆలస్యమైందని, ఈ కారణంగానే మహారాష్ట్రలో ఉల్లి ధరలను వ్యాపారులు పెంచేశారని అనకాపల్లి వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. కర్నూలు ఉల్లి పంట అందుబాటులోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంటుని చెబుతున్నారు.
ఎలమంచిలిలో..
ఎలమంచిలి హోల్‌సేల్ మార్కెట్ నుంచి స్థానిక వ్యాపారులతోపాటు రాంబిల్లి, అచ్యుతాపురం, ఎస్.రాయవరం మండలాల్లోని పలు గ్రామాల చిరువ్యాపారులు ఉల్లిపాయలు కొనుగోలు చేస్తుంటారు. ఎలమంచిలికి రోజూ తునిలోని టోకు వ్యాపారుల నుంచి 10 నుంచి 12 టన్నుల వరకు ఉల్లిపాయలు దిగుమతి అవుతుంటాయి. పట్టణంలో 20 వరకు కూరగాయలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీరి ద్వారా సాధారణ వినియోగదారులు ఉల్లిపాయలు, కూరగాయలు కొంటుంటారు. ఎలమంచిలిలో గురువారం కిలో ఉల్లిపాయలు రూ.50కి విక్రయించారు. జూన్ మొదటి వారంలో కిలో రూ.25 ఉండేదని, జూలై మొదటి వారంలో రూ.35కు చేరిందని, తరువాత నుంచి ధర క్రమంగా పెరుగుతున్నదని వ్యాపారులు చెబుతున్నారు.
నర్సీపట్నంలో..
నర్సీపట్నం హోల్‌సేల్ వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటారు. ఏటా ఆగస్టులో కర్నూలు ఉల్లిపాయలు మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ సమయంలో ఉల్లి ధరలు అందుబాటులో వుంటాయి. అయితే ఈ ఏడాది వర్షాభావంతో చాలా మంది రైతులు ఉల్లి పంట వేయలేదని, దీంతో ఏపీ మొత్తం మహారాష్ట్ర ఉల్లి మీద ఆధారపడడంతో ధరలు పెరుగుతున్నాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. నర్సీపట్నంలో హోల్‌సేల్ మార్కెట్‌లో మొదటి రకం ఉల్లిపాయలు పది కిలోలు రూ.480, రెండో రకం రూ.400కు విక్రయిస్తున్నారు. రిటైల్ వ్యాపారులు మొదటి రకం ఉల్లి కిలో రూ.55కి, రెండో రకం కిలో రూ.45కి విక్రయిస్తున్నారు. రెండు రోజుల్లో కిలో రూ.60కి పెరగొచ్చు అని హోల్‌సేల్ వర్తకులు అంటున్నారు.
: