విమ్స్‌లో పీజీ మెడికల్ కాలేజీ.!
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:06 AM
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రెండేళ్ల క్రితమే ఆస్పత్రి అధికారులు ప్రతిపాదనలు పంపగా, తాజాగా డీఎంఈ కార్యాలయ అధికారులు కొన్ని మార్పులు సూచించడంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఫైల్‌ను పంపించారు.
రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపిన అధికారులు
తాజాగా మార్పులు సూచించిన డీఎంఈ అధికారులు
కొద్దిరోజుల్లో కీలక ప్రకటనకు అవకాశం
అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే వీలు
విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రెండేళ్ల క్రితమే ఆస్పత్రి అధికారులు ప్రతిపాదనలు పంపగా, తాజాగా డీఎంఈ కార్యాలయ అధికారులు కొన్ని మార్పులు సూచించడంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఫైల్‌ను పంపించారు.
విమ్స్ అప్‌గ్రెడేషన్ ప్రక్రియలో భాగంగానే పీజీ మెడి కల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను చేసినట్టు చెబు తున్నారు. స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ కాలేజీకి మంజూ రైతే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా విమ్స్ అప్‌గ్రేడ్ అవు తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే మొత్తంగా 13 సూపర్ స్పెషాలిటీ కోర్సులు, మరో ఐదు పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సులు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుంది. వీటిలో ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, గ్యాస్ర్టో ఎంట్రాలజీలో సర్జికల్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీలో సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, రేడియోథెరపీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, వాస్కులార్ సర్జరీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటికి అనుబంధంగా జనరల్ మెడిసిన్, ఆర్థో, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్, సర్జరీ, అనస్థీషియా విభాగాలకు సంబంధించిన పీజీ కోర్సులు నిర్వహించనున్నారు. ఆయా డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించి రెండు చొప్పున సూపర్ స్పెషాలిటీ సీట్లు, ఐదు చొప్పున పీజీ సీట్లు అందుబాటు లోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఇందుకోసం ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. ఈ పోస్టులను మంజూరు చేయాలని ఆస్పత్రి అధికారులు డీఎంఈకు విజ్ఞప్తి చేశారు. దీనిపైనా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మెరుగైన సేవలకు అవకాశం..
విమ్స్‌లో పీజీ కాలేజీ ఏర్పాటు చేసే పనిలో ఆస్పత్రి అధికారులున్నారు. ముందుగా లైబ్రరీ, వసతిగృహాలు ఏర్పాటుకు అవకాశాలు, భవనాలను చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటైతే ఆయా విభాగాలకు సంబంధించిన వార్డులు అందుబాటులోకి వస్తాయి. పడకల సంఖ్య పెరుగుతుంది. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సాంకేతిక నిపుణులు పెరుగుతారు. వేయికిపైగా పడకలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. డీఎంఈ కార్యా లయం నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరోగ్యశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపాం. కొన్ని రిమార్క్స్ అడిగితే వెంటనే అందించాం. మెడికల్ కాలేజీ మంజూరైతే మరిన్ని విభాగాల్లో ఎక్కువ మంది రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు వీలుంటుంది. విమ్స్‌ను అత్యాధునిక వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దే ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. పీజీ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన కొన్ని పోస్టులను కావాలని అడిగాం.
- డాక్టర్ వి.మన్మథరావు, విమ్స్ డైరెక్టర్