Share News

రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీగా పీజీఎస్‌ కళ్యాణి

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:06 AM

రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ విశాఖపట్నం జిల్లా డీఐజీగా పీజీఎస్‌ కళ్యాణిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీగా పీజీఎస్‌ కళ్యాణి

విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ విశాఖపట్నం జిల్లా డీఐజీగా పీజీఎస్‌ కళ్యాణిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె గత నెలాఖరు వరకు పర్యాటక శాఖలో విశాఖపట్నం రీజనల్‌ డైరెక్టర్‌గా డిప్యూటేషన్‌పై పనిచేశారు. నెల రోజుల సెలవు అనంతరం తిరిగి మాతృశాఖకు వచ్చారు. విశాఖలో పనిచేస్తున్న డీఐజీ బాలకృష్ణ ఐఏఎస్‌కు ఎంపికై ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. దాంతో కళ్యాణిని ఆ పోస్టులో నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని సూచించింది.


టెట్‌కు 91.37 శాతం హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మంగళవారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 1,576 మందికిగాను 1,440 మంది (91.37 శాతం) హాజరయ్యారు. ఉదయం షీలానగర్‌లోని ఐయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో 535 మంది, పెదగంట్యాడలోని ఎస్‌వీఎస్‌ టెక్నాలజీస్‌లో 162 మంది, కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో 82 మంది,నరవ విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 175 మంది, మధ్యాహ్నం షీలానగర్‌లోని ఐయాన్‌ డిజిటల్‌లో 380, పెదగంట్యాడలోని ఎస్‌వీఎస్‌ టెక్నాలజీస్‌లో 106 మంది హాజరైనట్టు డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు.


మీడియాతో మాట్లాడొద్దు

సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టొద్దు

ఉద్యోగులకు స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం సర్క్యులర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ ప్లాంటులో పనిచేసే ఉద్యోగులు ఎవరూ మీడియాతో కర్మాగారానికి సంబంధించిన అంశాలపై మాట్లాడకూడదని, ఎటువంటి ప్రకటనలు చేయకూడదని పేర్కొంటూ యాజమాన్యం సోమవారం రాత్రి సర్క్యులర్‌ జారీ చేసింది. సోషల్‌ మీడియాలో సైతం ఎటువంటి పోస్టులు పెట్టకూడదని పేర్కొంది. ఇటీవల ప్లాంటు ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఇంతకుముందు పనిచేసిన యాజమాన్య ప్రతినిధులు కమీషన్లకు ఆశపడి నాసిరకం ముడి పదార్థాలు కొనేశారు. వాటిని ఉపయోగించడం వల్ల సరైన ఉత్పత్తి రావడం లేదు. అదేవిధంగా గత నాలుగేళ్లుగా ప్లాంటులో నిర్వహణ పనులు చేయడం లేదు. ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. వీటిపై ఉద్యోగులు మీడియాకు సమాచారం ఇస్తున్నారు. దీనివల్ల ప్లాంటు పరపతి పోతున్నదని, అప్పులు పుట్టడం లేదని ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. దానికి పరిష్కారంగా నెల నెల పూర్తి జీతాలు ఇవ్వడం, అలవెన్సులు పునరుద్ధరించడం, నిర్వహణ పనులు చేపట్డడం వంటి చర్యలు చేపట్టాలి. కానీ అవేమీ చేయడం లేదు. పైగా పని గంటలు పెంచుకుంటూ పోతున్నారు. నాసిరకం ముడి పదార్థాలే అందిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా నష్టం ఏర్పడుతోంది. వీటికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపించాలని, అధికార, కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్లాంటులో పరిస్థితులు రోజుకొకలా ఉండడం వల్ల భవిష్యత్తు ఏమవుతుందోనని ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఇవన్నీ పత్రికల్లో వార్తాంశాలుగా రావడాన్ని యాజమాన్యం తట్టుకోలేకపోతోంది. అంతిమంగా సర్క్యులర్‌తో అందరి నోళ్లకు తాళాలు వేయాలని యత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు సమస్యలు లేకుండా చేస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా?, అ ప్రయత్నం చేయవచ్చు కదా?..అంటూ పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సింహాచలం ఈఓపై జేసీ విచారణ

సీతంపేట ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న సమయంలో ఏసీబీ కేసు నమోదు

విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జల్లేపల్లి వెంకటరావుపై నమోదైన ఏసీబీ కేసులో వాస్తవాలు ఏమిటో తేల్చి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం విశాఖ జేసీ విద్యాధరిని ఆదేశించింది. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వచ్చాయి. వెంకటరావు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయం (2016)లో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, బంధువుల గృహాల్లో సోదాలు నిర్వహించారు. అప్పట్లోనే రూ.1.1 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అందులో ఫ్లాటు, స్థలాలు, పొలాలు ఉన్నాయి. వాటి అప్పటి మార్కెట్‌ విలువ రూ.10 కోట్లుగా ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఆ కేసుపై ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేసి, నివేదికను ఆరు వారాల్లో ఇవ్వాలని ఆదేశించింది. అదీ విశాఖపట్నం జేసీకి ఇవ్వడం విశేషం.


ప్రపంచ ఏనుగుల దినోత్సవం రేపు

నగరంలో కార్యక్రమానికి కేంద్ర మంత్రి

భూపేందర్‌యాదవ్‌, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని గురువారం రుషికొండలోని రాడిసిన్‌బ్లూ హోటల్‌లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖా మంత్రి భూపేందర్‌యాదవ్‌, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌, కేంద్ర అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, దేశంలో అన్ని రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. అయితే బుధవారం ‘ఏనుగులు, మనుషుల మధ్య ఘర్షణ, సంబంధాలు, వాటి రక్షణ’పై వర్క్‌షాపు నిర్వహించనున్నారు. కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చలపతిరావు, ఇతర ఉన్నతాధికారులు నగరానికి చేరుకున్నారు.

Updated Date - Aug 12 , 2026 | 01:06 AM