Share News

గ్రామ స్థాయిలో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:40 AM

జిల్లాలో ఇకపై ప్రతి సోమవారం గ్రామ స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ (మీకోసం.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

గ్రామ స్థాయిలో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన జేసీ టి.శ్రీపూజ, డీఆర్‌వో లోకేశ్వరరావు

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

క్షేత్ర స్థాయి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపాలని సూచన

పాడేరు, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇకపై ప్రతి సోమవారం గ్రామ స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ (మీకోసం.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇకపై ప్రతి సోమవారం ఒక పంచాయతీ పరిధిలోని గ్రామంలోనే పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాలని, అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రఽధానంగా గ్రామ స్థాయిలోని ప్రజల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, వాటిని వారికి చేరువ చేయాలని. ఈ క్రమంలో ఏర్పడే సమస్యలను అధికారులు పరిష్కరించాలన్నారు. అలాగే పీజీఆర్‌ఎస్‌ నిర్వహించే గ్రామంలో మండల, పంచాయతీ స్థాయి అధికారులంతా హాజరైన ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపడుతున్నామని, అధికారులు ప్రత్యేక శ్రద్ధతో గ్రామ స్థాయి పీజీఆర్‌ఎస్‌ను విజయవంతం చే యాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో స్వీకరించిన వినతులను విధిగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని, వాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం చూపాలని ఆమె పేర్కొన్నారు.

సర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

జిల్లాలో భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు చేపడుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. జిల్లాలో సర్‌( స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియపై జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజతో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాలకు సంబంఽధించిన ఫారాల పంపిణీ కేవలం బూత్‌ స్థాయి అధికారులు మాత్రమే ఓటర్లకు పంపిణీ చేయాలని, ఇతరులతో వాటిని పంపిణీ చేయించవద్దన్నారు. అలాగే బూత్‌ స్థాయి అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు, ఓటర్లు సమర్పించిన ఫారాల వివరాలను యాప్‌లో నమోదు, తదితర అధికారిక ప్రక్రియలపై ఆమె పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాల సవరణ నేపథ్యంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదని, ఒకటికి రెండు మార్లు పరిశీలన జరపాలన్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో ఉండే సచివాలయ సిబ్బందితో బూత్‌ స్థాయి అధికారులు సమన్వయం చేసుకుని సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.భుజంగరావు, సర్‌ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:40 AM