సమస్యల వలయంలో పీహెచ్‌సీ
ABN , Publish Date - May 03 , 2026 | 11:06 PM
మండలంలో అతి పెద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలతో సతమతమవుతోంది. నిత్యం రోగులతో రద్దీగా ఉండే రాజేంద్రపాలెం పీహెచ్‌సీని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది.
వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
మూలకు చేరిన ఆర్వో ప్లాంట్
రోగులకు తప్పని అవస్థలు
కొయ్యూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో అతి పెద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలతో సతమతమవుతోంది. నిత్యం రోగులతో రద్దీగా ఉండే రాజేంద్రపాలెం పీహెచ్‌సీని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. అంతేకాదు పీహెచ్‌సీలో రోగులకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
మండలంలో ఉన్న నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రాజేంద్రపాలెం పీహెచ్‌సీ పరిధి చాలా పెద్దది. ఈ పీహెచ్‌సీ పరిధిలో 15 సచివాలయాలు, 8 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఈ పీహెచ్‌సీలో గడిచిన 20 రోజులుగా ఒక్కరే డాక్టరు విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఇద్దరు వైద్యులను నియమించారు. వారిలో ఒకరైన స్నేహలత రెడ్డి 20 రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఒక్క వైద్యుడే ఉన్నారు. రోజుకు ఈ పీహెచ్‌సీకి సుమారు 150 మంది రోగులు వస్తుంటారు. వీరందరికీ ఒక్క వైద్యుడే సేవలందించడం కష్టంగా ఉంది. దీంతో చాలా మంది రోగులు పీహెచ్‌సీకి రాకుండా ప్రైవేటు ఆస్పత్రులు, ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పీహెచ్‌సీ పరిధిలోని మూడు సబ్‌సెంటర్లకు ఏఎన్‌ఎంలు లేరు. ప్రస్తుతం సచివాలయ ఏఎన్‌ఎంలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఇక్కడ పనిచేసే స్టాఫ్‌నర్సుకు డిప్యూటేషన్ వేయడంతో పీహెచ్‌సీలో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ముఖ్యంగా అత్యవసర పనిపై ఒక్కగానొక్క వైద్యుడు సెలవు పెడితే ఆ రోజు రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇక పీహెచ్‌సీలో ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్ నెల రోజుల క్రితమే పాడై మూలకు చేరింది. దీని మరమ్మతులు చేయించేందుకు కాంట్రాక్టరుకు సిబ్బంది సమాచారమందించారు. కాంట్రాక్టు కాల వ్యవధి పూర్తయినందున ఆ కాంట్రాక్టర్ స్పందించలేదు. దీంతో మండు వేసవిలో తాగునీరు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వైద్య పరీక్షలకు నిర్మించిన ల్యాబ్ భవనం సిద్ధంగా ఉన్నా అవసరమైన మెటీరియల్ సరఫరా కాక ఆరు నెలలుగా వృథాగా ఉంది. రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది, సౌకర్యాల కల్పనకు కలెక్టర్, డీఎంహెచ్‌వోలు చర్యలు తీసుకోవాలని పీహెచ్‌సీ పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.