పాడేరులో పెట్రోల్ కొరత
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:37 AM
పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం జిల్లా కేంద్రం పాడేరులో పెట్రోల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా పెట్రోల్ లభించకపోవడంతో ద్విచక్ర వాహనచోదకులతో పాటు కార్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
బైక్, కార్ల యజమానులకు తప్పని అవస్థలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం జిల్లా కేంద్రం పాడేరులో పెట్రోల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా పెట్రోల్ లభించకపోవడంతో ద్విచక్ర వాహనచోదకులతో పాటు కార్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఏడు బంకులుండగా, సోమవారం దాదాపుగా అన్ని బంకుల్లోనూ పెట్రోల్ లేకపోగా, సగం బంకుల్లో డీజిల్ సైతం లేదని వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ మేరకు ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ పెట్టి, నగదు డీడీలు తీసినప్పటికీ సకాలంలో ఆయిల్ ఇవ్వడం లేదని బంకు యజమానులు చెబుతున్నారు. విశాఖపట్నంలోని ఆయా ఆయిల్ కంపెనీలకు వచ్చే నిల్వల ఆధారంగా మాత్రమే ఇక్కడకు సరఫరా జరుగుతుండడంతో ఎప్పుడు డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంటాయనేది కచ్చితంగా వినియోగదారులకు తెలియని పరిస్థితి నెలకొంటున్నది. తాజా పరిస్థితుల్లో తమ బంకుల్లో చమురు నిల్వలపై కచ్చితంగా ఏమీ చెప్పలేమని యజమానులు అంటున్నారు. ఈ పరిణామాలు వినియోగదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.