Share News

పెట్రో బాదుడు

ABN , Publish Date - May 15 , 2026 | 11:58 PM

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంతో వినియోగదారులపై భారం పడింది. లీటరు పెట్రోల్‌పై రూ.3.3, డీజిల్‌పై రూ.3.15 పెంచడంతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు సుమారు రూ.90 లక్షల అదనపు భారం పడనుంది.

పెట్రో బాదుడు
అనకాపల్లి- సబ్బవరం జాతీయ రహదారిలోని పెట్రోల్‌ బంకు

లీటరు పెట్రోల్‌పై రూ.3.3, డీజిల్‌పై రూ.3.15 పెంపు

జిల్లా వినియోగదారులపై నెలకు సుమారు రూ.90 లక్షల అదనపు భారం

రవాణా చార్జీలు, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంతో వినియోగదారులపై భారం పడింది. లీటరు పెట్రోల్‌పై రూ.3.3, డీజిల్‌పై రూ.3.15 పెంచడంతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు సుమారు రూ.90 లక్షల అదనపు భారం పడనుంది.

జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం ఐఓసీ, బీపీసీ, హెచ్‌పీసీలకు చెందిన 161 పెట్రోలు బంకులు ఉన్నాయి. రోజుకు పెట్రోలు 40 వేల లీటర్లు, డీజిల్‌ 50 వేల లీటర్లు వినియోగం అవుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, లారీలు, వ్యవసాయ యంత్రాల వినియోగానికి ఇంధన అవసరం అధికంగా ఉండడంతో ధరల పెంపు భారం నేరుగా ప్రజలపై పడనుంది. ప్రతి రోజు 40 వేల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతుండగా, వాడకందారులపై రోజుకు రూ.1.32 లక్షలు, డీజిల్‌ వినియోగదారులపై రోజుకు రూ.1.57 లక్షల అదనపు భారం పడనుంది. తాజా పెంపుతో ప్రతి లీటరుపై అదనంగా రూ.3.3 చెల్లించాల్సి రావడంతో నెలవారీగా జిల్లాలో ఇంధన వినియోగదారులపై రూ.90 లక్షల భారం పడనుందని అంచనా వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు ప్రభావం సరుకు రవాణాపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. దీంతో కూరగాయాలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో డీజిల్‌ వినియోగం అధికంగా ఉండడంతో రైతులపై అదనపు భారం పడనుంది. ఇప్పటికే వంట గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజలు ఇంధన ధరల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి ఇంధన ధరలను నియంత్రించాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో లీటరు పెట్రోల్‌, డీజిల్‌ పాత, కొత్త ధరలు ఇలా..

ఇంధనం పాత ధర (రూ.లలో) కొత్త ధర (రూ.లలో)

పెట్రోల్‌ 108.38 111.68

పవర్‌ పెట్రోల్‌ 117.63 120.92

డీజిల్‌ 96.26 99.41

---------------------------------------------------

Updated Date - May 15 , 2026 | 11:58 PM